https://oktelugu.com/

Happy Birthday Abhishek Sharma : ఆరు బాళ్లకు ఆరు సిక్సర్లే కాదు.. శిష్యుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంలోనూ యువరాజ్ ది అదే శైలి..

యువరాజ్ సింగ్.. టి20 క్రికెట్ చరిత్రలో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి.. సరికొత్త ఘనతను సృష్టించిన టీమిండియా ఆటగాడు.. క్యాన్సర్ ను జయించి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన క్రికెట్ యోధుడు. అటువంటి ఈ ఆటగాడు ఏం చేసినా సంచలనమే.. అతడి శిష్యుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంలోనూ అతడు అదే ధోరణి కొనసాగించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 4, 2024 / 01:28 PM IST

    Happy Birthday Abhishek Sharma

    Follow us on

    Happy Birthday Abhishek Sharma :  ఇటీవలి ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ముంబై, బెంగళూరు జట్లపై అతడు బ్యాట్ తో శివతాండవం చేశాడు.. పెద్ద పెద్ద బౌలర్ల బౌలింగ్ ను తుత్తునీయలు చేశాడు. అత్యంత సులభంగా పరుగులు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.. అంతేకాదు ఇటీవల జింబాబ్వే తో జరిగిన టి20 టోర్నీలో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.. హరారే లో జరిగిన ఈ మ్యాచ్ లో ఎనిమిది సిక్సర్లు, 7 బాండరీలు సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ తో కలిసి అనితర సాధ్యమైన రికార్డులను నెలకొల్పాడు. 16 మ్యాచ్లలో 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో 484 రన్స్ చేశాడు.. ఇందులో అతడు ఏకంగా 42 సిక్సర్లు కొట్టాడు. అంతేకాదు సిక్స్ హిట్టింగ్ చార్ట్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ, క్లాసెన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు కూడా అభిషేక్ శర్మ తర్వాతనే ఉండడం విశేషం.

    అభిషేక్ శర్మ బుధవారంతో 23వ వడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి టీం ఇండియా మాజీ స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ బ్యాటింగ్ లో మెలకువలు నేర్పాడు. అభిషేక్ శర్మ జన్మదిన సందర్భంగా ట్విట్టర్లో ఒక వీడియోని కూడా పంచుకున్నాడు. ఈ వీడియోతో పాటు ఒక సందేశాన్ని కూడా అతడికి తెలియజేశాడు..” హ్యాపీ బర్త్ డే టు యు సార్.. ముందు మీరు సింగిల్స్ ప్రాధాన్యాన్ని గుర్తించండి. నేను చెబుతున్నది వినిపించుకోండి. బంతిని పార్క్ అవతాలికి పంపించడం మాత్రమే కాదు.. సింగిల్స్ కూడా తీస్తారని ఈ సంవత్సరం ఆశిస్తున్నాను. మీరు కష్టపడి పని చేస్తూనే ఉండండి.. వచ్చే సంవత్సరం మీకు అత్యంత గొప్పగా ఉండాలి. ప్రేమతో మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని యువరాజ్ సింగ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. యువరాజ్ సింగ్ పోస్ట్ చేసిన వీడియోలో అభిషేక్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు కనిపించాడు. అతడికి యువరాజ్ సింగ్ సలహాలు, సూచనలు ఇస్తున్నాడు.. అంతేకాదు బంతిని కొడుతున్నప్పుడు బ్యాట్ ను కిందకి దించి ఆడాలని.. లాఫ్టెడ్ షాట్ లను ఆడొద్దని యువరాజ్ సింగ్ అతడికి చెబుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఇక యువరాజ్ సింగ్ అభిషేక్ శర్మ, గిల్, అన్మోల్ ప్రీత్ సింగ్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ వంటి ఆటగాళ్లకు మెంటార్ గా వ్యవహరించాడు. కోవిడ్ సమయంలో యువరాజ్ పై క్రీడాకారులకు తన ఇంటికి సమీపంలో ఐదు వారాల పాటు క్రికెట్లో శిక్షణ ఇచ్చాడు. ప్రస్తుతం వారంతా వర్ధమాన క్రికెటర్లుగా అభివృద్ధిలోకి వచ్చారు.