
Virat kohli: “విజయాలు సాధిస్తున్నంత కాలం అంతా బాగానే ఉంటుంది. అపజయాలు మొదలైనప్పుడే అసలు ఆట మొదలవుతుంది” అని ఓసారి అన్నాడు మాజీ కెప్టెన్ గంగూలీ. ఇది ఎంత అక్షర సత్యమో.. కోహ్లీ పరిస్థితిని చూస్తే అర్థమైపోతుంది. మొన్నటి వరకూ తిరుగులేని ఆటగాడిగా.. కెప్టెన్ గా సత్తాచాటిన కోహ్లీ.. అత్యంత వేగంగా కిందకు పడిపోయాడనే చెప్పాలి. ఎంతగా అంటే.. అనివార్యంగా తనకు తానే టీ20 కెప్టెన్సీ వదులుకునేంతగా! అయితే.. ప్రపంచకప్ లో.. దారుణ పరాభవంతో భారత్ నిష్క్రమించిన తీరుతో.. అతని అంచనాలన్నీ తలకిందులై.. టెస్టు కెప్టెన్సీ కూడా ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
టీమిండియా టీ20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్ గా.. రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. నిజానికి.. ఏ బోర్డు అయినా.. సుదీర్ఘ కాలం జట్టుకు సేవలందించే వ్యక్తిని కెప్టెన్ గా ఎంచుకుంటుంది. మళ్లీ.. మళ్లీ.. కెప్టెన్ గోల లేకుండా చూసుకుంటుంది. కానీ.. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ.. ఎలాంటి సంచలనాలకూ తావివ్వకుండా రోహిత్ శర్మకే టి20 పగ్గాలు అప్పగించింది. కేఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయోగాల జోలికి పోలేదు. టీమీండియా వరల్డ్ కప్ నుంచి అవమానకరంగా వెనుదిరిగిన వేళ.. రాబోయే సిరీస్ లకు అనుభవమే కీలకంగా భావించి.. రోహిత్ ను ఎంపిక చేసి ఉండొచ్చు. అతని సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది. గతంలో.. కోహ్లి గైర్హాజరీలో 19 మ్యాచ్‌ల్లో టి20 జట్టుకు నాయకత్వం వహించాడు. ఇందులో.. ఏకంగా 15 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం 4 మ్యాచ్‌ల్లోనే ఓడింది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుని రోహిత్ కే పగ్గాలు అప్పగించింది. న్యూజిలాండ్ తో టీ-20 సిరీస్ లో కోహ్లీకి విశ్రాంతి కల్పించినట్లు చెప్పిన బీసీసీఐ.. రోహిత్ ను సారధిగా ప్రకటించింది.
అయితే.. లేటెస్ట్ సమాచారం ఏమంటే.. టెస్ట్ సిరీస్ కు కూడా విరాట్ కోహ్లీని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ ముగిశాక రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇందులో.. తొలి టెస్టుకు కూడా కోహ్లి అందుబాటులో ఉండటంలేదని.. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మనే రెండు టెస్టులకూ టీమిండియాకు నేతృత్వం వహిస్తాడని సమాచారం. అందులోనూ రోహిత్ హిట్ కొడితే.. కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి కూడా ప్రమాదం పొంచి ఉన్నట్టే అని అంటున్నారు.
మొత్తానికి పూలమ్మిన చోటనే.. కట్టెలమ్ముకునే పరిథితిని ఎదుర్కొంటున్నాడు కోహ్లీ. బ్యాటర్ గా తిరుగులేని సక్సెస్ అందుకున్న కోహ్లి.. కెప్టెన్‌గా మాత్రం పెద్దగా రాణించలేదు. మరి, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: ఇక అన్ని మ్యాచ్ లు గెలవాల్సిందే..!లేకుంటే..?