ODI World Cup 2023: క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. దాదాపు అన్ని జట్లు కూడా భారత్ చేరుకున్నాయి. మైదానాలలో కసరత్తు ప్రారంభించాయి. అయితే ఈ జట్లలో టోర్నీ ఫేవరెట్లలో ముందు వరుసలో ఉంది ఇంగ్లాండ్ జట్టు. 2019లో న్యూజిలాండ్ జట్టును ఓడించి కప్ కైవసం చేసుకున్న ఈ జట్టు.. నాలుగేళ్ల తర్వాత కూడా అదే ఉత్సాహాన్ని కనబరుస్తోంది. భీకరమైన బ్యాటింగ్ లైన్ అప్.. భయంకరమైన బౌలింగ్ స్క్వాడ్.. అటాకింగ్ ఫీలింగ్ తో ప్రత్యర్థి జట్లకు సింహ స్వప్నంగా మారింది.
ఒకప్పుడు ఆస్ట్రేలియా తో మ్యాచ్ అంటే ఏ జట్లైనా భయపడేవి. ఎందుకంటే ఆ జట్టు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం ఆ స్థాయిలో ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఇంగ్లాండ్ ఆక్రమించింది అంటే అతిశయోక్తి కాదు. దూకుడయిన ఆటతీరుతో ఆస్ట్రేలియా స్థానాన్ని ఇంగ్లాండ్ ఆక్రమించింది. తన ఎదురులేని ఆట తీరుతోనే 2019లో విజేతగా నిలిచింది. ప్రపంచ కప్ నెరవేర్చుకుంది. భారత్ లో ఈసారి వరల్డ్ కప్ నిర్వహిస్తున్న నేపథ్యంలో భారీ అంచనాలతో ఇంగ్లాండ్ రంగంలోకి దిగింది. అయితే ఈసారి హాట్ ఫేవరెట్ భారత్ కాదని, ఇంగ్లాండ్ జట్టుకే అర్హత ఉందని ఒకప్పటి స్టార్ బ్యాటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. 2019లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఈసారి కూడా ఆ అంచనాలు నిలబెట్టుకునేందుకు ఇంగ్లాండ్ జట్టు తీవ్ర కసరత్తు చేస్తోంది. 2015 ప్రపంచ కప్ వైఫల్యం తర్వాత జట్టులో సమూల మార్పులు చేసింది. దూకుడయిన ఆటతీరుతో మేటి జట్టుగా ఎదిగింది. 2019 తర్వాత కూడా అదే తీరును కొనసాగిస్తున్నది.
ప్రస్తుత క్రికెట్ జట్లల్లో ఏ జట్టుకూ లేని బ్యాటింగ్ లైనప్ ఇంగ్లాండ్ కు ఉంది. బౌలింగ్ స్క్వాడ్ కూడా అద్భుతంగా ఉంది. ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బెయిర్ స్టో, మలన్, బ్రూక్, రూట్, స్టోక్స్, లివింగ్ స్టన్, బట్లర్, మొయిన్ అలీ, సామ్ కరణ్, విల్లీ లతో బ్యాటింగ్ లైన్ అప్ భీకరంగా ఉంది.. మొయిన్ అలీ బౌలింగ్ లో ప్రత్యర్థి బ్యాటర్లు పరుగులు తీయడం దాదాపు కష్టమే.. కరణ్ కూడా వైవిధ్యంగా బంతులు వేస్తున్నాడు. ప్రపంచ కప్ కోసం స్టోక్స్ ఇది రావడం ఆ జట్టు బలాన్ని ఇంకా పెంచింది. ఆల్ రౌండర్లు అందుబాటులోకి రావడంతో ఆ జట్టు మరింత బలంగా కనిపిస్తోంది. దీనివల్ల కొంతమంది విఫలమైనప్పటికీ, మిగతావారు ఆదుకుంటున్నారు. అదే ఇంగ్లాండ్ జట్టు విజయ రహస్యంగా మారింది. ఒకప్పుడు ఆస్ట్రేలియా జట్టు ఇలానే ఆడేది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఇంగ్లాండ్ భర్తీ చేసింది.
టెస్ట్ మ్యాచ్ లలో “బాజ్ బల్” విధానాన్ని అనుసరించే ఇంగ్లాండ్.. వన్డే మ్యాచ్ లలోనూ అదే సూత్రాన్ని పాటిస్తోంది. అయితే ఇది కొన్నిసార్లు జట్టుకు చేటు తెస్తోంది. ఇంగ్లాండ్ జట్టుకు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నప్పటికీ.. బౌలింగ్ దళాన్ని మోసే ఏస్ బౌలర్ లేకపోవడం ప్రతికూలంగా ఉంది. భారత మైదానాలపై నాణ్యమైన స్పిన్నర్లు ఎదురైతే ఇంగ్లాండ్ జట్టు తట్టుకొని నిలబడగలదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ జట్టులో బట్లర్, స్టోక్స్, లివింగ్ స్టన్, రషీద్ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు..