Champions Ttrophy 2025: ఇటీవల సిడ్నీ వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టుకు బుమ్రా నాయకత్వం వహించాడు. దీంతో రోహిత్ శర్మకు ఉద్వాసన పలికినట్టేనని.. అతడు జట్టుకు నాయకత్వం వహించేది కష్టమేనని వార్తలు వినిపించడం మొదలుపెట్టాయి. ఇవి వేగంగా రోహిత్ శర్మ రిటర్మెంట్ ప్రకటిస్తాడు అనే దాకా వెళ్లాయి. దీంతో చివరికి రోహిత్ స్పందించక తప్పలేదు.. తాను రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేదని స్పష్టం చేశాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఓడిపోయిన తర్వాత.. విమర్శలు మొదలయ్యాయి. ఆటగాళ్ల ఆట తీరుపై ఆరోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి.. మేనేజ్మెంట్, ఆటగాళ్ల మధ్య కొరవడిన సమయమనం, కోచ్, కెప్టెన్ మధ్య లోపించిన సయోధ్య వంటివి జట్టుకు శరాఘాతంగా పరిణమించాయి. అయితే ఆ వైఫల్యం నుంచి టీమ్ ఇండియాకు తేరుకునే అవకాశం లభించింది. మరి కొద్ది రోజుల్లో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. దీనికి సంబంధించి ఈ నెల 12లోగా ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడే దేశాలు తమ జట్లను ప్రకటించాలి. అని బీసీసీ ఇంతవరకు జట్టును వెల్లడించలేదు. అయితే ఈ టోర్నీకి అందరూ అనుకున్నట్టుగా హార్దిక్ పాండ్యా కాకుండా రోహిత్ శర్మనే నాయకత్వం వహిస్తాడని జట్టు వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో రోహిత్ శర్మ సరైన ఫామ్ లో లేకపోవడం.. సిడ్ని టెస్ట్ కు దూరంగా ఉండటంతో.. అతడిని పక్కనపెట్టి హార్దిక్ పాండ్యాకు వన్డే జట్టు పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే అదంతా నిజం కాదని.. రోహిత్ శర్మనే జట్టుకు నాయకత్వం వహిస్తాడని జట్టు మేనేజ్మెంట్ దాదాపుగా స్పష్టం చేసింది..
జట్టు అంచనా ఇలా
ప్రస్తుతానికి జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం రోహిత్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, కులదీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ వంటి వారికి జట్టులో చోటు లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
8 సంవత్సరాల తర్వాత..
8 సంవత్సరాల తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తోంది. 2017లో ఇంగ్లాండ్ వేదికగా నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్తాన్ జట్టు విజేతగా నిలిచింది. అంతకుముందు సీజన్లో భారత జట్టు ఛాంపియన్ గా అవతరించింది. ఇక ఈసారి జట్టును చాంపియన్ గా నిలిపి.. వన్డే ఫార్మాట్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడు.. ఇదే విషయాన్ని జాతీయ మీడియా కూడా ఇటీవల వెల్లడించింది. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్తాన్ దేశం ఆతిథ్యం ఇస్తోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ వెళ్ళేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చేసిన సూచన ప్రకారం.. టీమ్ ఇండియా ఆడే మ్యాచ్ లు మొత్తం దుబాయ్ వేదికగా జరుగుతాయి. దీనిని క్రికెట్ పరిభాషలో హైబ్రిడ్ మోడల్ అంటారు.. రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు.. ఆటగాళ్ల భద్రత.. ఇన్ని కారణాల నేపథ్యంలో టీమిండియా తను ఆడే మ్యాచ్ లు మొత్తం దుబాయ్ వేదికగానే ప్రత్యర్థి జట్లతో తలపడనుంది. గతంలో నిర్వహించిన ఆసియా కప్ లోనూ టీమిండియా ఇదే తీరుగా హైబ్రిడ్ విధానంలో మ్యాచ్ లు ఆడింది. అప్పుడు చాంపియన్ గా ఆవిర్భవించింది. ఇప్పుడు కూడా టీమిండియా అదే స్థాయిలో ఆడి విజేతగా నిలవాలని భావిస్తున్నది.