Rohit Sharma removed as ODI captain: ఐపీఎల్ లో ముంబై జట్టును ఐదుసార్లు విజేతను గా చేసిన చరిత్ర రోహిత్ శర్మకు ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్ అయిన తర్వాతే ముంబై జట్టు రాత పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్ లో అత్యంత విలువైన జట్టుగా ముంబై రూపాంతరం చెందింది. కానీ ముంబై జట్టు అతడు చేసిన సేవలను పక్కనపెట్టి ఏకంగా హార్దిక్ పాండ్యాను సారధిగా నియమించింది. మేనేజ్మెంట్ నిర్ణయాన్ని రోహిత్ భార్య బహిరంగంగానే విమర్శించింది.. తన భర్త కెరియర్ తో ఆడుకుంటున్నారని ఆరోపించింది.
ఐపీఎల్ సంగతి అలా ఉంచితే టీమిండియాకు సారధిగా రోహిత్ ఎన్నో విజయాలు అందించాడు. గత ఏడాది టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు రోహిత్. సహచర ప్లేయర్లు విఫలమవుతున్నప్పటికీ అతడు మాత్రం గట్టిగా నిలబడ్డాడు. జట్టు సాధించిన విజయాలలో ముఖ్య పాత్ర పోషించాడు. టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు రోహిత్.
ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ తో భారత క్రికెట్ పెద్దలు భేటి అయ్యారు. టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్లో బలపడాల్సిన తీరును వివరించారు. పొమ్మనలేక పొగ పెట్టారు. దీంతో రోహిత్ ఆ ఫార్మాట్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ రోహిత్ శర్మకు మేనేజ్మెంట్ నుంచి చేదు అనుభవం ఎదురయింది. అతడు టీమ్ ఇండియాకు 2027 వన్డే వరల్డ్ కప్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. దానిని ప్రారంభంలోనే తుంచేసింది మేనేజ్మెంట్. మరో మాటకు తావు లేకుండా అతడిని సారధిగా తొలగించింది. సాధారణ ఆటగాడిగా మాత్రమే పరిమితం చేసింది.
ఆస్ట్రేలియాలో జరిగే వన్డే సిరీస్ కంటే ముందు టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడింది. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ముందుండి నడిపించాడు రోహిత్. అద్భుతమైన విజయాలు అందించాడు. టీమిండియా కు ఛాంపియన్స్ ట్రోఫీని అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వాస్తవానికి పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రోహిత్ శర్మను మేనేజ్మెంట్ తప్పించదని అందరూ అనుకున్నారు. కానీ మేనేజ్మెంట్ ఆ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. పైగా రోహిత్ గత చరిత్రను కూడా లెక్కలోకి తీసుకోకుండా సాధారణ ఆటగాడిగా మాత్రమే పరిమితం చేసింది.. దీనిపై రోహిత్ అభిమానులు మండిపడుతున్నప్పటికీ.. ఆల్రెడీ మేనేజ్మెంట్ డిసిషన్ కు అతడు ఓకే చెప్పాడు కాబట్టి ఇక తప్పదు. టీమిండియా కు ఎన్నో విజయాలు అందించిన రోహిత్ ఇకపై గిల్ నాయకత్వంలోనే ఆడాల్సి ఉంటుంది.