Homeక్రీడలుWTC Final 2023- Team India: టీమిండియా కప్పు కొట్టేదెప్పుడు..? ఎవరు రావాలి.?

WTC Final 2023- Team India: టీమిండియా కప్పు కొట్టేదెప్పుడు..? ఎవరు రావాలి.?

WTC Final 2023- Team India: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రెండేళ్ల కిందట జరిగిన మొదటి డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోని భారత జట్టు.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లోను అదే పొరపాట్లను చేసి మరో పరాభవాన్ని దక్కించుకుంది. వెరసి పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న భారత జట్టు అభిమానులను మరోసారి నిరాశపరిచింది టీమిండియా. ప్రస్తుత భారత జట్టు పరిస్థితి చూస్తుంటే ఐసీసీ ట్రోఫీ కొట్టేదెప్పుడో..? ఎవరు రావాలో..? అంటూ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా ఐసీసీ ట్రోఫీ నెగ్గి పదేళ్లు అవుతుంది. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు ఇప్పటి వరకు మరో ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోలేకపోయింది. నాలుగు టి20, రెండు వన్డే ప్రపంచ కప్ ల్లో రిక్త హస్తమే మిగలగా.. వరుసగా మరో రెండుసార్లు ఐసిసి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోను భారత జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఫైనల్స్ కు అర్హత సాధించిన రెండుసార్లు ఓటమి చవిచూడడంతో జట్టు సామర్థ్యంపై అనేక సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.

సొంత గడ్డపై సిరీస్ అంటే రెచ్చిపోయే భారత్..

ద్వైపాక్షిక సిరీస్ ల్లో భారత జట్టుదే పై చేయి. సొంత గడ్డపై సిరీస్ అంటే చాలు మన వాళ్లు రెచ్చిపోతారు. భీకర ఫామ్ తో మన దేశంలో అడుగుపెట్టే జట్లకు గర్వభంగం చేసి పంపిస్తారు. గత కొన్ని నెలలు విదేశాల్లో కూడా అడపాదడపా కొన్ని విజయాలు సాధిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంది ఇండియా జట్టు. ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో తొలిసారి న్యూజిలాండ్, రెండో పర్యాయం ఆస్ట్రేలియా జట్లు విజయం సాధించాయి. కానీ, రెండుసార్లు అవతల ప్రత్యర్థిగా భారత జట్టు ఉంది. ఫైనల్ కు చేరే వరకు చూపించిన ఆధిపత్యం అసలు సమరంలో మాత్రం కనిపించడం లేదు. అయితే, భారత జట్టు రెండుసార్లు డబ్ల్యుటిసి ఫైనల్ చేరడానికి, తుది పోరులో ఓటమికి ప్రధాన కారణం సొంత గడ్డపై తయారు చేసుకున్న పిచ్ లే అన్నది విమర్శకుల మాట. తమ బలానికి పూర్తి అనుకూలంగా తయారు చేసుకుని వాటితో ఎలాంటి ప్రత్యర్థులనైనా దెబ్బ కొడుతున్న ఇండియా జట్టు ఫైనల్స్ లో పేస్ పిచ్ లు ఎదురయ్యేసరికి చేతులెత్తేస్తోంది. ఐపీఎల్ అవ్వగానే డబ్ల్యుటిసి ఫైనల్ ఆడటం, సరైన సన్నాహకం లేకపోవడం భారత జట్టును దెబ్బతీసింది. వాస్తవంగానే ఇలాంటి ప్రతికూలతలను అధిగమించి విజయం సాధించడం ఛాంపియన్ లక్షణం. ఆ సామర్థ్యం భారత జట్టుకు లేదని తేటతెల్లమైంది.

మరి ప్రత్యామ్నాయాలు ఎక్కడ ఉన్నట్టు..?

