World Cup Qualifiers 2023: భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ లో ఆడే రెండు జట్ల కోసం ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. శుక్రవారంతో లీగ్ దశ మ్యాచ్లు ముగిశాయి. శనివారం నుంచి సూపర్ సిక్స్ దశ ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ లో పాల్గొనాలంటే ఈ సూపర్ సిక్స్ దశ మ్యాచ్ లు అత్యంత కీలకం. సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించిన జట్లలో శ్రీలంక, జింబ్యాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్, ఒమన్ ఉన్నాయి. యూఏఈ, యూఎస్ఏ, నేపాల్, ఐర్లాండ్ ఎలిమినేట్ అయ్యాయి.
వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లు అత్యంత ఆసక్తిగా సాగుతున్నాయి. పెద్ద పెద్ద జట్లకు చిన్న జట్టు షాక్ ఇచ్చాయి. లీగ్ దశలో జింబాబ్వే జట్టు వెస్టిండీస్ జట్టుకు షాక్ ఇచ్చింది. 300కు పైగా పరుగులు చేసినప్పటికీ వెస్టిండీస్ జట్టు డిఫెండ్ చేసుకోలేకపోయింది. దీంతో వెస్టిండీస్ జట్టు వరల్డ్ కప్ ఆశలు అడుగంటి పోయాయి. అయితే, సూపర్ సిక్స్ దశలో ఆడే మ్యాచ్ ల ఫలితాలు వెస్టిండీస్ ను వరల్డ్ కప్ వరకు చేరుస్తాయా..? లేదా..? అన్నది చుడాల్సి ఉంది. ఈ దశలో తప్పక విజయం సాధిస్తేనే వెస్టిండీస్ వరల్డ్ కప్ మ్యాచ్ లకు అర్హత సాధిస్తుంది. లీగ్ దశలోనే ఈసారి ఐర్లాండ్ జట్టు అనూహ్యంగా వెనుదిరగాల్సి వచ్చింది.
సూపర్ సిక్స్ మ్యాచులు జరిగేది ఇలా..
లీగ్ దశ నుంచి సూపర్ సిక్స్ దశకు వచ్చిన జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్ లు ఆడనున్నాయి. ఒక్కో జట్టు మూడేసి చొప్పున మ్యాచులు ఆడతాయి. ప్రస్తుతం పాయింట్లు పట్టిక ప్రకారం టాప్-1 లో ఉన్న శ్రీలంక, నెదర్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అలాగే, మిగిలిన జట్లు కూడా లీగ్ దశలో తమ గ్రూపులో ఆడిన జట్లతో కాకుండా మిగిలిన జట్లతో మ్యాచులు ఆడతాయి. సూపర్ సిక్స్ స్టేజ్ ముగిసేసరికి పాయింట్లు పట్టికలో టాప్-2 లో ఉన్న రెండు జట్లు అక్టోబర్లో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో మిగిలిన 8 జట్లతో కలిసి ఆడతాయి. ప్రస్తుతానికైతే టాప్ -2 లో శ్రీలంక, జింబ్యాబ్వే జట్లు ఉన్నాయి. లీగ్ దశలో నెదర్లాండ్స్ చేతిలో చావు దెబ్బ తిన్న వెస్టిండీస్ సూపర్ సిక్స్ దశలో పాయింట్లు పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ప్రస్తుత దశలో వెస్టిండీస్ వరల్డ్ కప్ కు అర్హత సాధించే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. కానీ, సాంకేతికంగా కొన్ని అంశాలు కలిసి వస్తే మాత్రం వరల్డ్ కప్ మ్యాచ్ ఆడే అవకాశాలు వెస్టిండీస్ కు ఉన్నాయి. వెస్టిండీస్ జట్టు సూపర్ సిక్స్ లో ఆడబోయే మూడు మ్యాచ్లను గెలిచి.. జింబాబ్వే, శ్రీలంక జట్లు తాము ఆడబోయే మూడింటిలో రెండు మ్యాచ్లు ఓడిపోతే వెస్టిండీస్ టాప్ -2 కు చేరే అవకాశం ఉంది. అయితే, అది అంత సులభం కాదు. ఎందుకు అంటే లీగ్ దశలో పాయింట్లు.. సూపర్ సిక్స్ లో కలవడంతో శ్రీలంక, జింబాబ్వేలు ఇప్పటికే నాలుగు పాయింట్లతో ఉన్నాయి. మరో మ్యాచ్ గెలిస్తే ఆ జట్లకు ఆరు పాయింట్లు అవుతాయి. అప్పుడు వెస్టిండీస్ మూడు గెలిచినా కష్టమే అవుతుంది. ఎందుకు అంటే నెట్ రన్ రేట్ వెస్టిండీస్ జట్టుకు తక్కువగా ఉంది.
ఘన చరిత్ర కలిగిన వెస్టిండీస్.. దారుణ పరాభవం..
క్రికెట్ లో వెస్టిండీస్ కు ఘన చరిత్ర ఉంది. అద్భుతమైన ఆటగాళ్లతో బలమైన జట్లలో ఒకటిగా వెస్టిండీస్ గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత 1975, 1979లో నిర్వహించిన రెండు టోర్నీలను గెలుచుకుంది. అప్పటి నుంచి వెస్టిండీస్ జట్టు వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడుతూనే వస్తోంది. ఈసారి వరల్డ్ కప్ కు క్వాలిఫై ఆడేందుకు క్వాలిఫైయర్ మ్యాచ్ లు ఆడాల్సిన పరిస్థితి ఆ జట్టుకు ఏర్పడింది. ఒకవేళ వెస్టిండీస్ వరల్డ్ కప్ కు అర్హత సాధించకపోతే ఘోరమైన పరాభవంగానే మిగిలిపోతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి వెస్టిండీస్ జట్టుకు ఏ మేరకు అదృష్టం కలిసి వస్తుందో.