Homeక్రీడలుMohammad Kaif- WTC 2023 Final: డబ్ల్యూటీసి ఫైనల్ లో ఆ ఆటగాడికి అవకాశం వద్దట..!...

Mohammad Kaif- WTC 2023 Final: డబ్ల్యూటీసి ఫైనల్ లో ఆ ఆటగాడికి అవకాశం వద్దట..! ఎందుకంటే..?

Mohammad Kaif- WTC 2023 Final: భారత్ ఆస్ట్రేలియా మధ్య మరో మూడు రోజుల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి. గతంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ జట్టు ఓటమిపాలైంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయాన్ని దక్కించుకొని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా నిలవాలని భారత జట్టు భావిస్తోంది. అయితే, పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు కూడా ఈ టైటిల్ పై కన్నేసింది. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా సాగుతుందని అంతా భావిస్తున్నారు.

భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. లండన్ లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఈ నెల 7 నుంచి 11 వరకు ఫైనల్ పోరు జరగనుంది. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియా.. అప్పటి నుంచి ఒక్క ఐసీసీ టైటిల్ కూడా సొంతం చేసుకోలేకపోయింది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఎలాగైనా ఓడించి పదేళ్ల నిరీక్షణకు తెరదించాలని భారత జట్టు బలంగా భావిస్తోంది. ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు భారత జట్టుకు ఆడనున్న 11 మంది ఆటగాళ్లపై పలువురు సీనియర్ ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ చేరాడు. డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ఆడే తుది జట్టులో వికెట్ కీపర్ గా శ్రీకర్ భరత్ కంటే ఇషాన్ కిషన్ కు అవకాశం ఇస్తే బాగుంటుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి పంత్ లా మెరుపులు మెరూపించే ఆటగాడు కావాలని కైఫ్ తెలిపాడు.

ఓపెనర్లుగా ఆ ఇద్దరు బరిలో దిగాలి..

ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కు సంబంధించి మరింత విశ్లేషించిన కైఫ్ అనేక విషయాలపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. డబ్ల్యూటీసి ఫైనల్ లో ఓపెనర్లుగా సుబ్ మన్ గిల్, రోహిత్ శర్మ రావాలని పేర్కొన్నాడు. ఆ తరువాతి స్థానంలో అనుభవం ఉన్న పుజారాను పంపించాలని, ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రహనే ఉండాలని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ‘ఇక ఆరో స్థానంలో హిట్టింగ్ చేసే ఆటగాడు కావాలి. కాబట్టి నా వరకు అయితే భరత్ కంటే కిషన్ కు అవకాశం ఇస్తే మంచిది. అతడు రిషబ్ పంత్ రోల్ ను పోషిస్తాడు. అదే విధంగా ఏడో స్థానంలో నేను జడేజాకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను’ అని కైఫ్ పేర్కొన్నాడు.

పిచ్ పరిస్థితులను బట్టి అశ్విన్, శార్దూల్ ఠాకూర్..

అలాగే, లోయర్ ఆర్డర్ లో ఎవరు రావాలి అన్న విషయంపైనా కైఫ్ స్పందించాడు. ఎనిమిదో స్థానంలో పిచ్ పరిస్థితులను బట్టి అశ్విన్ లేదా శార్దూల్ ఠాకూర్ ను పంపించాలని కైఫ్ వెల్లడించాడు. ఇక పిచ్ స్పిన్ కు అనుకూలిస్తే అశ్విన్.. వార్నర్, ట్రావిస్ హెడ్, ఖవాజా వంటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను ఈజీగా ఔట్ చేసి పంపుతాడని వివరించాడు. ఫాస్ట్ బౌలర్ల జాబితాలో మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ కు ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు కైఫ్ తెలిపాడు. అయితే, పిచ్ పరిస్థితులను బట్టి తుది జట్టులో శార్దూల్ ఠాకూర్ కు అవకాశం ఇవ్వాలని ఆ ఇంటర్వ్యూలో మహమ్మద్ కైఫ్ స్పష్టం చేశాడు. మహమ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కైఫ్ తో పాటు పలువురు సీనియర్ క్రికెటర్లు డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ఆడే 11 మంది ఆటగాళ్ల జాబితాలో ఎవరు ఉండాలన్న దానిపై తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, భారత జట్టు మేనేజ్మెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గతంలో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఘోరంగా ఓటమిపాలైంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగుతుండడంతో బలమైన ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular