Monkey Food Courts: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కోతుల బెడత తీవ్రమవుతోంది. అడవుల్లో, గుట్టలపై ఉండాల్సిన మంకీస్ ఇంట్లో మనుషుల మధ్య తిరుగుతున్నాయి. అయితే ఇవే ఊరికే తిరగకుండా ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో మనుషులపై దాడి చేస్తున్నాయి. కోతుల దాడిలో మనుషులు చనిపోయిన సంఘటనలు తెలంగాణలో నమోదవుతున్నాయి. అయితే చాలా మంది కోతలు బాధ నుంచి తప్పించాలని ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటున్నారు. కానీ ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోతుల సమస్య పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఆహారం దొరకకపోవడం వల్లే కోతులు ఇళ్లల్లోకి చొరబడుతున్నారు. దీంతో వాటి కోసం ప్రత్యేకంగా మంకీ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ మంకీ ఫుడ్ కోర్టు గురించి వివరాల్లోకి వెళ్తే..
కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఉచ్చులు బిగించడం, దాడులు చేయడం వంటివి చేశారు. కానీ అవేమీ ఫలితాన్నివ్వలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతకుమించి కోతులు దాడులు చేయడం ప్రారంభించాయి. కోతుల దాడులతో తెలంగాణ వ్యాప్తంగా 15 నుంచి 20 శాతం పంటలు నష్టపోయినట్లు ప్రభుత్వమే గుర్తించింది. ఇలా ప్రతీసారి పంటలు నష్టపోతుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం మంకీ కోర్టుల ఏర్పాటుకు ముందుకు వచ్చింది.
ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అడవుల్లో మంకీ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఎంచుకొని అందులో పండ్ల చెట్లు పెడుతారు. తెలంగాణ హరితహారంలో భాగంగా ఇలాంటి సామూహిక అడవులను పెంచాలని నిర్ణయించారు. ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టులో భాగంగా దీనిని నిర్మిస్తారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ పరిధిలోని సిద్ధిపేట జిల్లా ములుగు గ్రామంలో అటవీశాఖ, పరిశోధనా సంస్థ (ఎఫ్ సీఆర్ ఐ)లో భాగంగా చెట్లను పెంచుతున్నారు.
అటవీశాఖ అనుబంధ రంగాల్లో వృత్తిపరమైన విద్య, పరిశోధనలు ప్రోత్సహించే లక్ష్యంతో ఎఫ్ సీఆర్ఐ ని 2016లో స్థాపించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ సంస్థ మూడు సంవత్సరాల క్రితం తన సొంత స్థలాన్ని కేటాయించింది. 130 ఎకరాల్లో మంకీ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ డీన్ గా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారిణి ప్రియాంక వర్గీస్ చొరవతో 2022 సంవత్సరంలో ‘వైల్డ్ ఫ్రూట్ గార్డెన్’ పనులు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ ‘మంకీ ఫుడ్ కోర్టుల ఆలోచన రూపొందించినప్పుడు కోతులు ఇష్టపడే అనేక రకాలైన పండ్ల గురించి సీఎం చెప్పారు. అయితే ఇవి నేటి కాలం యువతకు తెలిసి ఉండదు. కానీ అడవుల్లో ఇవి పుష్కలంగా ఉంటాయని తెలుసుకున్నాను. అయితే వాటిని జాగ్రత్తగా పెంచాలి’ అని అన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ 100 రకాల అడవి పండ్లను పెంచేందుకు ప్రణాళిక రచించారు. దీంతో ఇళ్లపై కోతుల దాడులను అరికట్టవచ్చని అన్నారు.
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పశ్చిమ కనుమల నుంచి కొన్ని మొక్కలను మంకీ ఫుడ్ కోర్టు కోసం కొనుగోలు చేశామన్నారు. చింతపండుతో సమానమైన పాకాన్ని కర్ణాటక ప్రైవేట్ నర్సరీ నుంచి తెప్పించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పండ్ల మొక్కలన్నింటినీ సేకరిస్తున్నాం. ఇక్కడ దొరకనవి ఇతర రాష్ట్రాల నుంచితెప్పిస్తున్నాం.. అని హరీష్ రావు అన్నారు.అడవిలో మామిడితో పాటు 100 రకాల అడవిపండ్ల మొక్కలు దొరికే అవకాశం ఉందని తెలిపారు.