https://oktelugu.com/

PBKS vs CSK : గెలవాల్సిన మ్యాచ్లో ఓడారు.. పోయి గల్లి క్రికెట్ ఆడుకోపొండి

గెలిచే మ్యాచ్ ఓడిపోవడంతో పంజాబ్ జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.."తక్కువ స్కోరు మ్యాచ్లో ఓడిపోయారు. ముందు మీరు గల్లీలో ప్రాక్టీస్ చేసి.. తర్వాత ఐపీఎల్ ఆడండి అంటూ" పంజాబ్ అభిమానులు దెప్పి పొడుస్తున్నారు.. ఈ విజయంతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో ఐదవ స్థానం నుంచి మూడవ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన చెన్నై జట్టు ఆరు విజయాలతో, 12 పాయింట్లతో కొనసాగుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 5, 2024 / 08:10 PM IST

    PBKS vs CSK

    Follow us on

    PBKS vs CSK : 168.. ఐపీఎల్ లో ఇది అంత పెద్ద లక్ష్యం కాదు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుకు ఇది పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఈ మాత్రం స్కోరును చేజ్ చేయలేక పంజాబ్ తడబడింది. ప్లే ఆఫ్ ముందు గెలిచే మ్యాచ్ లో ఓడిపోయింది. కీలక ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో..మ్యాచ్ ను చేజేతులా చెన్నై జట్టుకు సమర్పించుకుంది.. ధర్మశాల వేదికగా ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో చెన్నై గెలిచింది అనేకంటే.. పంజాబ్ స్వయం కృతాపరాధం వల్ల ఓడిపోయిందనడం సబబు.

    ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 167 రన్స్ చేసింది. ధర్మశాల మైదానం బౌలింగ్ కు అనుకూలించడంతో పంజాబ్ బౌలర్లు పండగ చేసుకున్నారు.. చెన్నై జట్టులో రవీంద్ర జడేజా చేసిన 46 రన్స్ టాప్ స్కోర్ అంటే.. చెన్నై బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చెన్నై ఓపెనర్ అజింక్య రహనే కేవలం 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటి నుంచి మొదలైన చెన్నై జట్టు పేలవ బ్యాటింగ్.. చివరి వరకు కొనసాగింది.. మిచెల్ 30, రుతు రాజ్ గైక్వాడ్ 32, రాణించడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. చివర్లో మొయిన్ అలీ 17, శార్దుల్ ఠాకూర్ 17 రన్స్ చేసి చెన్నై జట్టు 167 పరుగుల స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో శివం దూబే, మహేంద్ర సింగ్ ధోని డక్ ఔట్ అయ్యారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్షల్ పటేల్, మూడు వికెట్లు పడగొట్టారు. అర్ష్ దీప్ రెండు వికెట్లు సాధించాడు.

    168 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు.. 7 పరుగులకే జానీ బెయిర్ స్టో, రిలే రొసౌ (0) వెంట వెంటనే అవుట్ అయ్యారు..ప్రభ్ సిమ్రాన్ సింగ్ 30, శశాంక్ సింగ్ 27 మూడో వికెట్ కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మిచెల్ శాంట్నర్ ఔట్ విడదీశాడు. ఇక అప్పటినుంచి పంజాబ్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కేవలం 15 పరుగుల వ్యవధిలో ప్రభ్ సిమ్రాన్ సింగ్ 30, జితేష్ శర్మ 0, సామ్ కరణ్ 7 అవుట్ కావడంతో పంజాబ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. హర్షల్ పటేల్ 12, రాహుల్ చాహర్ 16 కాసేపు ప్రతిఘటించినప్పటికీ.. ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే సాధించాల్సిన పరుగులు పెరిగిపోవడం.. ఓవర్లు కరిగిపోవడంతో.. పంజాబ్ జట్టు కథ 139 రన్స్ వద్ద ముగిసింది. దీంతో 28 పరుగుల తేడాతో చెన్నై జట్టు విజయాన్ని అందుకుంది. ప్లే ఆఫ్ ముందు సరైన విజయాన్ని దక్కించుకొని.. ఆశలను సజీవంగా ఉంచుకుంది.

    చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్ తోనూ మెరిసి 43 రన్స్ చేశాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో అదరగొట్టి.. చెన్నై జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తుషార్ దేశ్ పాండే, సమర్ జీత్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శాంట్నర్, శార్దూల్ ఠాకూర్ తలా ఒక వికెట్ తీశారు. గెలిచే మ్యాచ్ ఓడిపోవడంతో పంజాబ్ జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది..”తక్కువ స్కోరు మ్యాచ్లో ఓడిపోయారు. ముందు మీరు గల్లీలో ప్రాక్టీస్ చేసి.. తర్వాత ఐపీఎల్ ఆడండి అంటూ” పంజాబ్ అభిమానులు దెప్పి పొడుస్తున్నారు.. ఈ విజయంతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో ఐదవ స్థానం నుంచి మూడవ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన చెన్నై జట్టు ఆరు విజయాలతో, 12 పాయింట్లతో కొనసాగుతోంది.