Team India : టీమిండియా నుంచి ఆ ఆటగాళ్లను సాగనంపితేనే బెటరా?

అవసరమైతే ప్రస్తుతం ఉన్న క్రికెటర్లను తొలగించాలని రవి శాస్త్రి స్పష్టం చేశాడు. లేకపోతే రానున్న రోజుల్లోనూ ఈ తరహా ఘోర పరాభవాలను భారత జట్టు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

Written By: BS, Updated On : June 15, 2023 8:41 am
Follow us on

Team India : డబ్ల్యూటిసి ఫైనల్ పరాభవం భారత జట్టు ఆటగాళ్లను తీవ్ర విమర్శలకు గురి చేస్తోంది. ఆటగాళ్లపై ఇంటా, బయట పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వరుసగా రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోవడంతో అభిమానులతోపాటు మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ కనీస స్థాయిలో పోరాట పటిమ చూపించకుండా ఓడిపోవడాన్ని అబిమానులు అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని పలువురు మాజీ క్రికెటర్లు వ్యక్తం చేస్తున్నారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓటమి తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు విమర్శనాస్త్రాలను ఎదుర్కొంటోంది. ఒక రకంగా చెప్పాలంటే జట్టును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. దేశం కంటే లీగ్ లకే ఆటగాళ్లు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది అంటూ తీవ్ర స్థాయిలో అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా విరుచుకుపడుతున్నారు. ఇక మాజీ క్రికెటర్లు అయితే ఒక అడుగు ముందుకు వేసి సరిగా ఆడలేని వాళ్ళని జట్టు నుంచి తొలగించేయాలని సూచిస్తున్నారు. ఇదే విధమైన అభిప్రాయాన్ని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి వ్యక్తం చేయడం విశేషం.
ఆస్ట్రేలియా తరహా ప్లానింగ్ భారత్ కు అవసరం..
సీనియర్ ఆటగాళ్లు అని, గొప్ప గొప్ప రికార్డులు ఉన్నాయని భారత జట్టు అనేక మంది ఆటగాళ్లను భరిస్తోందన్న అభిప్రాయం ఎంతో మందిలో ఉంది. అయితే, దేశం కోసం ఆడేటప్పుడు ఇటువంటివి పరిగణలోకి తీసుకోకూడదని, ప్రస్తుతం ఉన్న ఫామ్ ను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్న అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధమైన అభిప్రాయాన్ని టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి వ్యక్తం చేశాడు. భారత జట్టు భవిష్యత్ కోసం ఆస్ట్రేలియా తరహా ప్రణాళికతో భారత జట్టు ముందుకు వెళ్లాలని రవి శాస్త్రి సూచించాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కాకుండా రానున్న మూడేళ్ల పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ జట్టును తయారు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా రావుశాస్త్రి నొక్కి చెప్పాడు. అంతే కాకుండా 30 ఏళ్లు దాటిన రోహిత్ శర్మ, రహానే, విరాట్ కోహ్లీ, చటేశ్వర పుజారా లాంటి ప్లేయర్లు రిటైర్మెంట్ తీసుకునేంతవరకు భవిష్యత్తుపై ఆలోచన లేకుండా ఉండడం తగదని హెచ్చరించాడు. మూడేళ్లకు ముందుగానే యంగ్ ప్లేయర్లను సిద్ధం చేసుకోవాలని, ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లకు ఏ ప్లేయర్ సరిపోతాడన్న ఆలోచన సెలక్టర్లకు ఉండాలని సూచించాడు.
యంగ్ ప్లేయర్లకు అవకాశాలు కల్పించాలన్న రవిశాస్త్రి..
ఇకపోతే భారత జట్టులో యంగ్ ప్లేయర్స్ కు అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉందని రవి శాస్త్రి స్పష్టం చేశాడు. సీనియర్ ఆటగాళ్లతోపాటు యువ ఆటగాళ్లు కూడా ఉంటేనే జట్టు బలంగా కనిపిస్తుందని వివరించాడు. అప్పుడే సీనియర్ల నుంచి జూనియర్ ఆటగాళ్లు మెరుగైన అంశాలు నేర్చుకొని మరింత రాటుదేలేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పిస్తే భారత్ జట్టు బలంగా మారుతుందని, అప్పుడు గొప్ప విజయాలు సాధించడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అవసరమైతే ప్రస్తుతం ఉన్న క్రికెటర్లను తొలగించాలని రవి శాస్త్రి స్పష్టం చేశాడు. లేకపోతే రానున్న రోజుల్లోనూ ఈ తరహా ఘోర పరాభవాలను భారత జట్టు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.