BCCI financial priorities: ప్రపంచ క్రికెట్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి శాసిస్తోంది. ఇటీవల పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించినప్పుడు.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ట్రోఫీని ప్రదర్శించకూడదని బీసీసీఐ స్పష్టం చేసింది. వాస్తవానికి బీసీసీఐ స్థానంలో మరొక మేనేజ్మెంట్ గనుక ఉండి ఉంటే ఐసీసీ లెక్కపెట్టేది కాదు. బీసీసీ చెప్పింది కాబట్టి ఐసీసీ కూడా తలవంచాల్సి వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ప్రపంచ క్రికెట్ మీద భారత క్రికెట్ నియంత్రణ మండలి పెత్తనం సాగుతుందా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం భవిష్యత్ కాలంలో రాకపోవచ్చు. ఎందుకంటే బీసీసీఐ చేస్తున్న తప్పులే దీనికి కారణం. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పుడు ఐశ్వర్యవంతంగా కనిపించవచ్చు. కానీ ఒకప్పుడు అంటే 1983 కంటే ముందు అప్పులు చేసి భారత క్రికెట్ నియంత్రణ మండలి టోర్నీలు ఆడింది. ఎప్పుడైతే 1983లో కపిల్ ఆధ్వర్యంలో భారత జట్టు వరల్డ్ కప్ అందుకున్న తర్వాత భారత క్రికెట్ ముఖచిత్రం మారిపోయింది. ఆ తర్వాత పలు కంపెనీలు భారత క్రికెట్ ను నమ్మడం మొదలుపెట్టాయి. స్పాన్సర్ రూపంలో డబ్బులు ఇవ్వడం ప్రారంభించాయి. సచిన్ వచ్చిన తర్వాత భారత క్రికెట్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. సచిన్ ఆధ్వర్యంలో భారత్ విజయాలు సాధించినప్పటికీ ఐసీసీ నిర్వహించిన మేజర్ టోర్నీలు గెలవలేకపోయింది. అయితే సెమీస్ లేదా ఫైనల్ దాకా వెళ్లడం.. అందులో ఓడిపోయి రావడం.. ఇలా పరిపాటిగా మార్చుకుంది. గంగూలి ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ మీద నాట్ వెస్ట్ టోర్నీ గెలిచిన తర్వాత భారత క్రికెట్ ఆర్థిక రూపం మారింది. పెద్ద పెద్ద కంపెనీలు స్పాన్సర్లుగా రావడం మొదలైంది.
2003లో దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్ లో భారత్ ద్వితీయ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. అయినప్పటికీ జట్టు చేసిన పోరాటం నచ్చడంతో చాలా వరకు కంపెనీలు భారత క్రికెట్ నియంత్రణ మండలిని నమ్మడం మొదలు పెట్టాయి. ధోని ఆధ్వర్యంలో టీమిండియా 2007 పొట్టి వరల్డ్ కప్ గెలుచుకుంది. ఆ తర్వాత 2011లో పరిమిత ఓవర్ల ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. ఇదే ఊపులో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అందుకుంది. మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇచ్చే స్థాయి నుంచి మట్టి కరిపించే స్థాయికి ఎగిరింది. ఇదే సమయంలో ప్లేయర్ల ప్రదర్శన బాగుండడంతో తిరుగు లేని స్థాయికి చేరుకుంది. అప్పులు చేసే దశ నుంచి ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకునే దశ వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ అందుకుని భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత జట్టులో సుదీర్ఘ ఫార్మాట్, పొట్టి ఫార్మాట్లో రోహిత్ లేడు, విరాట్ కూడా లేడు. విరాట్, రోహిత్ జట్టులో ఉన్నప్పుడే పొట్టి ప్రపంచ కప్ భారత్ అందుకుంది. వాస్తవానికి విరాట్, రోహిత్ భారత క్రికెట్ కు సరికొత్త గ్లామర్ తీసుకొచ్చారు. వీరి ఆధ్వర్యంలో టీమిండియా అప్రతిహత విజయాలు సాధించింది. ఏకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ దాకా వెళ్ళింది. ట్రోఫీ అందుకోలేకపోయినప్పటికీ భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని రాసింది. కానీ ఇప్పుడు వారిద్దరూ లేరు. 2027 తర్వాత వారిద్దరు జట్టులో ఉండడం అనుమానమే. అయితే వీరి తర్వాత జట్టును ఆ స్థాయిలో ముందుండి నడిపించేది ఎవరు.. ఒకవేళ ఆ స్థాయిలో నడిపించకపోతే భారత జట్టుకు ఇబ్బంది తప్పదు. పైగా ఆ స్థాయిలో ప్లేయర్లను మేనేజ్మెంట్ రూపొందించలేకపోతోంది.
పొట్టి ఫార్మాట్లో అదరగొడుతున్న సంజు శాంసన్, అభిషేక్ శర్మ కు స్థిరమైన అవకాశాలు ఇస్తున్నప్పటికీ.. వారిని ఆ ఫార్మాట్ కు మాత్రమే పరిమితం చేస్తోంది. జైస్వాల్ ను తాజా సిరీస్ కు ఎంపిక చేయలేదు. గిల్ కు అవకాశాలు ఇస్తున్నప్పటికీ.. అతనితో కూడా మేనేజ్మెంట్ రాజకీయాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇలా ప్లేయర్లను స్థిరచిత్తమైన ప్రదర్శన చేయనీయకుండా మేనేజ్మెంట్ ఆటలాడుకుంటే మొదటికే మోసం వస్తుంది. అప్పుడు విజయాలు సాధ్యం కాకపోగా మేనేజ్మెంట్ పరువు పోతుంది. ఒక పట్లగానే మళ్లీ అప్పులు చేసుకొని టోర్నీలు ఆడాల్సిన దుస్థితి వస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త తరానికి అవకాశాలు ఇచ్చి.. వారిలో స్థిరమైన ఆట తీరు పెంపొందించే వాతావరణం సృష్టించాలని.. అవకాశవాద రాజకీయాలకు మేనేజ్మెంట్ స్వస్తి పలకాలని.. లేకపోతే పరిస్థితి దారుణంగా మారుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.