Virat Kohli :పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరికీ రక్తం మరిగిపోతుంటుంది. మరి విరాట్ కోహ్లీకి కూడా అలాగే ఉంటుందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది. పాక్ తో మ్యాచ్ అనగానే రెచ్చిపోయి పరుగుల వరద పారిస్తాడు విరాట్. ఆదివారం జరిగిన మ్యాచ్ లో కూడా విరాట్ విశ్వరూపం చూపించాడు.దీంతో ప్రస్తుతం ఓ పాకిస్తానీ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.ఈ విరాట్ కోహ్లి ఎప్పుడూ మనపైనే ఎందుకు ఎక్కువ కసిగా ఆడతాడు. మనం అతడిని ఏమైనా బాధపెట్టిమా.. మనమేం చేశాం..అంటూ రాసుకొచ్చాడు. వాస్తవానికి నిన్నటి మ్యాచ్ లో స్లో పాయిజన్‌లా సింగిల్స్, డబుల్స్‌తో పాక్ నుంచి మ్యాచ్‌ను తన వైపు లాగేసుకున్నాడు. ఎంతో కాలంగా తన నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురు చూపులకు తెరదించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నిన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో డిఫరెంట్ విరాట్ కనిపించాడు.
వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తన ఫామ్ ను కోల్పోయి తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నాడు. దాదాపు కొన్నేళ్ల తర్వాత ఆడిన ఏకైక రంజీ మ్యాచ్ లో కూడా ఆయన పేలవమైన ప్రదర్శన ఇచ్చారు. ఓ రైల్వేస్ బౌలర్ అతడిని క్లీన్‌బౌల్డ్ చేశాడంటే తన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక విమర్శకులు అయితే ఇంకెన్నాళ్లు ఇలా తడబడుతూ ఆడవావు రిటైర్ మెంట్ ప్రకటించవచ్చుగా అంటూ ప్రచారాన్ని మరోసారి ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. దీనికి తోడు ట్రేడ్ మార్క్ షాట్ కవర్ డ్రైవ్ అతగాడి అవుట్లకు మెయిన్ రీజన్ గా మారిపోయింది. మరోవైపు బౌలర్లు ఫిఫ్త్ స్టంప్‌నకు గురిపెట్టి అతడిని తరచూ అవుట్ చేసేవారు.ఇక ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో మాత్రం ఓ అర్ధశతకం బాది ప్రస్తుతం నేను రెడీ అవుతున్నాను అనే సంకేతాలు ఇచ్చాడు.
ఇక పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే చాలు.. విరాట్ ఓ యుద్ధానికి రెడీ అవుతున్నట్లు ప్రాక్టీస్ చేస్తాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌కు ముందు దుబాయ్‌లో కూడా నెట్స్‌కు అందరికంటే రెండు మూడు గంటల ముందే వచ్చి ప్రాక్టీస్ చేశాడు. ఆ ఫలితాన్ని తాను మ్యాచ్‌లో అందుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ మ్యాచ్ పరిస్థితులను అంచనావేయడంలో దిట్ట. తాజా మ్యాచ్‌లో కూడా రోహిత్ తర్వాత మరో వికెట్ వెంటనే కోల్పోకుండా మెల్లగా ఆడుతూ టాప్ గేర్ లోకి దూసుకెళ్లాడు. సెంచరీ కోసం 46 సింగిల్స్, 13 డబుల్స్ చేశాడు. ఈ క్రమంలో పాక్ ఆటగాళ్లు అవుట్ చేయాలని ఎంత కవ్వించినా..త న సహనాన్ని కోల్పోకుండా స్థిరంగా ఇన్నింగ్స్ ముందుకు సాగించాడు. ఇది విరాట్ అసలైన వాస్తవానికి పూర్తిగా భిన్నం. పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో మొత్తం 17 వన్డేలు ఆడాడు. వాటిల్లో 4 సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పాక్ పై 2015 నుంచి ఆడిన మ్యాచుల్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలున్నాయి.