https://oktelugu.com/

Chiranjeevi: వరదలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలు, చిరంజీవి ఔదార్యం… మెగాస్టార్ చేసిన పనికి ప్రశంసలు!

తెలుగు రాష్ట్రాలు వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. పలు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. కాగా వరద బాధితులను ఆదుకునేందుకు చిరంజీవి ముందుకు వచ్చారు.

Written By:
  • S Reddy
  • , Updated On : September 4, 2024 / 01:25 PM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi: ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల కృష్ణానది ఉప్పొంగింది. విజయవాడ నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. విజయవాడ నగరం ఎన్నడూ చూడని వరద ముంచెత్తింది. కోట్ల రూపాయల ఆస్తి నష్టం చోటు చేసుకుంది. వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. టీవీలు, ఫ్రిజ్ లతో పాటు విలువైన సామాగ్రి నాశనం అయ్యాయి.

    రెండు రోజులుగా జలదిగ్బంధంలో జనాలు చిక్కుకుపోయారు. తిండి, నీరు లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కాగా వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీ, తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ ముందుకు వచ్చింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. సామాజిక సేవలో ముందుండే చిరంజీవి సైతం పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం ప్రకటించారు.

    ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు… ”తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి.

    మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్ చేశాడు.

    చిరంజీవి ఔదార్యాన్ని అభిమానులు కొనియాడుతున్నారు. కాగా ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు వశిస్ట్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా భారీగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. విశ్వంభర 2025 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. విశ్వంభర సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి బర్త్ డే కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.