Vinesh Phogat : పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత రెజ్లింగ్ క్రీడాకారిణి వినేశ్ ఫొగాట్ బరువు ఎక్కువగా ఉండడంతో ఫైనల్స్ కు అర్హత సాధించలేకపోయింది. దీంతో నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ఆమె గురించే చర్చ మొదలైంది. మీడియా, సోషల్ మీడియాలో ఆమె వార్తా వస్తువు అయిపోయింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. భారత ఒలింపి కమిటీ అధ్యక్షురాలు పిటి. ఉషతో మాట్లాడారు. గట్టి ప్రయత్నాలు చేయాలని సూచించారు. కానీ, అవేవీ పారిస్ ఒలింపిక్ కమిటీ మనసును కరిగించలేకపోయాయి. చివరకు వినేశ్ ఫొగాట్ ఫైనల్ దాకా వెళ్ళినప్పటికీ మెడల్ లేకుండానే రిక్తహస్తంతో తిరిగి రావాల్సి వచ్చింది. బరువు తగ్గించుకునేందుకు ఆమె జుట్టు కత్తిరించుకుంది. శరీరం నుంచి రక్తం తీసేసుకుంది. డైట్ పూర్తిగా మానేసింది. జాగింగ్ చేసింది. సైక్లింగ్ చేసింది. అయినప్పటికీ 100 గ్రాముల బరువు ఆమెను ఫైనల్స్ కు దూరం చేసింది. ఫలితంగా పారిస్ వేదికపై మూడు రంగుల జెండాను గర్వంగా ప్రదర్శించాలనుకున్న ఆమె ఆశలను అడియాసలు చేసింది. ఇదే క్రమంలో ఆమె డిహైడ్రేషన్ కు గురైంది.. పారిస్ స్పోర్ట్స్ విలేజ్ లోని హాస్పిటల్లో చేరింది. ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమెను పి.టి.ఉష పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అయింది. ఆమె చేతికి కాన్యులతో నీరసంగా కనిపించింది. ఇదే క్రమంలో వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది.
నేను ఓడిపోయాను
రెజ్లింగ్ ఫైనల్ లో పోటీపడే అవకాశం లేకపోవడంతో వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ ఎక్స్ లో రెజ్లింగ్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు పోస్ట్ చేసింది. ” కుస్తీ నాపై విజయం సాధించింది. నేను పరాజయం పాలయ్యాను. నన్ను పెద్ద మనసుతో క్షమించు. నా ధైర్యం పూర్తిగా విలుప్తమైంది. నాకు ఇంకా తలపడేంత శక్తి లేదంటూ” వినేశ్ ఫొగాట్ ట్వీట్ చేసింది. పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో 50 కిలోల ప్రీ స్టైల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్ చేరింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన దానికంటే 100 గ్రాములు ఆమె అదనపు బరువు ఉంది. దీంతో పారిస్ ఒలంపిక్ కమిటీ ఆమెను ఫైనల్స్ లో పోటీ పడకుండా డిస్ క్వాలిఫై చేసింది. అయితే దీనిని సవాల్ చేస్తూ వినేశ్ ఫొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది. సిల్వర్ మెడల్ కు తాను అర్హురాలినని, ఆ ఫిర్యాదులో వెల్లడించింది.. అయితే దీనిపై ఆర్బిట్రేషన్ తీర్పు ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ లోగానే ఆమె అనూహ్యంగా రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పేసింది.
వాస్తవానికి రియో, టోక్యో ఒలంపిక్స్ లోనూ వినేశ్ ఫొగాట్ కు నిరాశ ఎదురయింది. రియో ఒలంపిక్స్ సమయంలో ఆమె కాలు విరిగింది. టోక్యో ఒలింపిక్స్ లో ప్రారంభంలోనే ఓటమిపాలైంది. ఇప్పుడు పారిస్ ఒలంపిక్స్ లో అనర్హత వేటు ఎదుర్కొంది. దీంతో మెడల్ ఆశలు అడియాసలు అయ్యాయి. గత ఏడాదిగా ఆమె బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. ఇదే సమయంలో ఆమెపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వాటికి సమాధానం చెప్పేందుకు బౌట్ లో తన శక్తికి మించి పోరాటం చేసింది. పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ లక్ష్యంగా పోటీలోకి దిగింది. ఆమె ఎప్పుడూ పోటీపడే 53 కిలోల విభాగం కాకుండా.. ఈసారి ఏకంగా 50 కిలోల కేటగిరి ఎంచుకుంది.. జపాన్ రెజ్లర్, టోక్యో గోల్డ్ మెడల్ విన్నర్ యు సుసాకీ రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురైనప్పటికీ.. ఏమాత్రం భయపడకుండా పోరాడింది. అద్భుతమైన విజయం సాధించింది. అదే జోరు క్వార్టర్స్ లో చూపించింది.. సెమీస్ లో సత్తా చాటింది. ఈ క్రమంలో ఒలింపిక్స్ లో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళ రెజ్లర్ గా చరిత్ర సృష్టించింది.. గ్రాములు బరువు ఎక్కువగా ఉండటంతో ఫైనల్స్ కు అర్హత సాధించలేకపోయింది. ఆ బరువును తగ్గించుకునేందుకు జుట్టు కత్తిరించుకుంది. రకరకాల విన్యాసాలు చేసింది. తన శరీరాన్ని తీవ్రంగా కష్టపెట్టుకుంది. అయినప్పటికీ ఆమె ఫైనల్స్ కు అర్హత సాధించలేకపోయింది. తనకంటే బలమైన వారిని ఓడించిన ఆమె.. చివరికి ఓడిపోయింది. కుస్తీ పోటీల్లో తాను ఇక పాల్గొనబోనని స్పష్టం చేసి.. అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది.
माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।
अलविदा कुश्ती 2001-2024
आप सबकी हमेशा ऋणी रहूँगी माफी
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024