https://oktelugu.com/

Cricket News : బంగ్లాదేశ్, శ్రీలంక దెబ్బకు కుదేలయిన ఇంగ్లాండ్, పాకిస్తాన్

పెద్ద పెద్ద ఏనుగులు కూడా గరిక పోచలకు బందీలుగా మారతాయి.. కాలకూట విషం ఉండే సర్పాలు కూడా చలి చీమల చేత చస్తాయి. బలం ఉన్నవాడిదే ఎప్పటికీ రాజ్యం కాదు. అప్పుడప్పుడు బలహీనుడు కూడా.. తన పక్కన ఉన్న బలంతో ముందుకు వస్తాడు. తనదైన రోజు బలవంతున్ని పడగొట్టి చూపిస్తాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లు చవిచూస్తున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 11, 2024 / 11:55 AM IST

    Pakistan-England

    Follow us on

    Cricket News : క్రికెట్ లో ఏదైనా జరగొచ్చు. ఏమైనా జరగొచ్చు. అసలు క్రికెట్ అంటేనే అనిశ్చితికి మారుపేరు. అయితే టెస్ట్ క్రికెట్ ఎందుకు మినహాయింపు అని అందరు అనుకుంటారు. సీనియర్ క్రికెటర్లు కూడా ఇదే విషయాన్ని చెబుతుంటారు. ఇది తప్పని.. టెస్ట్ క్రికెట్లో కూడా సంచలనాలు చోటు చేసుకుంటారని.. అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు నిరూపించాయి. అసాధ్యం అనుకున్న లక్ష్యాలను సాధ్యం చేసి విజయాలు సాధించాయి. బలమైన ఇంగ్లాండ్ జట్టును శ్రీలంక పడుకోబెడితే.. సొంత దేశంలో పాకిస్తాన్ జట్టును బంగ్లాదేశ్ నేల నాకించింది. వాస్తవానికి ఈ మ్యాచ్లలో అటు ఇంగ్లాండ్, ఇటు పాకిస్తాన్ ఓడిపోవాల్సిన పరిస్థితి కాదు. కానీ అనూహ్యంగా బంగ్లాదేశ్, శ్రీలంక ఆటగాళ్లు రెచ్చిపోవడంతో ఆతిథ్య జట్లకు పరాభవం తప్పలేదు.

    పాకిస్తాన్ కు కన్నీళ్లు..

    ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పోటీలలో భాగంగా టెస్ట్ సిరీస్ లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్ లో పర్యటించింది. రెండు టెస్టుల సిరీస్ ఆడింది. మొదటి మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 400+ స్కోర్ చేసింది. అయితే ఆ జట్టు కెప్టెన్ మసూద్ బంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే ఎక్కువ స్కోర్ చేసింది. దీంతో పాకిస్తాన్ రెండవ ఇన్నింగ్స్ లో పేక మేడ లాగా కూలిపోయింది. దీంతో బంగ్లాదేశ్ వికెట్ కోల్పోకుండానే పాకిస్తాన్ విధించిన లక్ష్యాన్ని చేదించింది. మొత్తానికి పాకిస్తాన్ జట్టును వారి సొంత దేశంలోనే 10 వికెట్ల తేడాతో ఓడించింది. పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన ఓటమి.. ఇక రెండవ టెస్టులో బంగ్లాదేశ్ 26 పరుగులకే కీలకమైన ఆరు వికెట్ల కోల్పోయింది. దీంతో ఆ జట్టు 50 పరుగుల లోపే చాప చుట్టేస్తుంది అనుకున్నారు. కానీ ఈ దశలో లిటన్ దాస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కూలిపోయే దశలో ఉన్న తన జట్టును నిలబెట్టాడు. తర్వాత బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ జట్టు టాప్ ఆర్డర్ పెవిలియన్ బాట పట్టింది. దీంతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.. వాస్తవానికి ఈ రెండు మ్యాచ్లలో బంగ్లాదేశ్ గెలిచింది అనేకంటే పాకిస్తాన్ చేజేతులా ఓడిపోయిందనడం సబబు.

    ఇంగ్లాండ్ పరిస్థితి కూడా అంతే..

    మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శ్రీలంక జట్టు ఇంగ్లాండ్లో పర్యటించింది. తొలి రెండు టెస్టులను ఇంగ్లాండ్ గెలుచుకుంది. ఇక మూడో టెస్టులో శ్రీలంక చాలా ప్రయోగాలు చేసింది. ఎలాగూ సిరీస్ పోవడంతో కోచ్ జయ సూర్య నిస్సాం కాకు అవకాశం ఇచ్చాడు. అతడని ఓపెనర్ గా బరిలోకి దించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది. పోప్ శతకం పాడాడు.. డకెట్ వెంట్రుకవాసిలో శతకాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. నిస్సాంక అర్థ సెంచరీ చేశాడు. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు శ్రీలంక స్పిన్ బౌలర్లకు దాసోహం అయ్యారు. ఒకరి వెంట ఒకరు పెవిలియన్ చేరుకున్నారు. వికెట్ కీపర్ స్మిత్ హాఫ్ సెంచరీ చేయకుంటే ఇంగ్లాండ్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఇదే దశలో రెండవ ఇన్నింగ్స్ లో శ్రీలంక ఓపెనర్ నిస్సాంక సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అంతేకాదు శ్రీలంక జట్టును గెలిపించాడు. అయితే ఈ రెండు పరిణామాలు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ రెండు టెస్టుల్లో విజయం సాధించడంతో.. బంగ్లాదేశ్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానానికి చేరుకుంది. పాకిస్తాన్ ఎనిమిదవ స్థానానికి పడిపోయింది. ఇక ఇంగ్లాండ్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.