Prithvi Shaw: భారత క్రికెట్ జట్టుకు చెందిన యువ ఓపెనర్ పృథ్వి షా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీలో ఫస్ట్ సెషన్ లో రెండు శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. టెస్ట్ క్రికెట్ లో తనను ఎందుకు స్పెషల్ అంటారో మరోసారి నిరూపించాడు. గాయం కారణంగా ఆరు నెలలపాటు ఆటకు దూరమైనప్పటికీ పృథ్వీ షా రీ_ ఎంట్రీ ఘనంగా ఇచ్చాడు. తాను ఆడిన రెండో మ్యాచ్ లోనే మెరుపు శతకం సాధించాడు. చత్తీస్ గడ్ లో జరుగుతున్న మ్యాచ్లో అతడు 107 బంతులను ఎదుర్కొని శతకం సాధించాడు. అతడు మొత్తంగా 185 బంతులు ఆడి 18 ఫోర్లు, మూడు సిక్స్ లతో 159 పరుగులు సాధించాడు. తొలి రోజు భోజనం సమయంలోనే రెండు సార్లు పృథ్వీ షా శతకం నమోదు చేసి అరుదైన ఘనత సాధించాడు.
పృథ్వీ షా గతంలో అస్సాంతో జరిగిన మ్యాచ్లో 383 బంతులు ఎదుర్కొని 379 పరుగులు చేశాడు. ఈ స్కోరుతో రంజి క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత పరుగులు నమోదు చేసిన రెండవ బ్యాటర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో తొలి రోజు ఫస్ట్ సెషన్ లోనే పృథ్వీ షా శతకం పూర్తి చేయడం విశేషం. మరో బ్యాటర్ భూపేన్ లాల్వాని(102)తో కలిసి తొలి వికెట్ కు 244 పరుగుల భాగస్వామ్యాన్ని పృథ్వి షా జోడించాడు. దీంతో ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్ లో 351 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా, భూపెన్ లాలాని తప్ప మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు.
ఈ మ్యాచ్ లో ఆశీష్ చౌహన్ 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. 105 పరుగులు ఇచ్చి అతడు ఈ ఘనత సాధించాడు. రవి కిరణ్ 53 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. విశ్వాసమాలిక్ 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఆరు నెలల క్రితం ఇంగ్లాండ్ కౌంటింగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా రాయల్ లండన్ వన్డే కప్ లో పృథ్వీ షా తీవ్రంగా గాయపడ్డాడు. రాయల్ వన్డే కప్ లో గాయానికి ముందు నార్తంప్టన్ షైర్ జట్టు తరఫున శతకాల మోత ఒక డబుల్ సెంచరీ తో పాటు విధ్వంసకరమైన సెంచరీ బాదాడు. మ్యాచ్లో భాగంగా ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. మోకాలికి తీవ్రమైన గాయం కావడంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకున్నాడు. ఆరు నెలల పాటు చికిత్స పొంది పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. రంజీ ట్రోఫీ 2024 లో బెంగాల్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు.
పృథ్వీ షా అండర్ 19 ప్రపంచకప్ విజయంతో టీం ఇండియా లోని రాకెట్ లాగా దూసుకు వచ్చాడు. అలాగే జట్టుకు దూరమయ్యాడు. రంజి క్రికెట్లో శతకాల మోత మోగించిన అతడు.. బలహీనమైన బ్యాటింగ్ టెక్నిక్, అనవసర వివాదాలు, ఫిట్ నెస్ కోల్పోవడం వంటివి పృథ్వీ షా ఆట తీరును తీవ్రంగా ప్రభావితం చేశాయి. అప్పట్లో పృథ్వీ ని మరో వీరేంద్ర సెహ్వాగ్ లాగా ఆడతాడు అని అందరూ భావించారు. కానీ చివరకు దేశ వాళీ స్టార్ గానే పృథ్వీ షా మిగిలిపోయాడు.