గత కొన్నేళ్లలో టీమిండియా విదేశాల్లో సాధించిన అద్భుత విజయాలు వెనుక కీలకపాత్ర బౌలర్లది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో ఆతిధ్య బౌలర్లను మించి మన పేసర్లు పిచ్ లను సద్వినియోగం చేసుకుని వికెట్ల పంట పండించారు. ముఖ్యంగా బుమ్రా మంచి ఫిట్నెస్ తో ఫామ్ లో ఉన్నప్పుడు భారత్ బౌలింగ్ ఎంతో ప్రభావవంతంగా కనిపించేది. బు, షమీ జోడి విదేశీ పిచ్ లపై గొప్ప ప్రదర్శన చేసింది. కానీ, బుమ్రాను ఫిట్నెస్ సమస్యల చుట్టుముట్టాక బౌలింగ్ బలహీనం పడింది. ఈసారి డబ్ల్యూటిసి ఫైనల్ లో భారత పేస్ దాడిని ముందుండి నడిపించాల్సిన షమీ విఫలమయ్యాడు. సిరాజ్ ఒక్కడు కొంచెం నిలకడ చూపించాడు. ఉమేష్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అతను కాకుండా వేరే ప్రత్యామ్నాయాలే కనిపించని పరిస్థితి. ఫాస్ట్ బౌలర్లలో చాలా మందికి టి20 లోనే వరుసగా కొన్ని మ్యాచ్ లు ఆడే ఫిట్నెస్ ఉండట్లేదు. ఇక ఐదు రోజుల ఆటకు ఏం పనికి వస్తారు. ఇక బ్యాటింగ్ లో కూడా సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచే ఆటగాళ్లు కరువైపోతున్నారు. అలా, నిలిచే సామర్థ్యం ఉన్న పుజారా సైతం డబ్ల్యూటిసి ఫైనల్ లో పేలవ ప్రదర్శన చేశాడు. మిగతా వారిలా ఐపిఎల్ ఆడకుండా కౌంటిల్లో ఎంతో అనుభవం సంపాదించిన పుజారానే నిలవలేకపోయాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో తెగువతో, ఆత్మవిశ్వాసంతో ఆడే రిషబ్ పంత్ లాంటి ఆటగాడు లేకపోవడం బ్యాటింగ్ ను ముందే బలహీనపరిచింది. మిగతా బ్యాటర్లలో రహానే ఒక్కడే పోరాటపటిమ చూపించాడు. ఐపీఎల్ లో అదరగొట్టిన గిల్ ఇంగ్లాండ్ లో ఆ ఫామ్ కొనసాగించలేకపోయాడు. కోహ్లీ ఒకప్పటిలా భరోసా కల్పించలేకపోతున్నాడు. రోహిత్ శర్మ ప్రదర్శన అంతంత మాత్రం. అతను కెప్టెన్ గాను అంచనాలను అందుకోలేకపోతున్నాడు. మొత్తం గా చూస్తే డబ్ల్యుటిసి ఫైనల్ లో గెలిచే సామర్థ్యం భారత జట్టుకు ఉన్నట్లు మ్యాచ్ కు ముందు కనిపించలేదు. మ్యాచ్ సమయంలోను ఎలాంటి ఆశ కలుగలేదు. ఇలాంటి ఆటతో టెస్టు ఛాంపియన్ షిప్ భారత జట్టు అందుకుంటుందని ఎలా ఆశించగలమని పలువురు విశ్లేషిస్తున్నారు.

వేదిక విషయంలో అభ్యంతరాలు వ్యక్తం..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించే సమయం వేదిక విషయంలో భారత్ వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వరుసగా రెండు డబ్ల్యూటిసి ఫైనల్స్ ఇంగ్లాండ్ ను వేదికగా చేయడానికి ఐసీసీ ఎలా సమర్థించుకుంటుందో. ఇంగ్లాండు పరిస్థితులు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా జట్లకు అనుకూలం కావడం వారికి కలిసొచ్చింది. ఇక ఈ మ్యాచ్ ను జూన్ లో నిర్వహించడం కూడా భారత ఆటగాళ్లకు పెద్ద సమస్యగా మారుతుంది. రెండు నెలల పాటు ఐపీఎల్ ఆడిన అలసటతో టి20 ఇక్కడ పరిస్థితులకు సరిగా అలవాటు పడకుండా మ్యాచ్ ఆడటం ఇండియాకు ప్రతికూలమైంది. మరోవైపు రెండేళ్ల సుదీర్ఘకాలం టెస్ట్ ఛాంపియన్ షిప్ నిర్వహించి చివరికి ఫైనల్ కు ఒక్క మ్యాచ్ తో ముగించేయడం సరైనదేనా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ నిర్వహిస్తే బాగుంటుందని రోహిత్ సైతం మ్యాచ్ అనంతరం అభిప్రాయపడ్డాడు. తరువాతి డబ్ల్యూటీసి ఫైనల్ విషయంలో ఐసీసీ ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular