Yashasvi Jaiswal : సెంచరీ కొట్టి కూలబడిపోయిన యశస్వి.. నాలుగో రోజు ఏం జరగనుంది?

.వేల కోట్ల వ్యాపారం చేస్తున్న బీసీసీఐ ఇలా జరుగుతుంటే ఏం చేస్తోంది? అనేది ఇప్పటికీ సమాధానం లభించని మిలియన్ డాలర్ల ప్రశ్న.

Written By: NARESH, Updated On : February 17, 2024 10:36 pm
Follow us on

Yashasvi Jaiswal :  కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. అయ్యర్ పరిస్థితి కూడా అంతే.. ఇప్పట్లో కోలుకుంటాడో? లేదో ? కూడా డౌటే?.. మూడో టెస్ట్ ప్రారంభం వరకు రవీంద్ర జడేజా కూడా గాయంతోనే ఇబ్బంది పడ్డాడు.. వీరు మాత్రమే కాదు ఇంకా చాలామంది క్రీడాకారులు గాయాలతోనే బాధపడుతున్నారు. ఆటలో గాయపడటం.. ఆ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లడం.. అక్కడ చికిత్స పొందడం.. మళ్లీ మైదానంలో అడుగుపెట్టడం.. వెంటనే గాయపడటం ఇదంతా ఒక సైకిల్ లాగా జరుగుతున్నది. వేల కోట్ల వ్యాపారం చేస్తున్న బీసీసీఐ ఇలా జరుగుతుంటే ఏం చేస్తోంది? అనేది ఇప్పటికీ సమాధానం లభించని మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ గాయాల జాబితాలోకి మరో ఆటగాడు చేరినట్టు ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవగతమవుతోంది.

రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడవరోజు ఆటలో అన్ని రంగాల్లో ఇంగ్లాండ్ జట్టు పై పై చేయి సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 207/2 తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టును 112 పరుగుల వ్యవధిలోనే భారత బౌలర్లు కట్టడి చేశారు.. డక్కెట్ మినహా మిగతా వారెవరినీ కుదురుకొనివ్వలేదు.. సిరాజ్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టును చావు దెబ్బ తీశాడు. రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా చెన్నై వెళ్లిపోయినప్పటికీ ఆ ప్రభావం జట్టు మీద కనిపించకుండా రోహిత్ శర్మ అందుబాటులో ఉన్న బౌలర్లతోనే మార్చి మార్చి బౌలింగ్ చేయించి.. ఇంగ్లాండ్ జట్టును భారీ స్కోరు చేయనీయకుండా కట్టడి చేశాడు.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 30 పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అయితే ఈ ఆనందాన్ని ఇంగ్లాండ్ జట్టుకు యశస్వి జైస్వాల్ ఎంతో సేపు ఉండనీయలేదు. మరో ఓపెనర్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నాన్ని భుజాన వేసుకున్నాడు. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లను ప్రతిఘటిస్తూ భారత జట్టు స్కోర్ ను ముందుకు నడిపారు. రెండో వికెట్ కు రికార్డు స్థాయిలో 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే(9 ఫోర్లు, 5 సిక్స్ లు) యశస్వి జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి జోరు చూస్తుంటే రెండవ టెస్టులాగానే డబుల్ సెంచరీ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. వ్యక్తిగత స్కోర్ 104 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడు తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతూ రిటైర్డ్ హర్ట్ గా మైదానం నుంచి వెనుతిరిగాడు. హాఫ్ సెంచరీ వరకు నిదానంగా ఆడిన జైస్వాల్.. తర్వాత జోరు పెంచాడు. తదుపరి 50 పరుగులు పూర్తి చేయడానికి అతడు కేవలం 42 బంతులు మాత్రమే తీసుకున్నాడు. సెంచరీ పూర్తయిన తర్వాత అతడికి తీవ్రమైన వెన్ను నొప్పి రావడంతో మైదానం నుంచి వెళ్ళిపోయాడు. జైస్వాల్ వెన్నునొప్పితో బాధపడడాన్ని చూసి కెప్టెన్ రోహిత్ శర్మ ఆందోళన చెందాడు.. అయితే జైస్వాల్ కు నొప్పి తీవ్రంగా ఉండడంతో రిటైర్డ్ హర్ట్ గా ప్రకటించారు.. అతడి ఆరోగ్య పరిస్థితిపై కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ ఫిజియోథెరపిస్టులతో చర్చించారు. అయితే నాలుగు రోజు అతడు ఆడతాడా? లేదా? అనేది అనుమానంగానే ఉంది.

ఇక మూడో రోజు ఇన్నింగ్స్ ముగిసే సమయానికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్(64), కుల దీప్ యాదవ్(3) ఉన్నారు. ప్రస్తుతం భారత్ 322 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. జై స్వాల్ రిటైర్డ్ హర్ట్ బ్యాటింగ్ కు వచ్చిన రజిత్ పాటిదార్ పరుగులేమీ చేయకుండానే హార్ట్ లీ బౌలింగ్ లో రెహాన్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కాగా, రిటైర్డ్ హర్ట్ గా వెను తిరిగిన యశస్వి ఆదివారం ఆడతాడా? లేక అలానే ఉండిపోతాడా? అనేది తేలాల్సి ఉంది.