West Indies: ప్రపంచ క్రికెట్ లో వెస్టిండీస్ జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. జట్టులో పెద్దగా పేరు ఉన్న ఆటగాళ్లు లేకపోయినప్పటికీ.. హార్డ్ హిట్టింగ్ తో మిగిలిన జట్లకు చెమట పుట్టించగల సామర్థ్యం ఈ జట్టు సొంతం. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో అనేకసార్లు ఎన్నో జట్లకు షాక్ ఇచ్చింది. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని వెస్టిండీస్ జట్టు శాసించింది. వరల్డ్ కప్ ప్రారంభమైన తరువాత వరుసగా రెండు వరల్డ్ కప్పులను కూడా ఈ జట్టే నెగ్గింది. అంతటి ఘన చరిత్ర కలిగిన వెస్టిండీస్ జట్టు.. ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ కు మాత్రం అర్హత సాధించలేకపోయింది. ఇది ప్రస్తుతం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ ల్లో వెస్టిండీస్ జట్టు అనూహ్యంగా ఈసారి పసికూనల చేతిలో ఓటమి పాలైంది. లీగ్ దశలో నెదర్లాండ్స్ జట్టు చేతిలో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న వెస్టిండీస్.. సూపర్ సిక్స్ దశలో అనూహ్యంగా స్కాట్లాండ్ చేతిలో కూడా ఓడిపోయింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ లో జరగనున్న వరల్డ్ కప్ మ్యాచులకు వెస్టిండీస్ జట్టు అర్హత సాధించలేకపోయింది. దీంతో వరల్డ్ కప్ చరిత్రలోనే వెస్టిండీస్ జట్టు లేకుండా వరల్డ్ కప్ మ్యాచులు జరగనున్నాయి.
రెండు జట్ల కోసం క్వాలిఫైయింగ్ మ్యాచులు..
వరల్డ్ కప్ లో 10 జట్లకు చోటు ఉంటుంది. ఎనిమిది జట్ల ర్యాంకులు ఆధారంగా వరల్డ్ కప్ బెర్త్ దక్కుతుంది. మిగిలిన రెండు జట్లను క్వాలిఫైయింగ్ మ్యాచులు ద్వారా ఎంపిక చేస్తారు. గత కొద్ది వారాల నుంచి క్వాలిఫై మ్యాచులు జరుగుతున్నాయి. క్వాలిఫై మ్యాచ్లు ఆడుతున్న వెస్టిండీస్ జట్టు అనూహ్యంగా రెండు చిన్న జట్లపై ఓటమిపాలై వరల్డ్ కప్ మ్యాచ్లకు అర్హత సాధించలేకపోయింది. లీగ్ దశలో నెదర్లాండ్స్ జట్టుపై సూపర్ ఓవర్ లో ఓటమిపాలు కాగా, సూపర్ సిక్స్ దశలో జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ పై ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్ ల్లో ఓటమి తర్వాత వెస్టిండీస్ జట్టు వరల్డ్ కప్ ఆశలు పూర్తిగా మూసుకుపోయాయి. గడిచిన 48 ఏళ్లుగా వరల్డ్ కప్ జరుగుతోంది. ఇప్పటి వరకు ప్రతి వరల్డ్ కప్ లోను వెస్టిండీస్ జట్టు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తుంది. తొలిసారి ఈ ఏడాది జరగనున్న వరల్డ్ కప్ వెస్టిండీస్ జట్టు లేకుండా జరగనుంది.
టి20 మ్యాచ్ లు అంటే ఫేవరెట్ గా వెస్టిండీస్ జట్టు..
ఒకప్పుడు వన్డే ఫార్మాట్ లో కూడా వెస్టిండీస్ జట్టు అత్యంత బలమైనది. దిగ్గజ ఆటగాళ్లతో ఆ జట్టు అలరారింది. అటువంటి జట్టు ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్ లకు అర్హత సాధించకుండా పోయింది. ఇప్పటికీ జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. వీరెవరు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో.. దారుణమైన పరాభవాలను మూటగట్టుకుంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కంటే.. లీగ్ లకు వెస్టిండీస్ ఆటగాళ్లు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైందని పలువురు చెబుతున్నారు. కీలకమైన ఆటగాళ్లు ఇతర లీగుల్లో ఆడుకుంటూ.. క్వాలిఫైయర్ మ్యాచ్లకు వెళ్లలేదు. దీంతో సాధారణ ఆటగాళ్లతో వెస్టిండీస్ జట్టు క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. ఆయా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోవడంతో అనామక జట్లపై ఓటమిపాలై ఏకంగా మెగా టోర్నీ చేరలేక చేతులెత్తేసింది ఆ జట్టు. వెస్టిండీస్ జట్టు లేకుండా జరగనున్న వరల్డ్ కప్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.