WPL2024: ఏం కొట్టుడురా బై.. షెఫాలీ దంచుడుకు ఫైనల్ కు ఢిల్లీ

ఢిల్లీ తన చివరి లీగ్ మ్యాచ్లో భారీ విజయమే లక్ష్యంగా మైదానంలోకి అడుగు పెట్టింది. అనుకున్నట్టుగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ పై ఏడు వికెట్లతో తిరుగులేని గెలుపును అందుకుంది.

Written By: Suresh, Updated On : March 14, 2024 9:00 am

WPL 2024

Follow us on

WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్( WPL)లో ఢిల్లీ జట్టు ఫైనల్ లోకి వెళ్లింది.. టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది. గుజరాత్ జట్టుతో బుధవారం రాత్రి జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్లు పట్టికలో టాప్ ప్లేస్ సాధించి.. దర్జాగా ఫైనల్ లోకి ప్రవేశించింది. గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేసి 126 పరుగులకే ఆల్ అవుట్ అయింది.. అనంతరం స్వల్ప స్కోర్ ను ఢిల్లీ ఆలవోకగా ఛేదించింది. ఢిల్లీ డాషింగ్ బెటర్ షెఫాలీ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. అర్థ సెంచరీ తో ఆకట్టుకుంది. దీంతో ఢిల్లీ జట్టు విజయాన్ని సాధించింది. గుజరాత్ జట్టు వరుసగా రెండవ సీజన్లోనూ ప్లే ఆఫ్ చేరకుండా నిరాశ జనకమైన ఆటతీరు ప్రదర్శించింది.

భారీ విజయమే లక్ష్యంగా..

ఢిల్లీ తన చివరి లీగ్ మ్యాచ్లో భారీ విజయమే లక్ష్యంగా మైదానంలోకి అడుగు పెట్టింది. అనుకున్నట్టుగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ పై ఏడు వికెట్లతో తిరుగులేని గెలుపును అందుకుంది. ఈ విజయం ద్వారా లీగ్ ఫైనల్ లోకి ప్రవేశించింది.. గుజరాత్ జట్టు నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 13.1 ఓవర్లలోనే సాధించింది. ఢిల్లీ ఓపెనర్ షెఫాలీ వర్మ 37 బంతుల్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్స్ ల సహాయంతో 71 పరుగులు చేసింది. వర్మ దూకుడుకు స్కోర్ బోర్డు పరుగులెత్తింది. జెమిమా రోడ్రిగ్స్ 38 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచింది.. తనూజ రెండు వికెట్లు పడగొట్టింది.

మ్యాచ్లో ముందుగా గుజరాత్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 126 పరుగులు చేసింది. కాప్, మిన్ను మణి, శిఖా పాండే తలా రెండు వికెట్లు తీశారు. దీంతో గుజరాత్ జట్టు భారీ భాగస్వామ్యాలు ఏర్పాటు చేయలేకపోయింది.. గుజరాత్ జట్టులో భారతి (42) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. షెఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకుంది.

షెఫాలీ తన బ్యాట్ తో వీర విహారం చేసింది. ముఖ్యంగా శబ్నం వేసిన మూడు ఓవర్ లో మూడు ఫోర్లు బాది తన ఉద్దేశాన్ని చాటింది. మరుసటి ఓవర్ లో ల్యానింగ్ (18), క్యాప్సె(0) ఔట్ అయ్యారు. ఈ దశలో షెఫాలీకి రోడ్రిగ్స్ జతయ్యారు. ఇక అప్పటినుంచి వారు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. గార్డ్ నర్ వేసిన 7వ ఓవర్లో రెండు భారీ సిక్స్ లతో దూకుడుగా ఆడింది. ఈ నేపథ్యంలో 28 బంతుల్లో అర్థ సెంచరీ సాధించింది. మరోవైపు రోడ్రిగ్స్ రెచ్చిపోయింది. బౌండరీలతో దూకుడుగా ఆడింది. దీంతో ఢిల్లీ లక్ష్యం తగ్గిపోయింది. ముఖ్యంగా మేఘనా సింగ్ వేసిన ఓ ఓవర్ లో షెఫాలీ ఫోర్, సిక్స్ కొడితే, రోడ్రిగ్స్ రెండు ఫోర్లు బాదింది. ఇదే సమయంలో కన్వర్ బౌలింగ్లో భారీ షాట్ కొట్టబోయి షెఫాలీ క్యాచ్ అవుట్ అయింది. ఆ తర్వాత బంతికి రోడ్రిగ్స్ ఫోర్ కొట్టడంతో ఢిల్లీ 41 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.