Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కొన్ని రోజులుగా జరగుతున్న ప్రచారానికి మరో మూడు రోజుల్లో తెరపడబోతోంది. అధ్యక్షుడిని మార్చాలని ఒకవర్గం.. కొనసాగించాలని మరో వర్గం ఎవరి ప్రయత్నాలు వారుచేస్తున్నారు. అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో జూలై 3న జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎన్నికలు జరిగే రాష్ట్రలపై చర్చ…
ఈ ఏడాది చివరన తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయవకత్వం అప్రమత్తమైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలే బీజేపీపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల ముందు జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అధిక ప్రభావం చూపుతాయని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఫలితాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏం చేయాలన్న విషయమై కేంద్ర క్యాబినెట్‌లో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో తెలంగాణలోపాటు నాలుగైదు రాష్ట్రాల అధ్యక్షులను మార్చే అవకాశం ఉందని, కేంద్ర మంత్రివర్గం నుంచి 10 నుంచి 15 మందిని తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. తొలగించిన వారికి ఆయా రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తారని కూడా తెలుస్తోంది.
కేంద్ర క్యాబినెట్‌లోకి బండి
ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈమేరకు అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే అధ్యక్షుడి మార్పు ఉండదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ అంటున్నారు. అధ్యక్షుడి మార్పు ప్రచారాన్ని ఇటు బండి సంజయ్‌తోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా కొట్టిపారేశారు. కానీ కేబినెట్ భేటీ తర్వాత కీలక నిర్ణయాలు ఉంటాయని మాత్రం తెలుస్తోంది.
కామన్ సివిల్ కోడ్ అమలకు ఆమోదం..
ఇదే సమయంలో కేంద్ర క్యాబినెట్ పలు రాష్ట్రాల్లో అధ్యక్షుల మార్పులతోపాటు మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ లా కమిషన్ ఇటీవల కామన్ సివిల్ కోడ్‌పై అభిప్రాయం కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కామన్ సివిల్ కోడ్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపి.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దీనిని అస్త్రంగా మార్చుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మూడు రోజుల్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పుతోపాటు కామన్ సివిల్‌కోడ్ అమలుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.