International masters cricket league 2025: ఒక వయసుకు వచ్చిన తర్వాత ఏ మనిషికైనా సరే శరీరం ఒకప్పటి విధంగా సహకరించదు. శరీరం ఉత్తేజం గా ఉండదు. కానీ కొందరి విషయంలో ఇలా ఉండదు. వారిలో వయసు పెరుగుతున్నప్పటికీ శరీరం నిత్య నూతనంగా ఉంటుంది. ఉత్తేజితంగా కనిపిస్తుంది.. చైతన్యవంతమైన పనులు చేస్తూ ఉంటుంది. ఈ జాబితాలో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ముందు వరుసలో ఉంటాడు.
ప్రస్తుతం మాస్టర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ (master league cricket tournament) జరుగుతోంది. అన్ని జట్లలో ఆయా లెజెండరీ ఆటగాళ్లు ఆడుతున్నారు. అయితే భారత్ – శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తిరిమన్నే(24) ను ఇర్ఫాన్ పఠాన్( Irfan Pathan) అవుట్ చేశాడు.. ఇర్ఫాన్ బౌలింగ్లో తిరిమన్నే భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. బంతిని కూడా లాంగ్ ఆన్ లోకి ఆడాడు. అయితే ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న యువరాజ్ సింగ్ అమాంతం గాల్లోకి ఎగిరి పట్టుకున్నాడు.. అంతే తిరి మన్నె షాక్ కు గురయ్యాడు. నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం యువరాజ్ సింగ్ వయసు 43 సంవత్సరాలు. గతంలో అతడు టీమిండియాకు ఆడినప్పుడు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పాడు. టీమ్ ఇండియాలో మరో జాండీ రోడ్స్ గా పేరు తెచ్చుకున్నాడు.. 2007 టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టుపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇప్పటికి ఆ రికార్డును ఏ ఆటగాడు కూడా బద్దలు కొట్టలేకపోయాడు. ఇక 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో రక్తం కక్కుకుంటూ కూడా టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. సుదీర్ఘకాలం తర్వాత టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించడంలో కీలక భూమిక పోషించాడు.
ఏజ్ అనేది నెంబర్ మాత్రమే
నలభై మూడు సంవత్సరాల వయసులోనూ యువరాజ్ ఇప్పటికీ అదే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకున్నప్పటికీ… అతడు శరీర సామర్థ్యాన్ని పెంచుకునే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. పైగా క్యాన్సర్ ను ఎలా జయించాలో అనేక సందర్భాల్లో చెప్పాడు. క్యాన్సర్ రోగుల్లో సాంత్వన కలిగించే మాటలు మాట్లాడాడు. అంతేకాదు హైదరాబాద్ జట్టులో విధ్వంసకర ఓపెనర్ గా పేరుపొందిన అభిషేక్ శర్మకు కోచింగ్ ఇచ్చింది యువరాజ్ సింగే. ఇక మాస్టర్స్ క్రికెట్ లీగ్ లో యువరాజ్ సింగ్ ఫీల్డింగ్లో మెరుపులు మెరిపించాడు. శ్రీ లంకతో జరిగిన మ్యాచ్లో తిరిమన్నె కొట్టిన బంతిని క్యాచ్ పట్టి యువరాజ్ అదరగొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. టీమిండియాలో బిన్నీ(66), సింగ్ మాన్(45) యువరాజ్ సింగ్(31*), యూసఫ్ పటాన్ (56*) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక నిర్ణీత 20వ ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఇర్ఫాన్ పఠాన్ మూడు వికెట్లు తీశాడు. మిథున్, వినయ్ కుమార్, కులకర్ణి తలా రెండు వికెట్లు పడగొట్టారు. శ్రీలంక జట్టులో సంగక్కర 51, జే. మెండిస్ 41 పరుగులతో టాప్ స్కోరర్లు గా నిలిచారు.
YUVRAJ SINGH AT AGE OF 43 – STILL TAKING STUNNERS. pic.twitter.com/XHW1iQ0NY5
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 22, 2025