India vs Pakistan : టి20 ప్రపంచ కప్ సప్పగా సాగుతున్న సమయంలో.. ఒకసారి గా అమెరికా, పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఆ ఓవర్ లో అమెరికా అద్భుతంగా ఆడి పాకిస్తాన్ జట్టును మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో జూన్ 9న జరిగే భారత్, పాకిస్తాన్ పోరు కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు టి20 మ్యాచ్లలో ఎలాంటి రికార్డులు నమోదయ్యాయో ఒకసారి పరిశీలిస్తే..
ఇప్పటివరకు భారత్ దే పై చేయి
ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య 12 t20 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో భారత్ 9, పాకిస్తాన్ మూడు మ్యాచ్లలో విజయాలు సాధించాయి.
హైయెస్ట్ స్కోర్ ఘనత మనదే
పాకిస్తాన్ జట్టుపై భారత జట్టు ఓ మ్యాచ్లో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఈ జట్టుపై భారత్ కు హైయెస్ట్ స్కోర్ గా ఉంది. ఇక మన మీద పాకిస్తాన్ జట్టు 182/5 పరుగులు చేసింది. ఇదే ఆ జట్టుకు హైయెస్ట్ స్కోర్.
కోహ్లీ చేసిన ఆ పరుగులు అత్యధికం
గత టి20 వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ పై భారత్ గెలిచింది. ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలైన టి20 మజా అందించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. భారత జట్టును విజయతీరాలకు తీసుకెళ్లాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఏకంగా 82* పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.
వ్యక్తిగత స్కోర్, సిక్సర్ల విభాగంలో..
పాకిస్తాన్ జట్టుపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాడిగా సరికొత్త ఘనతను లిఖించాడు. పాకిస్తాన్ జట్టుపై అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు ఇతడు ఐదు అర్ధ సెంచరీలు బాదాడు. పాకిస్తాన్ పై ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఏకంగా 11 సిక్సర్లు కొట్టి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అతడే
పాకిస్తాన్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇతడు 10 మ్యాచులలో 488 రన్స్ సాధించాడు. పాకిస్తాన్ అంటేనే విరాట్ కోహ్లీ చెలరేగిపోతాడు. బ్యాట్ తో వీర విహారం చేస్తాడు.
ఆ చెత్త రికార్డు పాకిస్తాన్ పేరు మీదే..
ఇక టి20 ఫార్మాట్ లో పాకిస్తాన్ పై భారత జట్టు చేసిన అత్యల్ప స్కోర్ 133 పరుగులు. పాకిస్తాన్ లోయస్ట్ స్కోరు 83.. ఈ మ్యాచ్లో భారత్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్ ను తక్కువ పరుగులకు అవుట్ చేసి.. ఆ తర్వాత స్వల్ప ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని చేదించింది..
యువరాజ్ భల్లే బాజ్
పాకిస్తాన్ జట్టుపై ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన చరిత్ర మాత్రం యువరాజ్ సింగ్ దే.. 2012లో ఏకంగా ఏడు సిక్సర్లు కొట్టాడు.
ఆ రికార్డు హార్థిక్ పాండ్యా పేరు మీద..
పాకిస్తాన్ జట్టుపై ఎక్కువ వికెట్లు తీసిన భారతీయ ఆటగాడిగా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు. ఆరు మ్యాచ్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి 11 వికెట్లు పడగొట్టాడు.. 12 యావరేజ్ తో పాకిస్తాన్ కీలక ఆటగాళ్లను పెవిలియన్ పంపించాడు.. పాకిస్తాన్ బౌలర్ ఉమర్ గుల్, ఇండియన్ బౌలర్ భువనేశ్వర్ కూడా 11 వికెట్లు పడగొట్టి.. తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు.
టాప్ – 5 లో మనవాళ్లే..
బౌలింగ్ ఎకనామీ రేట్ లో టాప్ -5 జాబితాలో నలుగురు టీమిండియా బౌలర్లు ఉండడం విశేషం. వీరిలో భువనేశ్వర్ కుమార్ (2.25), హార్దిక్ పాండ్యా (2.28), బుమ్రా(2.56), జడేజా (3.66) ఎకానమీ రేటు తో తొలి నాలుగు స్థానాలలో కొనసాగుతున్నారు.
మహేంద్ర సింగ్ ధోని మొదటి స్థానంలో..
పాకిస్తాన్ జట్టుపై అత్యధిక ఔట్లు చేసిన కీపర్ గా మహేంద్ర సింగ్ ధోని మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఎనిమిది మ్యాచ్లలో 9 క్యాచ్ లు, రెండు స్టంప్ అవుట్లతో.. 11 మంది పాకిస్తాన్ ఆటగాళ్లను పెవిలియన్ పంపించాడు. కీపర్ గా మాత్రమే కాదు కెప్టెన్ గాను మహేంద్రసింగ్ ధోని పాకిస్తాన్ జట్టుపై అత్యధిక మ్యాచులు ఆడాడు. దాయాది దేశంపై ఏకంగా ఎనిమిది మ్యాచ్లకు అతడు నాయకత్వం వహించాడు.. మూడు మ్యాచ్లకు సారధ్యం వహించి రోహిత్ శర్మ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఆ రికార్డు సురేష్ రైనా పేరు మీద..
ఇక దాయాది జట్టుతో జరిగిన మ్యాచ్లలో ఎక్కువ క్యాచ్లు అందుకున్న ఘనత సురేష్ రైనా పేరు మీద ఉంది. ఇతడు ఆరు మ్యాచ్లలో 7 క్యాచ్లు అందుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో నాలుగు క్యాచ్ లతో సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు.
రోహిత్ నాలుగో స్థానంలో..
ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్ జట్టుతో ఎక్కువ మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. ఇతడు ఏకంగా 11 మ్యాచ్లలో పాలుపంచుకున్నాడు. అతని తర్వాత పది మ్యాచ్లతో విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.