India Vs Afghanistan: కోహ్లీ భాయ్.. జర ఈ మ్యాచ్ లోనైనా బ్యాటింగ్ స్టైల్ మార్చరాదే..

టీమిండియాలో పరుగుల యంత్రంలాగా పేరుపొందిన అతడు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. గత టి20 వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతకుముందు వరల్డ్ కప్ లోనూ అదే జోరు కొనసాగించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 20, 2024 2:44 pm

India Vs Afghanistan

Follow us on

India Vs Afghanistan: రోహిత్ విఫలమైనా పెద్దగా బాధపడరు. హార్థిక్ పాండ్యా ఫామ్ కోల్పోయినా అంతగా ఇబ్బంది పడరు. సూర్య కుమార్ యాదవ్ 360 కోణాల్లో బ్యాటింగ్ చేయకపోయినా, రిషబ్ పంత్ వంగి షాట్లు కొట్టకపోయినా.. కలత చెందరు. కానీ ఒకే ఒక్క ఆటగాడు ఫామ్ కోల్పోతే మాత్రం అభిమానులు ఆవేదన చెందుతారు. సోషల్ మీడియాలో గుండె పగిలేలా పోస్టులు పెడతారు. ఇంతకీ ఆటగాడు ఎవరంటే.. ఇంకెవరు విరాట్ కోహ్లీ..

టీమిండియాలో పరుగుల యంత్రంలాగా పేరుపొందిన అతడు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. గత టి20 వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతకుముందు వరల్డ్ కప్ లోనూ అదే జోరు కొనసాగించాడు. ఇటీవలి ఐపీఎల్ లో మైదానంలో పరుగుల సునామీని సృష్టించాడు. తనదైన రోజు కోసం ఎదురు చూడకుండా.. తను ఆడే మ్యాచ్ ను అనుకూలంగా మార్చుకొని.. బ్యాటింగ్ చేసే సత్తా విరాట్ కోహ్లీ సొంతం. అలాంటి ఆటగాడు ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో తేలిపోతున్నాడు. 1, 4, 0 స్కోర్లు చేసి నిస్సహాయంగా పెవిలియన్ కు వస్తున్నాడు. ఇది సహజంగానే టీమిండియా అభిమానులకు నచ్చడం లేదు. ముఖ్యంగా విరాట్ ఫ్యాన్స్ కు ఏమాత్రం రుచించడం లేదు.

గురువారం సూపర్ -8 లో భాగంగా టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడనుంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో టీమిండియా భారీ స్కోరు చేసిన దాఖలాలు లేవు.. టీమిండియా బ్యాటర్లలో రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ మినహా మిగతా వారంతా భారీ పరుగులు చేసిన దృష్టాంతాలు కూడా లేవు. ఈ క్రమంలో గురువారం నాటి మ్యాచ్లో అభిమానుల కళ్ళు మొత్తం విరాట్ కోహ్లీ మీదనే ఉన్నాయి. ఎందుకంటే అతడు తన స్థాయిలో ఆడటం లేదు. రెచ్చిపోయి పరుగులు చేయడం లేదు. దీంతో అభిమానులు మొత్తం కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారు ముఖం వాచిపోయి ఉన్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తన పూర్వపు లయను అందుకోవాలని.. దూకుడుగా బ్యాటింగ్ చేయాలని.. అవలీలగా పరుగులు సాధించి తమను ఆనందింపజేయాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.. మందకొడిగా ఉన్న బ్రిడ్జ్ టౌన్ మైదానంపై విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.