Homeక్రీడలుPakistan Cricket Team : దేశం అధోగతిలో ఉన్నా పాకిస్తాన్ క్రికెట్ మాత్రం దూసుకుపోతుంది... ఇదెలా...

Pakistan Cricket Team : దేశం అధోగతిలో ఉన్నా పాకిస్తాన్ క్రికెట్ మాత్రం దూసుకుపోతుంది… ఇదెలా సాధ్యం?

Pakistan Cricket Team : కూటికి గతిలేకున్నా.. తమ దేశ పతాకాన్ని ఇనుమడింప చేయడంలో పాకిస్తాన్ క్రికెటర్ల పోరాటాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఆ పేదరికపు కసినే వారిని చాంపియన్లుగా మలుస్తుంది. ఎటువంటి అంచనాలు లేకుండా దిగడమే వారి బలం.. బలగం.. అంచనాలు పెరిగాయో అప్పుడే వారిలో భయం పెరిగి ఓటములు ఎదురవుతున్నాయి. తమదైన రోజు ఎంతటి గట్టి ప్రత్యర్థినైనా ఓడించడం పాకిస్తాన్ క్రికెట్ టీం ప్రత్యేకత. అయితే అనిశ్చితి వారికి మారుపేరు. అతిగా అంచనాలే వారి కొంప ముంచుతాయి. ఎవరూ పట్టించుకోకుండా వదిలేస్తే అద్భుతాలు చేసే టీం అదీ. ఇక ప్రపంచ ఫాస్ట్, స్వింగ్ బౌలర్ల ఖార్ఖానాగా పాకిస్తాన్ ఎదిగింది. ఇందుకు సీనియర్లు వేసిన పునాది ఇప్పటికీ ఫాస్ట్ బౌలర్ల స్వర్గధామంగా పాకిస్తాన్ ను మార్చడానికి దోహదపడింది. ఇంతకీ ఇంత కష్టాల్లో కూడా ఆర్థికంగా అవస్థలు పడుతున్నా కూడా.. దేశం అధోగతిలో ఉన్నా పాకిస్తాన్ క్రికెట్ మాత్రం దూసుకుపోతోంది.. ఇదెలా సాధ్యమన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న..

-పాకిస్తాన్ బలం.. బలహీనత ఇదీ..

గత రెండు దశాబ్దాలుగా వారి బలం ఫాస్ట్ బౌలింగ్. వకార్ యూనిస్, షోయబ్ అక్తర్,వసీం అక్రమ్ తమ వారసత్వాన్ని పిల్లలకు స్ఫూర్తిగా పంచడంలో విజయం సాధించినట్లు తెలుస్తోంది. కానీ సమస్య ఏమిటంటే అవి స్థిరంగా లేవు. బాగా రాణించిన వారు డబ్బులకు కక్కుర్తి పడి మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిపోయారు. పాకిస్తాన్ లోని పేదరికం కూడా వారు అలా మరలడానికి కారణం.

ఐదేళ్ల కిందటి వరకూ పాకిస్తాన్ కు దొరికిన ఫాస్ట్ బౌలింగ్ ఆణిముత్యం అమీర్. ఇతడు తన ఎడమచేతి వాటంతో బాగా రాణించాడు. అతనికి సామర్థ్యం ఉంది.. పైగా యువకుడు,. దూకుడు, అతను విప్లవాత్మక ఫాస్ట్ బౌలర్‌గా మారే ప్రక్రియలో పాకిస్తాన్ టీం విఫలమైంది. మ్యాచ్ ఫిక్సింగ్ కు గురై తన కెరీర్ పాడుచేసుకున్నాడు.

సయీద్ అజ్మల్ తప్పుడు బౌలింగ్ యాక్షన్‌కు బలియ్యాడు. కానీ అతను ఆడినప్పుడు పాకిస్తాన్ కు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. ఇక వాహబ్ రియాజ్, అతను పాకిస్తాన్ కు దొరికిన స్పీడ్ స్టర్.. ఎల్లప్పుడూ 145 కి.మీల వేగంతో బౌలింగ్ చేస్తాడు. 150 కి.మీల వరకు కొన్ని ఆశ్చర్యకరమైన డెలివరీలు వేస్తాడు.. అతనికి కొంత గొప్ప సామర్థ్యం ఉంది, మైఖేల్ క్లార్క్ లాంటి ఆటగాడు సైతం పొగిడాడు. జునైద్ ఖాన్ అతను తన కెరీర్ ప్రారంభంలో అదరగొట్టాడు..విరాట్ కోహ్లీని చాలాసార్లు ఔట్ చేశాడు. కానీ ఏదో అతన్ని విజయవంతం కాకుండా అడ్డుకుంది. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ స్పీడ్ బౌలింగ్ కు బుల్లెట్ ఆయుధంలా షాహిన్ ఆఫ్రిది దొరికాడు. ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ విసిరితే వికెట్లు విరిగిపోతాయి. ఒకరి కాలు కూడా విరిగింది. యార్కర్ కింగ్ గా పేరొందాడు. ఇతడి బౌలింగ్ లో ఆడడానికి అందరూ భయపడుతున్నారు. కానీ వరుస గాయాలు అతడిని టీంకు దూరం చేశాయి. గత ఏడాది ఆసియా కప్, టీ20 కప్ లోనూ ఫిట్ నెస్ లేమితో సరిగా ఆడలేకపోయాడు.

