Mohammed Shami: ఇప్పుడు దేశవాళీ క్రికెట్ టోర్నీ ఆడుతున్నాడు. ఇటీవలి ఐపిఎల్ వేలంలో అతడిని హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. దేశవాళీ క్రికెట్ టోర్నీ ఆడుతున్న నేపథ్యంలో అతడు ఆస్ట్రేలియా వెళ్లడం ఖాయమని.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడతాడని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా జాతీయ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం షమీ మళ్లీ గాయపడ్డాడని తెలుస్తోంది. షమీ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇటీవల మధ్యప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో షమీ బౌలింగ్ చేస్తున్నప్పుడు గాయంతో బాధపడినట్లు వార్తలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో 22 పరుగుల టార్గెట్ ను కాపాడుకోవాల్సిన సందర్భంలో షమీ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే అతడి నడుము కింది భాగంలో నొప్పి ఏర్పడటంతో ఇబ్బంది పడిపోయాడు. మైదానంలోనే అలా కూర్చుండిపోయాడు. కాసేపు చికిత్స తీసుకున్న తర్వాత షమీ బౌలింగ్ వేశాడు. అయితే అతడు బంతులు వేసినప్పటికీ ఆశించినంత సౌకర్యంగా మాత్రం కనిపించలేదు.
సామర్థ్యం తగ్గిందా?
షమీ మునుపటిలాగా సామర్థ్యాన్ని సాధిస్తే ఆస్ట్రేలియా సిరీస్ కు ఎంపిక చేస్తామని మేనేజ్మెంట్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు షమీ మళ్లీ గాయపడినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆస్ట్రేలియా సిరీస్ లో ఆడేది కష్టమేనని వార్తలు వస్తున్నాయి. గత ఏడాది స్వదేశం వేదికగా వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఆ సిరీస్ మొత్తం షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం అతడు మోకాలికి గాయం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకోవడానికి లండన్ వెళ్లిపోయాడు. అక్కడ ఆపరేషన్ పూర్తయిన తర్వాత నెమ్మదిగా కోలుకోవడం మొదలుపెట్టాడు. తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. బౌలింగ్ తన మునుపటి స్థాయిలోనే చేస్తున్నప్పటికీ.. శస్త్ర చికిత్స అయిన భాగంలో వాపు వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సిన నేపథ్యంలో షమీ విషయంలో బీసీసీఐ పెద్దగా రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. అతడు నూరు శాతం సామర్థ్యాన్ని సాధిస్తేనే.. జాతీయ జట్టుకి ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ” షమీ మునుపటి లాగా బౌలింగ్ వేస్తున్నాడు. లైన్ అండ్ లెంగ్త్ విషయంలో రాజీ పడటం లేదు. పైగా బంతులు కూడా వేగంగా వేస్తున్నాడు. మధ్యప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు కాస్త ఇబ్బంది పడ్డాడు. నొప్పి తీవ్రంగా ఉండడంతో మైదానంలోనే ఉండిపోయాడు. చివరికి ఫిజియో దగ్గర చికిత్స పొందిన తర్వాత మళ్ళీ బౌలింగ్ వేశాడు. అతని మోకాళ్ళ దగ్గర వాపు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అతడి విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉందని” స్పోర్ట్స్ వర్గాలు చెబుతున్నాయి.