Wasim Akram: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే క్రికెట్ ప్రపంచం హీటెక్కుతుంది. ఇలాంటి హై ఓల్టేజీ(Hi Voltage) మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరిగింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే దాయాది దేశాల మధ్య జరిగే మ్యాచ్‌లో ఆటగాళ్లు కూడా ఒత్తిడికి లోనవుతారు. తమ దేశ అభిమానులను ఆకట్టుకునేందుకు మ్యాచ్‌ను మరింత హీటెక్కించే ప్రయత్నం చేస్తారు. తాజాగా మ్యాచ్‌లో పాకిస్తాన్(Pakisthan) లెక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్(Abrar ahmed) అదే చేశాడు. అద్భుతమైన బంతితో శుభ్‌మన్ గిల్(Shubman Gill)ను ఔట్ చేశాడు. కానీ, ఆ తర్వాత అతను చేసిన సెలబ్రేషన్ మాత్రం ఆ దేశ లెజెండరీ క్రికెటర్, మాజీ పేస్ బౌలర్ వసీం అక్రమ్‌కు కోపం తెప్పించింది. అందుకే బహిరంగంగానే అబ్రార్ దుమ్ము దులిపేశాడు.
భారత్ బ్యాటర్ల ఊచకోత..
దుబాయలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత బ్యాట్స్‌మెన్‌లు పాక్ బౌలర్లను ఊచకోత కోశారు. అబ్రార్ ఒక్కడే కాస్త ఇండియా(India) బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేశాడు. అయితే మిడిల్ ఓవర్లలో అతడి మాయాజాలానికి బ్యాట్స్‌మెన్‌లు కాస్త తడబడ్డారు. 17వ ఓవర్‌లో అబ్రార్ వేసిన బంతి మ్యాచ్‌కే హైలెట్. లెగ్ స్టంప్ లైన్‌పై పడిన బంతి ఒక్కసారిగా టర్న్ తీసుకుని టాప్ ఆఫ్ స్టంప్‌ను కొట్టేసింది. దీంతో గిల్ షాక్ అయ్యాడు.
వికెట్ తీసిన సంతోషంలో..
52 బంతుల్లో 46 పరుగులు చేసిన గిల్ ఆఫ్ సెంచరీ చేసే అవకాశం ఉంది. కానీ అబ్రార్ సూపర్ బంతితో పెవిలియన్ బాట పట్టాడు. వికెట్ తీసిన సంతోషంలో అబ్రార్ తన స్టైల్‌లో గిల్‌కు ఘాటుగా సెండ్‌ఆఫ్ ఇచ్చాడు. గిల్ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. కానీ, వసీం అక్రమ్(Wasim Akram)తోపాటు చాలా మందికి అబ్రార్ తీరు నచ్చలేదు. ‘బంతి అయితే సూపర్ వేశాడు. కానీ సెలెబ్రేషన్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. టైమ్ అండ్ ప్లేస్ చూసుకోవాలి కదయ్యా బాబు‘ అంటూ వసీం అక్రమ్ స్పోర్ట్స్ సెంట్రల్‌తో చిట్‌చాట్ చేశాడు. తప్పును తప్పుగా చెప్పేవారే లేరా.. మ్యాచ్ సిట్యుయేషన్ చూడు.. టీమ్ కష్టాల్లో ఉంది. కానీ, నువ్వేమో ఐదు వికెట్లు తీసినంత బిల్డప్ ఇస్తున్నావ్’ అని అక్రమ్ ఫైర్ అయ్యారు. సెలబ్రేషన్(Celabration) కారణంగా వికెట్ తీసిన మూమెంట్ మొత్తం చెడిపోయిందని పేర్కొన్నాడు. గిల్ అవుట్ అయినా ఇండియా స్కోర్ తగ్గలేదని గుర్తు చేశాడు. షాహీన్ ఆఫ్రిదీ, హరీస్ రౌఫ్ వంటి స్టార్ బౌలర్లు అబ్రార్‌కు ఏమాత్రం సపోర్టు చేయలేకపోయారు.