WTC Final India Vs Australia: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత క్రికెట్ అభిమానుల చర్చ మొత్తం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మీదే సాగుతోంది. టెస్టులను మరింత ఆసక్తికరంగా అభిమానులకు అందించే ఉద్దేశంతో రెండేళ్ల కిందట ఈ ట్రోఫీని ఐసీసీ ప్రారంభించింది. రెండోసారి ఈ ఫైనల్ జరుగుతోంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్ – ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం భారత్ ఆస్ట్రేలియా జట్లు ఒక వైపు సిద్ధమవుతుండగా.. ఈ రెండు జట్లలో ఎవరెవరు ఆడాలనే దానిపై ఇరు జట్లకు చెందిన మాజీ క్రీడాకారులు విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ భారత జట్టులో ఆడాల్సిన ఇద్దరు స్పిన్నర్ల గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ కోసం భారత్ ఆస్ట్రేలియా జట్లు సిద్ధమవుతున్నాయి. ఇరు జట్లు ఈ మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇరు జట్లలో ఆడాల్సిన ఆటగాళ్లు ఎవరు అనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేస్తున్నారు. తాజాగా రికీ పాంటింగ్ అటువంటి వ్యాఖ్యలను చేశాడు.
ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందన్న పాంటింగ్..
ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్న డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఇద్దరు ప్రధాన స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ లో జరుగుతుండడం ఆస్ట్రేలియా జట్టుకు కొంత కలిసి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ పిచ్ లు ఎక్కువగా పేస్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటాయన్నాడు. దీంతో భారత్ ముగ్గురు ప్రధాన పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా..? లేక నలుగురు పేసర్లు, ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ తో ఆడుతుందా..? అనేదానిపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పాంటింగ్ భారత్ స్పిన్నర్లు గురించి మాట్లాడడం ఆసక్తిని కలిగిస్తోంది. భారత జట్టు ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని, వీరిలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను తుది జట్టులోకి తీసుకుంటుందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
బ్యాటింగ్ ఆర్డర్లో కూడా ఉపయోగపడే అవకాశం..
రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ భారత్ జట్టులోకి తీసుకుంటుందని భావిస్తున్నట్లు పాంటింగ్ వెల్లడించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో జడేజా ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగలడని వివరించాడు. అతని బ్యాటింగ్ ఎంతగానో మెరుగుపడిందని తెలిపాడు. బౌలింగ్ కూడా చేస్తాడు కాబట్టి అతనిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉందన్నాడు. జడేజా కంటే అశ్విన్ చాలా నైపుణ్యం ఉన్న మెరుగైన టెస్ట్ బౌలర్ అనడంలో సందేహం లేదని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. లోయర్ ఆర్డర్లో జడేజా బ్యాటింగ్ లో రాణిస్తే ఆట నాలుగు లేదా ఐదో రోజు వరకు వెళ్లే అవకాశం ఉందని వివరించాడు. అలా, కాకుండా పిచ్ స్పిన్ కు అనుకూలంగా మారితే భారత్ కు రెండో స్పిన్నర్ గా జడేజా రూపంలో మంచి బౌలర్ అందుబాటులో ఉంటాడని, తానైతే జడేజాను కచ్చితంగా ఎంపిక చేస్తానని రికీ పాంటింగ్ వివరించాడు. ఇక ఆస్ట్రేలియా జట్టు మాత్రం ఒకే స్పిన్నర్ తో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ మాత్రం అందరిని ఆసక్తికి గురి చేస్తుంది. గతంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే.
Web Title: Wtc final india vs australia would it be better if team india fielded two spinners what do the experts say
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com