AUS vs ENG 3rd Ashes Test: స్మిత్ మూడో టెస్టులో కనిపించకపోవడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. అంతేకాదు అనూహ్యంగా ప్లే ఎలెవెన్ లోకి ఖవాజా రావడంతో స్పోర్ట్స్ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరిగింది. వాస్తవానికి ఖవాజా అద్భుతమైన ఆటగాడు అయినప్పటికీ.. అతడికి తుది జట్టులో చోటు రావడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే దీని వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.
ఆడిలైడ్ టెస్ట్ లో స్మిత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు వచ్చాయి. తల తిరుగుడు, వాంతులతో అతడు ఇబ్బంది పడుతున్నట్టు కథనాలు రావడంతో అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారు? ఎవరితో ఆడిస్తారు? అనే చర్చ మొదలైంది. పైగా సామర్థ్య పరీక్షలో స్మిత్ విఫలమయ్యాడు. దీంతో అతడు మైదానం నుంచి వెళ్లిపోయాడు.
“కొద్దిరోజులు అతడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. చెవిలోపల భాగం నొప్పిగా ఉంది. అందువల్లే అతడికి తల తిరుగుతున్నట్టుగా అనిపించింది. దీంతో అతడు అడిలైడ్ టెస్టులో కనిపించలేదు. ఈ లక్షణాలు దీర్ఘకాలం ఉండడంతో.. అతడు ఈ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. వెస్టిబ్యూలర్ సమస్యతో అతడు బాధపడుతున్నాడు. మెల్ బోర్న్ లో జరిగే బాక్సింగ్ డే టెస్ట్ కు అందుబాటులోకి వస్తాడని” ఆస్ట్రేలియా క్రికెట్ ప్రతినిధులు పేర్కొన్నారు.
స్మిత్ నాయకత్వంలో ఆస్ట్రేలియా ప్రస్తుత యాషెస్ సిరీస్ లో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టింది. ఫీల్డింగ్ లో కూడా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది.. అందువల్లే మరోసారి యాషెస్ సిరీస్ సొంతం చేసుకోవడానికి వేగంగా అడుగులు వేస్తోంది.
ఇప్పటికే స్టార్క్ ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నాడు. బోలాండ్ కూడా అదరగొడుతున్నాడు. వీరిద్దరే ఇప్పటివరకు ఇంగ్లాండ్ జట్టు పతనాన్ని దిగ్విజయంగా శాసించారు. ఇప్పుడు వీరికి తోడుగా కమిన్స్ వచ్చాడు. బౌలింగ్లో అద్భుతమైన ప్రమాణాలను నెలకొల్పే ఇతడు.. ఇంగ్లాండ్ జట్టుకు సరికొత్త పాఠాలు నేర్పడం ఖాయమని ఆస్ట్రేలియా అభిమానులు భావిస్తున్నారు. అంతేకాదు ఆస్ట్రేలియా జట్టుకు మరో విజయం కూడా సాధ్యమవుతుందని జోస్యం చెబుతున్నారు. మరి కమిన్స్ ను ఇంగ్లాండ్ జట్టు ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.