Yashasvi Jaiswal: జైస్వాల్ వయసు 22 సంవత్సరాలు మాత్రమే కావచ్చు.. కాకపోతే ఇప్పటికే అతడు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇకపై ఆడుతాడు.. అందులో సందేహం లేదు.. అనుమానం ఏమాత్రం అవసరం లేదు.. కానీ పెర్త్ టెస్టులో రెండవ ఇన్నింగ్స్ లో అతడు సాధించిన 111 (ఇంకా ఆడుతూనే ఉన్నాడు) పరుగులు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ ఇన్నింగ్స్ లో మేం పబ్లిష్ చేసిన ఫోటో ఖచ్చితంగా అతడు తన బెడ్రూంలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే స్టార్క్ వేసిన 19వ ఓవర్ మూడో బంతిని ఫోర్ కొట్టాడు యశస్వి..ఆ షాట్ స్టార్క్ ను మంత్ర ముగ్ధుడిని చేసింది. “ఇది నీ కెరియర్ లోనే బెస్ట్ షాట్” అనేలా చేసింది. ఆయనప్పటికీ జైస్వాల్ నిశ్శబ్దంగా ఉన్నాడు..ఆ షాట్ చూసిన తర్వాత స్టార్క్ తన లయను కోల్పోయాడు. ఏదో వేసామంటే బౌలింగ్ వేశాడు. కానీ అంతకంటే ముందు స్టార్క్ ను యశస్వి రెచ్చగొట్టాడు. సాధారణంగా ఆస్ట్రేలియా మైదానాలపై ఆస్ట్రేలియా బౌలర్లను రెచ్చగొట్టడం సరైన చర్య కాదు. ఇలాంటి పద్ధతిని గతంలో ఏ టీమిండి ఆటగాడు కూడా పాటించలేదు. అంతటి సచిన్, కాకలు తీరిన విరాట్, దూకుడుకు మారుపేరైన యువరాజ్ కూడా ఈ పని చేయలేదు. కానీ యశస్వి చేశాడు.. ” నీ గ్రౌండ్లో ఉన్నా.. నీకు ఎదురుగా ఉన్నా.. నీ అనుభవం నాకంటే ఎక్కువ.. నా వయసు నీకంటే చాలా తక్కువ.. నువ్వు ఎలా వేసినా గట్టిగా కొడతా.. బంతిని చితక్కొడతా” అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. ఏకంగా పులితోనే పరాచకాలు ఆడాడు.. స్టార్క్ లాంటి బౌలర్ తో జైస్వాల్ ఆటాడుకున్నాడు.
కూల్ గా.. డిఫెన్స్
తన సహజ శైలికి భిన్నంగా జైస్వాల్ నిదానంగా ఆడాడు. స్టార్ కు వేస్తున్న బంతులను అత్యంత సులభంగా డిఫెన్స్ ఆడాడు. అదే కాదు “నీ వేగం ఇంతేనా” అంటూ స్లెడ్జింగ్ చేశాడు. కేవలం 22 సంవత్సరాల వయసు ఉన్న ఓ కుర్ర ఆటగాడు ఆస్ట్రేలియా తోపు తురుము బౌలర్ ను అలా కామెంట్ చేయడం ఒక సాహసమే.. యశస్వి అలా అనడంతో ఒక కిల్లర్ బౌన్సర్ వేశాడు స్టార్క్. అయినప్పటికీ యశస్వి భయపడలేదు. పైగా “నేను భయపడను బ్రదర్” అన్నట్టుగా చూపు చూశాడు.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో జైస్వాల్ టెక్నిక్ బెడిసి కొట్టింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఒకసారిగా పరిస్థితి మారిపోయింది. ఇప్పటివరకు తను ఆడిన ఇన్నింగ్స్ లలో అత్యంత నిధానమైన హాఫ్ సెంచరీ చేశాడు జైస్వాల్. చాలా ఓపికగా ఆడాడు.. వాస్తవానికి SG బంతి ఉన్నట్టుగా కూకుబురా బంతి ఉండదు. 40 ఓవర్ల పాటు ఆడినప్పటికీ బంతి ఏమాత్రం నలగదు. అయినప్పటికీ యశస్వి గోడలా నిలబడ్డాడు. నిలబడి నీళ్లు తాగడమే ఉత్తమం అనే సామెతను గుర్తుచేస్తూ పరుగులు చేశాడు. పెర్త్ లాంటి పెద్ద మైదానంలో భారీ సిక్స్ కొట్టి సాహసమే చేశాడు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో తన న్యాచురల్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేశాడు. చాలా రోజుల తర్వాత తనలో కూడా ఒక టెస్ట్ క్రికెటర్ ఉన్నాడని నిరూపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లు మార్చి మార్చి బంతులు వేస్తున్నప్పటికీ నిదానమే ప్రధానం అనే సామెతను రుజువు చేసి చూపించాడు. ఇక్కడే ఒక ఆటగాడు గురించి చెప్పుకోవాలి.. మన దగ్గర గ్రేట్ వాల్ ఉండొచ్చు, మాస్టర్ బ్లాస్టర్ ఉండొచ్చు, రన్ మిషన్ కూడా ఉండొచ్చు.. కాకపోతే వారందరి కంటే భిన్నంగా యశస్వి ఆడుతున్నాడు. అచ్చంగా వెస్టిండీస్ చందర్ పాల్ లాగా. చందర్ పాల్ మన మూలాలు ఉన్న వెస్టిండీస్ ఆటగాడే.. కానీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. మైదానం సహకరించకపోయినప్పుడు గంటల తరబడి అలానే ఉంటాడు. క్రీజ్ లో జిడ్డు లాగా పాతుకు పోతాడు.. అంతేకాదు ప్రత్యర్థి బౌలర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాడు. తను మాత్రం మండే ఎండలోనూ అలానే నిలబడి ఆడతాడు.. స్థిరమైన ఇన్నింగ్స్ నిర్మిస్తాడు..