VIP Darshan Culture: దేవుడి దర్శనంలో ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. అర్జెంటుగా వెళ్లి దేవుడికి నమస్కారం చేయాలి. తనివి తీర దర్శనం చేసుకోవాలి. మనం అడిగే కోర్కెలను దేవుడు మన్నించేయాలి. ఎక్కువమంది ఆలోచన ఇదే. దీనినుంచి పుట్టుకొచ్చింది వీఐపీ తనం. గ్రామంలో ఉండే చిన్న గుడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు ఈ వీఐపీ సంస్కృతి పెరుగుతూనే ఉంది. భారీగా డొనేషన్లు ఇచ్చారని.. లేకుంటే పాలనలో బిజీగా ఉండేవారు వీఐపీలుగా మారుతున్నారు. అటువంటి వారు వస్తే వేలాదిమంది దర్శనాలు నిలిపివేసి వారికి అవకాశం కల్పిస్తున్నారు. అయితే సాధారణ ప్రజలకు విఐపి లు కావచ్చు కానీ.. దేవుడు ముందు మాత్రం వీరు తక్కువే. అయితే ప్రజలకు తాము వీఐపీలమని చూపుతున్న వీరు.. దేవుడు ముందు మాత్రం తగ్గి ఉంటున్నారు. ఎందుకంటే అనుగ్రహించాల్సింది ఆయనే కాబట్టి. అయితే ఈ వీఐపీ సంస్కృతి ఇప్పుడు ప్రతి చోట పెరుగుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
అహంకారం విడాల్సిన చోటు..
దేవాలయం అనేది అహంకారం విడాల్సిన చోటు. అక్కడ అందరూ సమానమే. సామాన్యుల తో కలిపి గంటల తరబడి వేచి చూస్తే అక్కడ సహనం, సమయం విలువ తెలుస్తుంది. ప్రపంచంలో ఎంతటి పెద్ద ధనవంతుడైన, పదవిలో ఉన్నవారు అయినా దేవాలయానికి వస్తే దేవుడు దగ్గర యాచకుడు మాత్రమే. ఈ విషయాన్ని గుర్తించాలి. నిన్ననే ముక్కోటి ఏకాదశి పర్వదినం జరిగింది. ప్రతి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాలు జరిగాయి. ఉన్నది ఒకటే ద్వారం కానీ వీఐపీలు అనేకం. వేలాదిమంది సామాన్య భక్తులను ఇట్టే దాటుకొని స్వామివారిని వీఐపీ దర్శనం ద్వారా పూజలు చేసిన వారు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది క్యూలో నిలబడితే వచ్చే ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి వీఐపీలు ప్రత్యేక దర్శనం ద్వారా వెళ్లిపోవచ్చు. కానీ అటువంటివారు కాకుండా గుర్తు పట్టని వీఐపీలు కూడా.. వేలాది మంది భక్తులను దాటుకుని వెళ్లి ప్రత్యేక దర్శనాలు చేసుకోవడం మాత్రం సామాన్యులకు ఇబ్బందికరమే.
అక్కడ అందరూ యాచకులే..
ఆయన దేవుడు.. మనం సేవకులం. మధ్యలో ఈ వీఐపీ సంస్కృతి ఏంటనేది ఒక వాదన. ఎందుకంటే దేవుడు ముందు అందరూ యాచకులే. అందరికంటే ముందు వెళ్లి అయ్యా నా కోరికల చిట్టా ఇది.. నా కష్టాలు ఇవి అని చెప్పుకుంటే దేవుడు తీరుస్తాడా? దేవుడికి అన్నీ తెలుసు. మన గుణగణాలు తెలుసు. అటువంటి దేవుడు తన మిగతా భక్తులను దాటుకొని వచ్చి.. కనీసం తన కోసం వేచి చూడకుండా.. సమయం ఇవ్వకుండా.. నేను వీఐపీని అంటూ ముందుకు వస్తే దేవుడు సహించగలడా? అనేది ప్రశ్న. ఇక్కడ దేవుడు అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నమ్మకమైన రీతిలో అనుసరించాలే కానీ. వీఐపీ సంస్కృతి భక్తిత్వం మాత్రం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఇది సాటి మనుషులకు ఇబ్బందులకు గురి చేయడమే.