పాకిస్తాన్ కు మంచి ఫాస్ట్ బౌలర్లు దొరుతుతారు. మంచి బ్యాటర్లు దొరుకుతారు. బాగా కష్టపడి ఆడుతారు. కానీ వారిని కాపాడుకోవడంలో పాకిస్తాన్ క్రికెట్ రాజకీయాలు ఫెయిల్ అవుతున్నాయి. వారికి సరైన ట్రైనింగ్, ప్రోత్సాహం. ఆర్థిక భరోసా కల్పించక వారిని కోల్పోతున్నారు. అయితే టీమిండియా.. బీసీసీఐతో పోల్చితే ఎలాంటి వసతులు లేకున్నా.. అంచనాలు లేకున్నా కూడా పాక్ క్రికెటర్లు మనో నిబ్బరంతో కసిగా ఆడుతారు. తమ పేదరికాన్ని ఆటతోనే దాటాలని సత్తాచాటుతారు. అదే వారి బలం. ఇక బలహీనత వారిని ఆ దేశ క్రికెట్ బోర్డు సరిగ్గా వాడుకోకపోవడం.. కాపాడుకోకపోవడమే.

-ఎలాంటి ఆశలు లేకుండా ఆడడమే పాకిస్తాన్ విజయరహస్యం.

ఇటీవల ఆసియా ఎమర్జింగ్ కప్ లోనూ లీగ్ దశలో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. ఫైనల్ కు వచ్చింది. ఫైనల్ లో యువ భారత్ ముందు పాక్ ఓడుతుందని అంతా అనుకున్నారు. ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు. కానీ అంచనాలు లేని ఆ జట్టు అద్భుతం చేసింది. భారత్ ను చిత్తుగా ఓడించింది. అవును.. ఎలాంటి ఆశలు లేకుండా ఆడడమే పాకిస్తాన్ కు ఉన్న ప్రధాన బలం. ఎప్పుడైతే వారు దేనికైనా సిద్ధపడి, ఆత్మవిశ్వాసంతో ఆడుతారో అప్పుడు కర్మను వారు మలుపు తిప్పేశారు. చరిత్రలో పాకిస్తాన్ గెలుపు చూస్తే ఇదే అనిపిస్తుంది. పాకిస్తాన్ అంచనాలు లేకుండా దిగినప్పుడే అద్భుతాలు చేసింది. అన్నీ అంచనాలు పెట్టుకుంటే ఆ ఒత్తిడికి చిత్తవుతుంది. ఏదైనా ప్రత్యేకమైన క్షణం లేదా ఏదైనా తీవ్రమైన మ్యాచ్ అని అందరూ హైప్ క్రియేట్ చేస్తే పాక్ ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతారు. టీమిండియాతో ఆడిన ప్రతీసారి అదే జరుగుతుంది. భారత్‌తో మ్యాచ్‌లు జరిగినప్పుడు అందరి నుంచి వారికి లభించే మద్దతు ఏమీ ఉండదు. తీవ్రమైన ఒత్తిడి వారిపై మోపుతారు.. అంతేకాకుండా వారు తీవ్రవాదం.. ఇంగ్లీష్ రాని క్రికెట్లు అంటూ ట్యాగ్‌లతో ట్రోల్ చేయబడతారు. అందుకే ఈ అతిపెద్ద ప్రెషర్ తో టీమిండియాతో మ్యాచుల్లో చతికిలపడి ఓడిపోతుంటారు.

ఇతరులతో ఆడుకునే విషయంలో మాత్రం వారిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అప్పుడు స్వేచ్ఛగా ఆడి గెలిచేస్తుంటారు. టీమిండియాతో ఆడినప్పుడు ఉన్నంత ఒత్తిడి వారికి ఇతర టీంలతో అస్సలు ఉండదు. కాబట్టి, వారు సరైన సమయంలో గెలవడానికి తమ ప్రతిభను ప్రదర్శిస్తూ కూల్‌గా ఆడతారు. అలానే చాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్స్‌లో పాకిస్తాన్ గెలవడానికి కారణమైంది.

2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు జరిగిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను టీమిండియా చిత్తుగా ఓడించింది. గ్రూప్ స్టేజ్ లో భారత్ 319 పరుగుల భారీ స్కోరు చేయగా.. పాకిస్తాన్ 33 ఓవర్లలో 164 పరుగులకే చాపచుట్టేసింది. ఘోరంగా ఓడింది. విశేషం ఏంటంటే పాకిస్తాన్ తర్వాత పుంజుకొని ఫైనల్ కు చేరింది. టీమిండియాతో రెడీ అయ్యింది. పాకిస్తాన్ మాజీలు, ప్రజలు, నేతలు కూడా పాకిస్తాన్ గెలవదని.. టీవీలు కట్టేశారు. ఆశలు వదిలేశారు. దీంతో అంచనాలు లేకుండా.. దేవుడిపై భారం వేసి.. కసిగా స్వేచ్ఛగా ఆడిన పాకిస్తాన్ ఫైనల్ లో టీమిండియాను అంతే చిత్తుగా ఓడించి గెలిచేసింది. అంటే పాకిస్తాన్ టీంకు బలం బలగం ఉన్నా వారి మానసిక దౌర్భల్యం. మౌళిక వసతుల లేమీ, పాక్ క్రికెట్ బోర్డు పక్షపాత రాజకీయాలు, పేదరికం ఆ టీంను ప్రపంచ క్రికెట్ లో  వెనక్కి లాగేస్తోందని అర్థమవుతోంది. తమదైన రోజున ఎంతటి బలమైన టీంను అయినా పాకిస్తాన్ ఓడించగలదు. కావాల్సింది వారికి ప్రోత్సాహం మాత్రమే.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version