Yashasvi Jaiswal strong comeback: ఎడమ చేతి వాటం బ్యాటింగ్ తో ఐపీఎల్ నుంచి మొదలు పెడితే ఇంటర్నేషనల్ మ్యాచ్ ల వరకు సత్తా చూపించాడు యశస్వి జైస్వాల్. గత ఏడాది స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో శతకాల మోత మోగించాడు. మైదానంతో సంబంధం లేకుండా.. ప్రత్యర్థి బౌలర్లు ఎవరైనా లెక్కచేయకుండా బ్యాటింగ్ చేయడం జైస్వాల్ సొంతం.. జైస్వాల్ ఐపిఎల్ లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఓపెనర్ గా వచ్చే అతడు చూస్తుండగానే విధ్వంసాన్ని సృష్టిస్తాడు.
యశస్వి జైస్వాల్ ప్రస్తుతం డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై జట్టు తరఫున అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల అతడు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడ్డాడు. కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకుని మైదానం లోకి వచ్చాడు.. విజయ్ హజారే ట్రోఫీలో గోవాతో జరిగే మ్యాచ్లో ముంబై తరఫున ఆడుతున్నాడు.
గ్యాస్ట్రిక్ సమస్య నుంచి కోలుకున్న తర్వాత జైస్వాల్ మైదానంలోకి అడుగు పెట్టాడు. నెట్స్ లో తీవ్రంగా సాధన చేశాడు. దాదాపు గంటసేపు అతడు నెట్స్ లో గడిపాడు. తీవ్రంగా శ్రమించి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. స్పిన్నర్లు, పేస్ బౌలర్లను ఎదుర్కొంటూ అతడు తన బ్యాటింగ్లో నైపుణ్యాన్ని మరింత పెంచుకున్నాడు. గ్యాస్ట్రిక్ సమస్యలతో ఈ టోర్నీలో తొలి మూడు మ్యాచ్లకు జైస్వాల్ దూరమయ్యాడు. బుధవారం గోవాతో జరుగుతున్న మ్యాచ్లో అతడు ఆడుతున్నాడు. ఈ కథనం రాసే సమయం వరకు అతడు 46 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. అంతేకాదు, తదుపరి మూడు, నాలుగు మ్యాచ్లకు కూడా అతడు అందుబాటులో ఉంటాడు. అతడి రాకతో ముంబై బ్యాటింగ్ బలం మరింత పెరుగుతుంది. రఘు వంశీతో కలిసి అతడు ముంబై జట్టు ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. గోవాలో జరుగుతున్న మ్యాచ్లో ముంబై జట్టు ఈ కథనం రాసే సమయం వరకు ఒక వికెట్ కోల్పోయి 110 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్, ముషీర్ ఖాన్ ఉన్నారు.
జాతీయ జట్టులో స్థిరమైన స్థానం కోసం కొంతకాలంగా జైస్వాల్ పోరాటం చేస్తున్నాడు. అయితే కొన్ని సందర్భాలలో విఫలం కావడం జట్టులో అతడి స్థానాన్ని ప్రభావితం చేస్తోంది. దీనికి తోడు టి20 ఫార్మేట్ లో అతడికి జాతీయ జట్టులో స్థానం లభించడం గగనం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని సరికొత్తగా ప్రదర్శించాలని జైస్వాల్ భావిస్తున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ను ప్రముఖంగా పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే బీసీసీఐ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో.. జైస్వాల్ తన అసలు సిసలైన సామర్థ్యాన్ని ప్రదర్శించాలని పట్టుదలతో ఉన్నాడు. అందువల్లే గ్యాస్ట్రిక్ సమస్య నుంచి త్వరగా కోలుకొని.. మైదానంలోకి అడుగు పెట్టాడు.