Ind Vs Aus 5th Test: పదేపదే అదే తప్పిదం.. అయినప్పటికీ అతడు మారటం లేదు. ఆటతీరు మార్చుకోవడం లేదు. అనవసరంగా ఆ బంతులను వెంటాడుతున్నాడు. చివరికి నిరాశగా పెవిలియన్ చేరుకుంటున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు.. పదుల సంఖ్యలో ఇలానే అవుట్ అయినప్పటికీ.. అతడు తన బ్యాటింగ్ స్టైల్ ఏమాత్రం మార్చుకోవడం లేదు. తన నిర్లక్ష్యాన్ని పదే పదే ప్రదర్శిస్తూ ప్రత్యర్థి ఆటగాళ్ల ఎదుట చులకన అవుతున్నాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చేసింది ఒక్క సెంచరీ మాత్రమే. మిగతా అన్ని మ్యాచ్లలో అతడు అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. రెండంకెల స్కోర్ మాత్రమే అతడు చేసిన గొప్ప పని. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. జట్టు ఓటమి అంచులో ఉన్నప్పుడు.. అతడు ఏమాత్రం తెగువ ప్రదర్శించలేదు. దూకుడును కొనసాగించలేదు. నేర్పరితనాన్ని బయట పెట్టలేదు. ఇలా వస్తున్నాడు.. అలా వెళ్ళిపోతున్నాడు. అంతిమంగా పరువు తీసుకుంటున్నాడు. అవుట్ సైడ్ హాఫ్ స్టంప్ బంతులను ఆడటంలో మొదటి నుంచి కూడా విరాట్ కోహ్లీ అట్టర్ ప్లాఫ్ అని చెప్పవచ్చు. అయితే దాని నుంచి బయటపడడానికి అతను చాలా ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అదే అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల టీమిండియా విజయం పై అది ప్రభావం చూపిస్తోంది. తాజాగా సిడ్నీ టెస్టులో అదే తప్పును ప్రదర్శించి వికెట్ కోల్పోయాడు. సిడ్నీ టెస్టులో చాలావరకు విరాట్ ఓపికగా ఆడాడు. ఏకంగా 69 బంతులు ఎదుర్కొని 17 పరుగులు చేశాడు. అయితే విరాట్ మారాడు అనుకుంటున్న తరుణంలో అనవసరంగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని వెంటాడాడు. చివరికి వికెట్ పడేసుకున్నాడు.
బోలాండ్ బౌలింగ్లో
బోలాండ్ బౌలింగ్లో 32 ఓవర్ లో వెబ్ స్టర్ కు విరాట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు మొత్తం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకే అవుట్ కావడం విశేషం. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు మ్యాచ్లు కోల్పోయి.. తీవ్ర ఇబ్బందుల్లో పడిన టీమ్ ఇండియాకు సిడ్ని టెస్ట్ లో గెలవడం అత్యంత ముఖ్యం. ఇందులో గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వినడానికి టీమిండియా కు అవకాశాలుంటాయి. వరుసగా అట్టర్ ఫ్లాఫ్ అవుతున్న సమయంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. బుమ్రాకు జట్టు మేనేజ్మెంట్ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. వాస్తవానికి ఈ మ్యాచ్లో కోహ్లీ తన శైలిని మార్చుకున్నాడు. బ్యాటింగ్ చేశాడు. తొలి బంతికే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అసలు సిసలైన టెస్ట్ బ్యాటింగ్ ప్రదర్శించాడు. అయితే మ్యాచ్ సాగుతున్న తరుణంలో.. ఆస్ట్రేలియా బౌలర్లు వేస్తున్న బంతులకు విరాట్ సహనాన్ని కోల్పోయాడు. దీంతో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని అనవసరంగా వెంటాడి.. చివరికి వికెట్ కోల్పోయాడు. విరాట్ కోహ్లీ ఈ సిరీస్లో 8 ఇన్నింగ్స్ లలో ఏడుసార్లు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకే అవుట్ కావడం విశేషం. పెర్త్ టెస్టులో సెంచరీ చేసి ఆకట్టుకున్న కోహ్లీ.. ఆ తర్వాత ఆ స్థాయిలో ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. సహనాన్ని కోల్పోతున్న విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ కు దగ్గరగా వచ్చాడని.. అతడు రిటైర్మెంట్ ప్రకటించి కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని.. కెరియర్ కు ఎండ్ కార్డు ప్రకటించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా హితవు పలుకుతున్నారు..