Virat Kohli : ప్లే ఆఫ్ వెళ్లేందుకు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో బెంగళూరు దూకుడుగా ఆడుతోంది. వర్షం అంతరాయం కలిగించినప్పటికీ.. చెన్నై బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొంటోంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ 47, డూ ప్లెసిస్ 54 పరుగులు చేసి.. బెంగళూరుకు బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 9.4 ఓవర్లలో 74 పరుగుల పార్ట్ నర్ షిప్ నెలకొల్పారు. విరాట్ కోహ్లీ త్రుటిలో అర్థ సెంచరీ కోల్పోయినప్పటికీ.. ఉన్నంతసేపు చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ నేపథ్యంలో సరికొత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికగా మూడు వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా అరుదైన ఘనతను విరాట్ కోహ్లీ సాధించాడు. ఐపీఎల్ లో లీగ్ మ్యాచ్ లో భాగంగా చెన్నై జట్టుపై విరాట్ కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. చెన్నై బౌలర్ తుషార్ దేశ్ పాండే వేసిన మూడో ఓవర్లో లాంగ్ ఆన్ దిశగా భారీ సిక్సర్ కొట్టిన విరాట్ కోహ్లీ.. ఈ ఘనతను అందుకున్నాడు. ఆ బంతిని తుషార్ దేశ్ పాండే బ్యాక్ ఆఫ్ లెంగ్త్ లో వేశాడు. దానిని అంతే బలంగా కోహ్లీ కొట్టడంతో.. స్టేడియం పైకప్పు తాకేలా సిక్సర్ గా వెళ్ళింది. ఈ సిక్స్ ద్వారా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ 3,005 రన్స్ పూర్తి చేసుకున్నాడు.
ఈ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండవ స్థానంలో, ఏబి డివిలియర్స్ మూడో స్థానంలో ఉన్నాడు. అయితే అటు రోహిత్ శర్మ, ఇటు డివిలియర్స్ విరాట్ కోహ్లీకి సమీపంగా కూడా లేరు. వాంఖడే మైదానంలో రోహిత్ శర్మ 2,295 రన్స్ చేశాడు. ఎబి డివిలియర్స్ చిన్నస్వామి స్టేడియంలో 1,960 రన్స్ చేశాడు. అయితే ఇప్పట్లోనే కాదు, మరెప్పట్లోనూ ఇతర ఆటగాళ్లు కోహ్లీ రికార్డు ను అధిగమించే అవకాశం లేదు.. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే.. కోహ్లీ తిరుగులేని స్థాయిలో ఆడుతున్నాడు.. ఒకవేళ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టాలని చూసినా .. వచ్చే సీజన్లో అతడు ముంబై జట్టుకు ఆడతాడో లేదో తెలియదు.. ఎబి డివిలియర్స్ ఇప్పటికే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఇలా ఏ ప్రకారం చూసుకున్నా విరాట్ కోహ్లీ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు.