India vs Pakistan : పాకిస్తాన్ అంటే చాలు.. కోహ్లీ రెచ్చిపోతాడు.. ఇంతకీ ఎలాంటి రికార్డులు సాధించాడంటే..

Virat Kohli అంటే ఈ లెక్కన ఆదివారం జరిగే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ చేతిలో పాకిస్తాన్ జట్టుకు దబిడి దిబిడే అన్నమాట

Written By: NARESH, Updated On : June 8, 2024 9:50 pm

Virat Kohli

Follow us on

India vs Pakistan : మామూలుగానే కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉంటాడు. బౌలర్లతో సంబంధం లేకుండా.. మైదానం తో పని లేకుండా బాదడమే మంత్రంగా పెట్టుకుంటాడు.. అలాంటి విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే ఊరుకుంటాడా.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. మైదానంలో శివతాండవం చేస్తాడు.. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం న్యూయార్క్ వేదికగా భారత్, పాకిస్తాన్ తలపడబోతున్న నేపథ్యంలో.. ఒకసారి దాయాది జట్టుపై విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులను పరిశీలిస్తే..

గత టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టుపై ఉత్కంఠ గా సాగిన మ్యాచ్లో భారత్ గెలిచింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఏకంగా 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తుదికంటా నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్లో విరాట్ చివరి వరకు పోరాడాడు. తోటి ఆటగాళ్లు వెంట వెంటనే ఔట్ అవుతున్నప్పటికీ.. మొక్కవోని ధైర్యంతో పాకిస్తాన్ బౌలర్లను చీల్చి చెండాడాడు.. విరాట్ కోహ్లీ టీ20 కెరియర్లో గొప్పగా చెప్పుకునే ఇన్నింగ్స్ లలో పాకిస్తాన్ పై చేసిన 82 పరుగులు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ పరుగులతో పాకిస్తాన్ జట్టుపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.

టి20 చరిత్రలో పాకిస్తాన్ జట్టుపై అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీకి రికార్డు ఉంది. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ పాకిస్తాన్ జట్టుపై ఐదు అర్ద సెంచరీలు చేశాడు.. ఇది మాత్రమే కాదు అత్యధిక సిక్సర్లు (ఇప్పటివరకు 11) కొట్టిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.. పాకిస్తాన్ జట్టుపై పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. పది మ్యాచ్లలో ఏకంగా 488 రన్స్ చేశాడు.. ఇవి మాత్రమే కాదు పాకిస్తాన్ జట్టుపై ఎక్కువ మ్యాచులు ఆడిన రెండవ ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. 11 మ్యాచ్లతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు.

ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీ 1 లేదా తక్కువ స్కోరుకే అవుట్ అవుతాడు. పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్లో మాత్రం చుక్కలు చూపిస్తాడు. గత టి20 వరల్డ్ కప్ లోనూ ఇదే జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 82 పరుగులు చేసి భారత జట్టును విరాట్ గెలిపించాడు. ఇక టి20 వరల్డ్ కప్ లోనూ అదే పరిస్థితి పునరావృతమవుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

భారత జట్టు టి20 వరల్డ్ కప్ లో తన తొలి మ్యాచ్ ఐర్లాండ్ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. విరాట్ అలా అవుట్ కావడం పట్ల అభిమానులు నిట్టూర్చినప్పటికీ.. సునీల్ గవాస్కర్ లాంటి ఆటగాళ్లు ఈ పరిణామం మంచికే అని చెబుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ కు ముందు ఇలా అవుట్ కావడం విరాట్ కోహ్లీకి అలవాటేనని పేర్కొన్నారు..పాక్ జట్టుతో జరిగే మ్యాచ్లో అసలైన విరాట్ కోహ్లీని చూసే అవకాశం ఉంటుందని వివరించారు.. అంటే ఈ లెక్కన ఆదివారం జరిగే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ చేతిలో పాకిస్తాన్ జట్టుకు దబిడి దిబిడే అన్నమాట