WTC Final India Vs Australia: లీగ్ కింగ్.. కౌంటీ బ్రాడ్ మన్.. భారత ఆటగాళ్లపై మీమ్స్..!

ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ కూడా భారీ స్కోర్ చేసేలా కనిపించింది. మంచి టచ్ లో ఉన్నట్లు కనిపించిన రోహిత్ శర్మ (15) మరోసారి పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న గిల్ (13) దారుణంగా అవుటయ్యాడు.

Written By: BS, Updated On : June 9, 2023 11:29 am

WTC Final India Vs Australia

Follow us on

WTC Final India Vs Australia: ఆస్ట్రేలియా జట్టుతో ఇంగ్లాండు వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. కీలక ఆటగాళ్లంతా చేతులెత్తేయడంతో ఈ టెస్ట్ లో భారత జట్టు పోరాడుతోంది. భారత జట్టు మొదటి రోజు ఆట చూసిన ఎంతో మంది అభిమానులు సామాజిక మాధ్యమాలు వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకరు ఐపీఎల్ హీరో అయితే.. మరొకరు కౌంటీ బ్రాడ్ మన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ పేలుస్తున్నారు. టీమిండియా ప్రదర్శన పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటిసి ఫైనల్ భారత జట్టు మరోసారి తేలిపోయింది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ ఫైనల్ మ్యాచ్ లోనూ ఇలాంటి ఆట తీరుతోనే ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ అనుభవంతో మెరుగైన ఆట తీరు కనబరుస్తుందని భావించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆటగాళ్లలో మార్పు రాలేదు. దీంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు అదే ఆట తీరుతో దారుణమైన స్థితిలో ఉంది. తొలి రోజు ఆటలో బంతితో విఫలమైన భారత జట్టు.. రెండో రోజు కాస్త తేరుకొని మంచి ప్రదర్శన చేసింది. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో ఆసీస్ బ్యాటర్లు క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టు 469 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

భారీ స్కోర్ చేసేలా కనిపించినా.. ఫలితం శూన్యం..

ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ కూడా భారీ స్కోర్ చేసేలా కనిపించింది. మంచి టచ్ లో ఉన్నట్లు కనిపించిన రోహిత్ శర్మ (15) మరోసారి పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న గిల్ (13) దారుణంగా అవుటయ్యాడు. స్కాట్ బోలాండ్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన అతను దాన్ని వదిలేయాలని అనుకున్నాడు. కానీ, బంతి ఇన్ స్వింగ్ అవడంతో తెల్ల మొఖం వేశాడు. అతను జడ్జిమెంట్ సరిగా లేకపోవడంతో బంతి నేరుగా వచ్చి వికెట్లను కూల్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు. మరి ఇంత దారుణంగా అయిపోయాడు ఏంటని అంటున్నారు. ఐపీఎల్ కాకపోతే గిల్ ఆడడేమో అంటూ ట్రోల్స్ కూడా చేయడం మొదలు పెట్టేశారు.

చక్కదిద్దాల్సిన పుజారా దారుణంగా ఫెయిల్..

ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని భావించిన పుజారా (14) కూడా విఫలమయ్యాడు. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన అతను గ్రీన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్కాట్ బోలాండ్, కమిన్స్.. ఇద్దరూ ఇబ్బంది పెట్టినట్లు బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో గ్రీన్ సక్సెస్ కాలేదు. దీంతో అతని బౌలింగ్ లో పుజారా బౌండరీ బాదిన కాసేపటికి గ్రీన్ వేసిన బంతిని వదిలేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అచ్చం గిల్ లాగే మిస్ జడ్జ్ చేయడంతో వికెట్లు కూలిపోయాయి. ఇది చూసిన పుజారా చాలా చిరాకుగా పెవిలియన్ బాట పట్టాడు. ఇలా కీలకమైన టీమ్ ఇండియా బ్యాటర్లు అందరూ విఫలం అవడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పుజారా కేవలం కౌంటిల్లోనే బ్రాడ్ మన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

నిలబడడం కష్టమైన పరిస్థితి..

ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టు నిలదొక్కుకోవడం కొంచెం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో రహానే, భరత్ మాత్రమే ఉన్నారు. వీరిద్దరూ అవుట్ అయితే ఇక బ్యాటింగ్ చేసే ప్లేయర్లు కూడా లేరు. దీంతో భారత జట్టు ఫాలో ఆన్ ప్రమాదంలో పడినా పడచ్చని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. లీగ్ లు, కౌంటీలకు ఇచ్చే ప్రాధాన్యత అంతర్జాతీయ మ్యాచ్ లకు ఇవ్వకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతోందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.