Virender Sehwag new house: 15 సంవత్సరాల క్రితం టీమ్ ఇండియాలో వీరేంద్ర సెహ్వాగ్ ఉండేవాడు. ఓపెనర్ గా రంగంలోకి దిగేవాడు. భీకరంగా బ్యాటింగ్ చేసేవాడు. తనదైన రోజు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయేవాడు. పరుగుల ప్రవాహాన్ని అమాంతం కొనసాగించేవాడు. అందువల్లే అతడిని డాషింగ్ ఓపెనర్ అని పిలిచేవారు. సాధారణంగా ఏ బౌలర్ అయినా సరే తనకంటూ కొంతమంది భయపడే బ్యాటర్లను సృష్టించుకుంటాడు. కానీ వీరేంద్ర సెహ్వాగ్ కు బౌలింగ్ వేయాలంటే బౌలర్లను భయపడేలా చేసుకున్నాడు. మెక్ గ్రాత్ నుంచి పోలాక్ వరకు ప్రతి ఒక్కరికి నిద్రలేని రాత్రులను సేహ్వాగ్ పరిచయం చేశాడు.
క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం అతడు వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. క్రికెట్లోని పరిణామాలను లోతుగా విశ్లేషిస్తున్నాడు. జాతీయతను ప్రదర్శించడంలో ముందు వరుసలో ఉంటున్నాడు. ఆ మధ్య పాకిస్తాన్ క్రికెటర్లు భారత జట్టు మీద అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తే మొహమాటం లేకుండా స్పందించాడు సెహ్వాగ్. సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ ప్లేయర్లకు గడ్డి పెట్టాడు.
ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు సైన్యానికి బహిరంగంగా మద్దతు తెలిపాడు వీరేంద్ర సెహ్వాగ్. భారతదేశం ఇలానే శత్రుదేశం మీద దూసుకుపోవాలని.. అప్పుడే మన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలుస్తుందని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. పాకిస్తాన్ క్రికెటర్లు ఆపరేషన్ సిందూర్ మీద రకరకాల విమర్శలు చేస్తున్నప్పుడు.. వారందరికీ అద్భుతమైన కౌంటర్ ఇచ్చాడు సెహ్వాగ్. అందువల్లే అతడిని చాలామంది అభిమానిస్తారు.. సోషల్ మీడియాలో అనుసరిస్తారు.
భార్యతో అభిప్రాయ భేదాల వల్ల సెహ్వాగ్ విడాకులు తీసుకున్నాడు. అయితే అతని కొడుకుల సంరక్షణ మాత్రం అతడే చూసుకుంటున్నాడు. సెహ్వాగ్ టీమిండియాలో ఉన్నప్పుడు భారీగానే వెనకేసుకున్నాడు. ఇప్పుడు వ్యాఖ్యాతగా కొనసాగుతున్న నేపథ్యంలో దండిగానే సంపాదిస్తున్నాడు. కొన్ని కంపెనీలకు ప్రయోజక కర్తగా ఉంటున్నాడు. ఇటీవల ఢిల్లీలోని హాజకాస్ ప్రాంతంలో కృష్ణ నివాస్ పేరుతో భారీ భవనాన్ని నిర్మించాడు. ఇందులో 12 విశాలమైన గదులు ఉన్నాయి. క్రికెట్ ట్రోఫీల కోసం ప్రత్యేకంగా గదులను నిర్మించారు. గార్డెన్ కూడా విస్తారంగా ఉంది. మినీ మైదానంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జంతువుల కోసం ప్రత్యేకంగా లాన్ నిర్మించారు. ఇంటీరియర్ కూడా అద్భుతంగా ఉంది. 130 కోట్లతో ఈ స్థాయిలో భవంతి నిర్మించిన సెహ్వాగ్ ను అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం వ్యాఖ్యాతగా కొనసాగుతున్న అతడు.. పలు కంపెనీలకు ప్రయోజక కర్తగా కొనసాగుతున్నాడు.