T20 World Cup 2024
T20 World Cup 2024: త్వరలో వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ నకు అన్ని క్రికెట్ జట్లు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లు ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి. 19 మంది ఆటగాళ్ల పేర్లతో బీసీసీఐ ఐసీసీకి జాబితా ఇచ్చింది. వీరిలో 15 మంది ఆటగాళ్లు ప్రధాన జట్టులో ఉన్నారు. మిగతా నలుగురిని బీసీసీఐ సెలక్షన్ కమిటీ రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. ఇక ప్రధాన జట్టులో ఆరుగురు యువ ఆటగాళ్లకు ఇదే తొలి టి20 వరల్డ్ కప్ కావడం విశేషం. ఇంతకీ ఆ యువ ఆటగాళ్ల ఆట తీరను ఒకసారి పరిశీలిస్తే..
యశస్వి జైస్వాల్
ఈ 22 ఏళ్ల ఆటగాడు ఇంగ్లాండ్ జట్టుతో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఇప్పటివరకు 17 t20 మ్యాచ్ లు ఆడాడు.. 502 రన్స్ చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 161.93.. తనదైన రోజు మ్యాచ్ స్వరూపాన్ని సమూలంగా మార్చేసే సత్తా ఈ ఆటగాడి సొంతం. అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అదే స్థాయిలో ఫీల్డింగ్ కూడా చేయగలడు. టి20 వరల్డ్ కప్ లో అవకాశం లభించిన నేపథ్యంలో.. తన సత్తాను ప్రదర్శించాలని ఆసక్తిగా ఉన్నాడు.
సంజు శాంసన్
ఇతడిని టీ – 20 వరల్డ్ కప్ జట్టులోకి రెండవ వికెట్ కీపర్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఐపిఎల్ లో రాజస్థాన్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఏమాత్రం అంచనాలు లేని తన జట్టును నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాడు. అంతేకాదు, ఐపీఎల్ ట్రోఫీ రేసులో ముందు వరుసలో ఉంచాడు. సంజు ఇప్పటి వరకు 25 టి20 మ్యాచ్ లు ఆడాడు. 374 రన్స్ చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 133.09 గా ఉంది.
శివం దూబే
దూకుడైన ఆట తీరుకు అస్సలు సిసలైన చిరునామా ఎవరంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు శివం దూబే. ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున ఆడుతున్న ఈ యువ ఆటగాడు.. సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు 21 t20 మ్యాచ్ లు ఆడాడు. 276 రన్స్ చేశాడు. టి20 వరల్డ్ కప్ కు ఎంపికైన నేపథ్యంలో తన మిస్టీరియస్ ఆట తీరును ప్రదర్శించాలని ఆత్రుతగా ఉన్నాడు.
కులదీప్ యాదవ్
బంతితో అద్భుతాలు చేయగల స్పిన్నర్ ఇతడు. ప్రస్తుత ఐపిఎల్ లో ఢిల్లీ జట్టు తరఫున అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు కులదీప్ యాదవ్ 35 టి20 మ్యాచ్ లు ఆడాడు. 59 వికెట్లు పడగొట్టాడు.. త్వరలో జరగబోయే టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు స్పిన్ విభాగంలో బలమైన బౌలర్ ఇతడు.
యజువేంద్ర చాహల్
పరుగుల వరద పారే టి20 క్రికెట్లో.. అద్భుతమైన బంతులు వేస్తూ బ్యాటర్లను కట్టడి చేయగల నేర్పరితనం యజువేంద్ర చాహల్ సొంతం.. ఇప్పటివరకు 80 మ్యాచ్లు ఆడాడు.. లెక్కకు మిక్కిలి వికెట్లు తీశాడు..తొలిసారి t20 ప్రపంచకప్ లో ఆడుతున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ లో మొన్నటిదాకా పర్పుల్ క్యాప్ విభాగంలో ముందు వరుసలో ఉండేవాడు. అంతేకాదు ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అవతరించాడు.
మహమ్మద్ సిరాజ్
ఈ హైదరాబాద్ ఆటగాడికి ఇంతవరకు భారత జట్టు తరఫున టి20 లో ఆడిన అనుభవం లేదు.. ఇప్పటివరకు సిరాజ్ పది మ్యాచ్ లు ఆడాడు. ఆశించినంత స్థాయిలో వికెట్లు పడగొట్టలేకపోయాడు. అయితే తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాడు.