https://oktelugu.com/

Virender Sehwag : భారత స్పిన్ బౌలింగ్ లో పస తగ్గింది అందువల్లే.. వీరేంద్ర సెహ్వాగ్

భారత జట్టుకు స్పిన్ బౌలింగ్ ప్రధాన ఆయుధం. ఈ స్పిన్ బౌలింగ్ ద్వారా భారత జట్టు అనితర సాధ్యమైన విజయాలను సాధించింది. ఆస్ట్రేలియా నుంచి వెస్టిండీస్ దాకా మట్టి కరిపించింది. అయితే అటువంటి స్పిన్ బౌలింగ్ పస కోల్పోతోందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 6, 2024 / 08:00 PM IST

    Virender Sehwag

    Follow us on

    Virender Sehwag : పొట్టి ఫార్మాట్ క్రికెట్ కు ఆటగాళ్లు అలవాటు పడడంతో భారత జట్టులో క్వాలిటీస్పిన్నర్లు పూర్తిగా తగ్గిపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. ” ఒకప్పుడు స్పిన్ బౌలింగ్ ను భారత బ్యాటర్లు అద్భుతంగా ఎదుర్కొనేవారు. అనితర సాధ్యమైన షాట్లు కొట్టి భారీగా పరుగులు సాధించేవారు.. అందువల్లే ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్ బౌలర్లైన ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ మన దేశంపై గొప్ప గణాంకాలు సృష్టించలేకపోయారు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. అందువల్లే భారత ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ కు దాసోహం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితి మంచిది కాదు. ఇది జట్టు విజయవకాశాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు ఆటగాళ్లు మారాలి.. వారి ఆట తీరు మార్చుకోవాలి. దేశవాళి క్రికెట్ ను ఎక్కువగా ఆడాలి. అనుభవాన్ని సంపాదించుకోవాలంటే అంతకుమించిన మార్గం మరొకటి లేదని”
    వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

    పొట్టి ఫార్మాట్ వల్లే

    “పొట్టి ఫార్మాట్ వల్ల స్పిన్ బౌలింగ్ లో భారత బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేక పోతున్నారు. ముఖ్యంగా స్పిన్ ట్రాక్ ల పై దారుణంగా విఫలమవుతున్నారు. మెలు తిరిగే బంతులను ఎదుర్కోలేక పెవిలియన్ చేరుకుంటున్నారు. స్పిన్ బౌలింగ్ ను తట్టుకోలేక ఇటీవల శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్ ను భారత జట్టు ఆటగాళ్లు కోల్పోయారని” వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో స్పిన్ బౌలింగ్ కు సంబంధించిన చర్చలో సెహ్వాగ్ పై వ్యాఖ్యలు చేశాడు. “దేశవాళి క్రికెట్ ఆడక పోవడం వల్ల ఆటగాళ్లలో నైపుణ్యం తగ్గిపోతుంది. అందువల్లే దేశంలో నాణ్యమైన స్పిన్నర్లు లేరు. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటం వల్ల ఆటగాళ్లకు కేవలం 24 బంతులు వేసే అవకాశం మాత్రమే లభిస్తోంది. ఫలితంగా స్పిన్నర్లు బంతులను ఫ్లైట్ చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇదే సమయంలో బ్యాటర్లను అవుట్ చేయడం కంటే డాట్ బాల్స్ వేయడం మీదనే దృష్టి సారిస్తున్నారు. దీంతో బ్యాటర్లను వెనక్కి పంపించే నైపుణ్యం సొంతం చేసుకోవడం స్పిన్ బౌలర్లకు ఇబ్బందిగా మారుతోంది. భారత ఆటగాళ్లు దేశ వాళీ క్రికెట్ దూరం అవడం వల్లే ఈ ప్రమాదం తలెత్తింది. గతంలో ద్రావిడ్, నేను, సచిన్, గంగూలి, లక్ష్మణ్, యువరాజ్ డొమెస్టిక్ క్రికెట్ ఆడేవాళ్ళం. అందువల్ల అంతర్జాతీయ క్రికెట్లో రాణించడానికి మాకు అవకాశం లభించేది. దేశవాళి క్రికెట్ అనుభవం వల్ల స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉపకరించేది. ప్రస్తుత తరం లోని క్రికెటర్లు ఈ ప్రయోగాలు చేయకపోతే సుదీర్ఘకాలం కెరియర్ కొనసాగించలేరని” సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.