Yanamala Krishnudu: తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగలనుంది. టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు పార్టీని వీడనున్నారు. వైసీపీలో చేరేందుకు సిద్ధపడ్డారు. ఈనెల 16 లేదా 17వ తేదీన జగన్ సమక్షంలో వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆయనతో వైసిపి కీలక నేతలు చర్చలు జరిపారు. జగన్ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పార్టీ మారేందుకు కృష్ణుడు డిసైడ్ అయ్యారు. అదే జరిగితే ఉభయ గోదావరి జిల్లాల్లో టిడిపికి పెద్ద షాక్ తగిలినట్లే.
గోదావరి జిల్లాల్లో ఈసారి జనసేన ప్రభావం అధికంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.టిడిపి,జనసేన, బిజెపి కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తుందని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ తరుణంలో జగన్ అప్రమత్తమయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకోనున్నారు. మరోవైపు బలమైన బీసీ నేతలను తనవైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు. టిడిపిలో సీనియర్ నాయకుడు అయిన యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడును పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదిపారు. యనమల రామకృష్ణుడు యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. కృష్ణుడు చేరికతో ఆ వర్గంలో పట్టు నిలుపుకునేందుకు ఛాన్స్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.
ఇటీవల తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తుని నుంచి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పేరును ప్రకటించారు. అయితే టిక్కెట్ ను యనమల కృష్ణుడు ఆశించారు. 2014, 2019 ఎన్నికల్లో కృష్ణుడు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. పైగా యనమల రామకృష్ణుడు తో పాటు దివ్య తన వర్గాన్ని అణచివేస్తున్నారని ఆవేదనతో ఉన్నారు. అందుకే పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. ఇంతలో వైసిపి కీలక నేతలు ఆయనకు టచ్ లోకి వెళ్లారు. మంత్రి దాడిశెట్టి రాజాను జగన్ పిలిపించారు. యనమల కృష్ణుడు పార్టీలోకి రావడం పై చర్చించారు. సముచిత స్థానం కల్పిస్తామని జగన్ హామీ ఇవ్వడంతో వైసీపీలోకి వెళ్లేందుకు కృష్ణుడు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే వైసీపీ టికెట్ ఖరారు చేయడంతో కృష్ణుడికి ఈ ఎన్నికల్లో ఛాన్స్ లేదు. పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవి కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కృష్ణుడు టిడిపిని వీడనుండడంతో యనమల రామకృష్ణుడిపై ఒత్తిడి పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీకి ఇదో దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.