BCCI Head Coach : రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ పదవికి బీసీసీఐ ప్రకటన చేసింది. ఆసక్తి ఉన్నవారు మే 27 సాయంత్రం 6 గంటలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఈ ప్రకటన బీసీసీ సెక్రెటరీ జై షా పేరుతో విడుదలైంది. ఈ దరఖాస్తులో హెడ్ కోచ్ ఏం చేయాలో, ఎలాంటి అర్హతలు ఉండాలో, చేయాల్సిన పనులు ఏంటో ప్రముఖంగా ప్రస్తావించింది. టీమిండియా కు హెడ్ కోచ్ గా ఎంపికైన వ్యక్తి పదవి కాలం మూడున్నర సంవత్సరాలు ఉంటుంది. కోచ్ గా ఎంపికైన వ్యక్తి 2027 డిసెంబర్ 31 వరకు కొనసాగుతారు. ప్రస్తుతం హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవి కాలం t20 ప్రపంచ కప్ తో ముగియనుంది. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వ్యక్తికి 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి. అతని అనుభవాన్ని బట్టి బీసీసీఐ పారితోషికం ఉంటుంది. అతడికి 14 నుంచి 16 మంది సహాయక సిబ్బందిని కేటాయిస్తుంది. టీమిండియా ఆడే మూడు ఫార్మాట్లకు అతను కోచ్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. జట్టులో క్రమశిక్షణను సమీక్షించడం దగ్గర నుంచి ఆటగాళ్ల ఎంపిక వరకు మొత్తం బాధ్యత హెడ్ కోచ్ దే.
హెడ్ కోచ్ కు 30 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉండాలి. లేదా 50 వన్డేలైనా ఆడి ఉండాలి. ఒకవేళ అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేకుంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఏదైనా క్రికెట్ జట్టుకు రెండు సంవత్సరాలపాటు శిక్షకుడిగా పనిచేసిన అనుభవం ఉండాలి. ఇవన్నీ లేకుంటే ఐపీఎల్లో ఏదైనా జట్టుకు రెండు సంవత్సరాల పాటు శిక్షకుడిగా పనిచేసిన అనుభవం ఉండాలి. ఒకవేళ ఐపీఎల్ టీమ్, ఫ్రాంచైజీ లీగ్స్ లోని జట్లకు హెడ్ కోచ్ గా మూడు సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. అంతేకాదు శిక్షకుడిగా బీసీసీఐ లెవెల్ 3 సర్టిఫికెట్ కచ్చితంగా కలిగి ఉండాలి.
బీసీసీఐ నుంచి ప్రకటన రావడంతో మరోసారి రాహుల్ ద్రావిడ్ దరఖాస్తు చేసుకుంటాడని తెలుస్తోంది. హెడ్ కోచ్ రేసులో ద్రావిడ్ తో పాటు తెలుగు దిగ్గజ ఆటగాడు, టెస్ట్ క్రికెట్ కు సిసలైన అర్థం చెప్పిన వీవీఎస్ లక్ష్మణ్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఈసారి వివిఎస్ లక్ష్మణ్ టీమిండియా హెడ్ కోచ్ గా నియమితుడయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లక్ష్మణ్ ఎన్సీఏ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. అండర్ 19, భారత్ – ఏ జట్లకు హెడ్ కోచ్ గా పనిచేస్తున్నాడు. ఇక బీసీసీఐ ప్రకటన వెలువరించిన నాటి నుంచి సోషల్ మీడియాలో లక్ష్మణ్ పేరు మార్మోగిపోతుంది. నెటిజన్లు టీమిండియా హెడ్ కోచ్ గా లక్ష్మణ్ ను నియమించాలని బీసీసీఐ కి విజ్ఞప్తి చేశారు. ” అతడికి అన్ని అర్హతలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ కు సరికొత్త అర్థం చెప్పాడు. అతడు నిలకడకు మారుపేరు. అతని ఆధ్వర్యంలో టీమిండియా మెరుగైన విజయాలు సాధిస్తుందని” నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కంటే లక్ష్మణ్ వైపే బీసీసీఐ మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతవరకు లక్ష్మణ్ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసే విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మరోవైపు ద్రావిడ్ కొనసాగింపు ఉండదని ఇప్పటికే జై షా స్పష్టం చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవికి విదేశీ దిగ్గజ ఆటగాళ్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, టామ్ మూడీ కోచ్ పదవి చేపట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. టీమిండియాకు చివరి విదేశీ కోచ్ గా డంకన్ ఫ్లెచర్ కొనసాగాడు. ఆ తర్వాత మరో విదేశీ కోచ్ కు బీసీసీఐ ఆ అవకాశం ఇవ్వలేదు.
What's the point of this? They'll pick VVS Laxman at last https://t.co/Pw4WxgxzCn
— Abhi⚒️ (@abhi_backup07) May 14, 2024