KL Rahul :ఆ జట్టు కెప్టెన్సీ మార్పు.. కేఎల్ రాహుల్ ను ఎందుకు మార్చారు?

ధోని తనకు సారధ్య బాధ్యతలు వద్దంటూ రుతురాజ్ గైక్వాడ్ కు చెన్నై కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించాడు. అయితే ఈ రెండు జట్లు అవలంబించిన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. లక్నో కూడా కఠిన నిర్ణయం తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Written By: NARESH, Updated On : March 30, 2024 10:31 pm

_kl-rahul-bcci_625x300_20

Follow us on

KL Rahul : ఐపీఎల్ 17వ సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ జట్టు సారధిని మార్చింది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించింది. ఆ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి నేటి వరకు ముంబై జట్టు యాజమాన్యం విమర్శల పాలవుతూనే ఉంది. హార్దిక్ పాండ్యా గా కెప్టెన్ గా నియమించినప్పటికీ ముంబై జట్టు జాతకం పెద్దగా మారలేదు. ఆ జట్టు ఐపిఎల్ సీజన్లో ఇప్పటివరకు వరుసగా రెండు ఓటములు ఎదుర్కొంది. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పేలవమైన బౌలింగ్ వేసి చెత్త రికార్డు నమోదు చేసుకుంది.

ముంబై సంగతి అలా ఉంటే ఇప్పుడు లక్నో జట్టు విషయం వెలుగులోకి వచ్చింది. పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. రాహుల్ స్థానంలో లక్నో జట్టు సారధ్య బాధ్యతలను నికోలస్ పూరన్ స్వీకరించాడు. ఈ నిర్ణయం ఈ టోర్నీ మొత్తం ఉంటుందా.. కేవలం ఒక్క మ్యాచ్ కు మాత్రమే పరిమితం అవుతుందా? ఈ ప్రశ్నలకు లక్నో జట్టు స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడుతున్నట్టు టాస్ వేస్తున్న సందర్భంగా లక్నో కొత్త కెప్టెన్ పూరన్ ప్రకటించాడు.

రాహుల్ కొంతకాలం నుంచి నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. అతడు కొంతకాలం నుంచి గాయాల బారిన పడుతూనే ఉన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ నుంచి అర్ధాంతరంగా రాహుల్ నిష్క్రమించాడు. అప్పటినుంచి ఐపీఎల్ ప్రారంభమయ్యే నాటి వరకు రాహుల్ నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందాడు. అయితే గాయం నుంచి ఇటీవల కోలుకున్న రాహుల్ పై పని ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు లక్నో కొత్త కెప్టెన్ పూరన్ వివరించాడు.

హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణమేంటనే చర్చలు క్రీడా వర్గాల్లో మొదలయ్యాయి. ఈ సీజన్లో లక్నో జట్టు ఇంతకుముందు ఒక మ్యాచ్ మాత్రమే ఆడింది. ఒక్క మ్యాచ్ లోనే పని భారం గురించి కెప్టెన్సీ వదులుకున్నాడంటే.. రాహుల్ ఫిట్ నెస్ పై అనుమానాలు మొదలయ్యాయి. గత ఐపీఎల్ సీజన్లో రాహుల్ గాయపడ్డాడు. కొన్ని నెలల పాటు మైదానంలో కనిపించలేదు. నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొంది చివరికి ఆసియా కప్ ద్వారా మైదానంలోకి పున: ప్రవేశించాడు. అనంతరం వన్డే వరల్డ్ కప్ క్రికెట్ లో ఆడాడు. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనలో పాల్గొన్నాడు. కానీ ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సిరీస్ లో అతడు మళ్ళీ గాయపడ్డాడు. మొదటి టెస్ట్ అనంతరం మళ్లీ ఆటకు దూరమయ్యాడు. కొంతకాలం చికిత్స పొంది మళ్లీ ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. రాజస్థాన్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా వ్యవహరించాడు. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడాడు.

కెప్టెన్ గా రాణించకపోవడం వల్లే రాహుల్ పై లక్నో యాజమాన్యం చర్యలు తీసుకుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను ముంబై జట్టు యాజమాన్యం నియమించింది. ధోని తనకు సారధ్య బాధ్యతలు వద్దంటూ రుతురాజ్ గైక్వాడ్ కు చెన్నై కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించాడు. అయితే ఈ రెండు జట్లు అవలంబించిన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. లక్నో కూడా కఠిన నిర్ణయం తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.