Ishan Kishan : అనంతపురం వేదికగా ఇండియా – బీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ఇషాన్ కిషన్ సత్తా చాటాడు. కేవలం 120 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇందులో 14 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. గాయం వల్ల ఇషాన్ కిషన్ మొదటి రౌండ్ మ్యాచ్ ఆడ లేకపోయాడు. రెండవ రౌండ్లో ఇండియా – సీ జట్టు తరుపున మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సూపర్ ఇన్నింగ్స్ తో సత్తా చాటాడు. 48 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు.. ఆ తర్వాత తన వేగాన్ని తగ్గించుకున్నప్పటికీ చివరికి మూడు అంకెల స్కోర్ సొంతం చేసుకున్నాడు. వాస్తవానికి ఇషాన్ కిషన్ ఇండియా – డీ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అయితే బుచ్చిబాబు టోర్నీలో ఆడుతున్న సమయంలో అతడు గాయపడ్డాడు. దీంతో ఇషాన్ కిషన్ స్థానంలో సంజు శాంసన్ కు అవకాశం ఇచ్చారు. ఇక బంగ్లాదేశ్ సిరీస్ కు ఎంపికైన ఆటగాళ్లు దులీప్ ట్రోఫీని వీడి వెళ్లిపోయారు. దీంతో కిషన్ ఇండియా – సీ జట్టు ద్వారా అతడు బరిలోకి దిగాడు.
టాస్ ఓడిపోయిన ఇండియా – సీ జట్టు బ్యాటింగ్ కు దిగింది. అయితే ప్రారంభంలోనే ఆ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ గాయం వల్ల రిటైర్డ్ హర్ట్ గా మైదానాన్ని వీడాడు. ఈ దశలో రజత్ పాటిదార్(40: 67 బంతుల్లో 8 ఫోర్లు) మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (43: 75 బంతుల్లో 8 ఫోర్లు) జట్టు ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. అయితే వీరిద్దరూ హాఫ్ సెంచరీలకు దగ్గరవుతున్న క్రమంలో ముఖేష్ కుమార్, నవదీప్ షైనీ బౌలింగ్ లలో వెను తిరిగారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ క్రీజ్ లోకి వచ్చాడు. మూడంకెల స్కోర్ చేశాడు.
జట్టులో చోటు కల్పిస్తారా..
ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకోలేదు. అతడు దేశవాళి క్రికెట్ ఆడక పోవడంతోనే సెంట్రల్ కాంటాక్ట్ నుంచి పేరు తొలగించామని బీసీసీఐ వర్గాలు ప్రకటించాయి. మరో వైపు టి20 వరల్డ్ కప్ లోనూ అతనికి అవకాశం లభించలేదు. ఇటీవలి శ్రీలంక పర్యటనలోనూ అతడికి రిక్తహస్తమే ఎదురయింది. బంగ్లాదేశ్ సిరీస్ లోనూ అతని పేరు సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఆ బాధను మొత్తం భరిస్తూ ఇషాన్ కిషన్ సత్తా చాటాడు. మరి ఇప్పటికైనా టీమ్ ఇండియా సెలక్టర్లు వచ్చే టోర్నీలలో కిషన్ కు అవకాశం కల్పిస్తారా? అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.