Odi World Cup 2023: హైదరాబాద్ లో అక్టోబర్ 6న నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఒక విషయంపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు కీపర్, బాటర్ మహ్మద్ రిజ్వాన్ మీద భారత న్యాయవాది వినీత్ జిందాల్ ఐసీసీలో ఫిర్యాదు చేశారు. మరి ఆ మ్యాచ్‌లో రిజ్వాన్ చేసిన పొరపాటు ఏంటి.. న్యాయవాదు చేసిన ఫిర్యాదు ఏంటో తెలుసుకుందాం.
మైదానంలో ప్రార్థన..
అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రిజ్వాన్ మైదానంలోనే నమాజ్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే అందరూ తన మతాచారం ప్రకారం అలా చేసి ఉంటాడని భావించారు. కానీ న్యాయవాది వినీత్ జిందాల్ మాత్రం దీనిపై అభ్యంతరం తెలిపారు. అంత మంది భారతీయుల ముందు ఇలా ప్రార్థన చేయడం అనేది తన కులాన్ని చూపించడం అవుతుందని, క్రీడ అనే ఒక వృత్తిలో ఉన్నప్పుడు ఇలాంటి పని చేయడం అనేది క్రీడా స్ఫూర్తికి ప్రభావం చేసే పని అని వినీత్ పేర్కొన్నారు.
మతపరమైన అంశాలు..
తన ఫిర్యాదులో వినీత్ ఈ విషయంపై మాట్లాడుతూ, ‘మైదానంలో ప్రార్థన చేయడం, శ్రీలంకపై తన ప్రదర్శనని గాజాకి అంకితం చేయడం ఇవన్నీ కూడా మతపరమైన విషయాలు’ అని అన్నారు. తన ఫిర్యాదును వినీత్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఇందులో ఈ విషయం మీద వివరంగా రాశారు. ‘క్రీడకు సంబంధం కాని విషయం ఏదైనా కూడా, క్రీడా స్ఫూర్తిని పెంపొందించదు అని, అలాంటివి చేయకూడదు అని, మైదానంలో ఉన్నప్పుడు క్రీడకి మాత్రమే పరిమితం అయ్యి ఉండాలి’ అని అర్థం వచ్చేలాగా రాశారు. అంతే కాకుండా 2021లో కూడా రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేశారు అని ఇందులో పేర్కొన్నారు.
క్రీడలు కుల మతాలకు అతీతం.
క్రీడలు అనేది అంతర్జాతీయంగా నిర్వహించడానికి కారణం ఏంటంటే, ఇలా చేయడం వల్ల ఒక దేశానికి మరొక దేశానికి మధ్య కులం, మతం, జాతి అనే వాటితో సంబంధం లేకుండా ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది. కానీ పాకిస్తాన్ క్రికెటర్ రిజ్వాన్ మతాన్ని చూపడానికి ప్రార్థన చేశారు అని వినీత్ తెలిపారు. రిజ్వాన్‌పై కఠినమైన చర్య తీసుకోవాలని ఐసీసీని కోరారు. మరి దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.