Virat Kohli: విరాట్ కోహ్లీ సోమవారం సుదీర్ఘ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నట్టు ప్రకటించాడు. దీంతో యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. వాస్తవానికి కొన్ని సంవత్సరాలుగా టెస్ట్ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని విరాట్ కోహ్లీ భావిస్తున్నాడు. అయితే రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన తర్వాత ఇదే మంచి సమయం అని విరాట్ భావించాడు. అదే విషయాన్ని బీసీసీఐ పెద్దల ముందు ఉంచితే వారు కాస్త ఆలోచించుకోవాలని సూచించారు.. దీనికి రెండు రోజుల సమయం తీసుకున్న విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇన్ని రోజులపాటు అద్భుతమైన టెస్ట్ క్రికెట్ ను ఆస్వాదించానని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. తనకు సపోర్ట్ గా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.. తన వీడ్కోలు నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా విరాట్ కోహ్లీ ప్రకటించాడు.. ఇక అది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా ఉంది.. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో తనకంటూ ఒక శకాన్ని నిర్మించుకున్నాడు. టీమ్ ఇండియాను ఏకంగా అగ్రస్థానంలో నిలిపాడు. ధోని వెళ్ళిపోతున్నప్పుడు టీమిండియా టెస్ట్ ఫార్మాట్లో అధమ స్థానంలో ఉండేది. ఆస్థానం నుంచి టీమిండియాను అతడు ఏకంగా ప్రథమ స్థానం వరకు పరుగులు పెట్టించాడు. టీమిండియా టెస్ట్ ప్రస్థానంలో అత్యధిక విజయాలు సాధించిన సారధిగా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
Also Read: ప్రధాని మోదీ IAF సందర్శన.. ఆపరేషన్ సిందూర్ వీరులకు అభినందన
అదిరిపోయే రేంజ్ లో ఫేర్వెల్
కింగ్ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా వై దొలగిన నేపథ్యంలో అతడికి అత్యంత గ్రాండ్ గా ఫేర్వెల్ పలకాలని బెంగళూరు అభిమానులు కోరుతున్నారు.. ఐపీఎల్ రీఓపెన్ తర్వాత ఫస్ట్ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో తలపడుతోంది. ఈ మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. ఈ మ్యాచ్ గనుక బెంగళూరు గెలిస్తే మరో మాటకు తావు లేకుండా ప్లే ఆఫ్ వెళ్లిపోతుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీకి గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వాలని ఆర్ సి బి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ” బెంగళూరు ఇంతవరకు ట్రోఫీలు సొంతం చేసుకోలేకపోయినప్పటికీ.. ఐపీఎల్ లో బెంగళూరు తరఫున విరాట్ కోహ్లీ సూపర్ నాక్స్ ఆడాడు. అతని గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. పైగా అతడు దూకుడుకు మారుపేరుగా బ్యాటింగ్ చేసిన మొనగాడు. అందువల్లే అతడిని ఎప్పటికీ మేం గుర్తుంచుకుంటాం. బెంగళూరుకు వేగం అంటే ఏమిటో చూపించాడు. ఎదురుదాడి అంటే ఏమిటో నేర్పించాడు. అటువంటి ఆటగాడు సుదీర్ఘ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలికిన తర్వాత.. అతడు ఆడిన ఆటను గుర్తుపెట్టుకుంటూ..కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగే మ్యాచ్లో బెంగళూరు ప్లేయర్లు మొత్తం వైట్ జెర్సీ ధరించాలి. విరాట్ కోహ్లీకి అద్భుతమైన ఫేర్వెల్ ఇవ్వాలని” బెంగళూరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. మరి దీనిని బెంగుళూరు జట్టు మేనేజ్మెంట్ పాటిస్తుందా? అనేది చూడాల్సి ఉంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్లో బెంగళూరు జట్టు ఏదో ఒక మ్యాచ్లో గ్రీన్ జెర్సీ ధరిస్తుంది.