
జాతీయ జట్టుకు ఆడడం ప్రతీ క్రికెటర్ కల. ఆ తర్వాత స్థానం సుస్థిరం చేసుకోవడమే టార్గెట్. అది కూడా అయిపోయిన తర్వాత వీలైతే కెప్టెన్ షిప్. ఈ ఫార్మాట్ ను ప్రతీ ఆటగాడు ఫాలో అవుతుంటాడు. కానీ.. కొందరికి మాత్రమే చివరిది సాధ్యమవుతుంది. దాన్ని అందుకున్నాడు కోహ్లీ. స్వదేశంలో, విదేశీ పర్యటనల్లో మంచి విజయాలే అందుకున్నాడు. కానీ.. చిరకాల స్వప్నం మాత్రం ఇప్పటి వరకూ నెరవేరలేదు. అదే ఐసీసీ ట్రోఫీ.
ద్వైపాక్షిక సిరీస్ లు నిత్యం జరుగుతూనే ఉంటాయి. టీమిండియా విదేశీ టూర్లకు వెళ్తుంది. విదేశీ జట్లు ఇండియాకు వస్తుంటాయి. గెలుపు ఓటములు కామన్. కానీ.. ఐసీసీ నిర్వహించే టోర్నీలకు ప్రత్యేకత ఉంటుంది. ట్రోఫీ కోసం అన్ని జట్లు సాగించే సమరం అది. అంటే.. ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ జట్లను ఓడించి టైటిల్ సాధించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ జట్టు విశ్వ విజేతగా ఘన కీర్తిని చాటుకుంటుంది. కోహ్లీ కెప్టెన్ అయి దాదాపు ఐదేళ్లయ్యింది. కానీ.. ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేదు.
ఐసీసీ నిర్వహించే టోర్నీలో వన్డే ప్రపంచ కప్ అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ కూడా నిర్వహిస్తుంది. దీంతోపాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. మాజీ కెప్టెన్ ధోనీ సారథ్యంలో టీమిండియా అత్యున్నత స్థితికి చేరిందని చెప్పొచ్చు. అతడి కెప్టెన్సీలో ఐసీసీ నిర్వహించే ఈ మూడు ట్రోఫీలనూ గెలుచుకొని సగర్వంగా సత్తా చాటింది. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లు నెగ్గాడు ధోనీ. ప్రపంచంలో ఈ మూడు ట్రోఫీలను నెగ్గిన ఏకైక కెప్టెన్ ధోనీ మాత్రమే.
ఇంతటి సక్సెస్ ఫుల్ కెప్టెన్ నుంచి పగ్గాలు అందుకున్న కోహ్లీ.. ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా అందుకోలేకపోయాడు. కోహ్లీ కెప్టెన్సీలో ఓ సారి టీ20 ఫైనల్ కు చేరుకొని ఓడిపోయింది. ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ వరకు వెళ్లి నిరాశపరిచింది. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి సువర్ణ అవకాశం వచ్చింది. ప్రస్తుతం న్యూజీలాండ్ తో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నీ. కాబట్టి.. ఈ మ్యాచ్ లో గెలిస్తే.. ఐసీసీ ట్రోఫీ నెగ్గిన కెప్టెన్లలో ఒకడిగా నిలుస్తాడు కోహ్లీ.
మరి, ఇది సాధ్యమవుతందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ప్రత్యర్థి న్యూజీలాండ్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఆ జట్టు సమతూకంతో పటిష్టంగా ఉంది. పైగా గత రికార్డు పరిశీలిస్తే.. కివీస్ దే పైచేయి. గడిచిన 18 ఏళ్లలో ఐసీసీ మెగా ఈవెంట్స్ లో ఆరు సార్లు భారత్-న్యూజీలాండ్ తలపడగా.. ఐదు సార్లు ఓడిపోయింది. ఒక మ్యాచ్ రద్దైంది. అంటే.. టీమిండియా ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ పరిస్థితిని అధిగమించి కోహ్లీ కప్పు గెలవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి, కోహ్లీ ఈ గోల్డెన్ ఛాన్స్ ను అందుకుంటాడా? లేదా? అన్నది చూడాలి. ఇంత మంచి అవకాశం మరోసారి వస్తుందో రాదో కూడా చెప్పలేం.