ఎన్నో అంచనాలు.. ఎన్నెన్నో రికార్డులు.. ఇప్పటి వరకు పై చేయి సాధిస్తూ వస్తున్న భారత్ క్రీడాకారులు ఇటీవల జరిగిన మ్యాచ్ తో ఢీల పడ్డారు. ఆదివారం జరిగిన మ్యాచ్ అంచనాలను తలకిందులు చేసింది. టీ 20, వన్డే కప్ లో తొలిసారి పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోయింది. పక్కా ప్రణాళికతో మైదానంలో అడుగుపెట్టినా ప్రత్యర్థి వేసిన వ్యూహాం భారత్ కు షాక్ నిచ్చింది. ఓ వైపు దేశ అభిమానులు ‘సూపర్ సండే’ అనుకొని ఆశగా ఎదురుచూస్తున్న వారికి అడియాశలే అయ్యాయి. అయితే జరిగిందేదో.. జరిగింది.. ఇకనైనామేల్కోకపోతే కనీస ఇండియా జట్టుకు కనీస ర్యాంకు కూడా వచ్చే అవకాశం లేదని క్రీడా నిపుణులు అంటున్నారు.
టీ 20 ప్రారంభంలోనే భారత్ కు పెద్ద షాక్ తగిలింది. ఓ మ్యాచ్ ఓటమి పాలు కావడంతో పాటు దాయాది దేశంపై ఓడిపోవడం అభిమానులకు నిద్రలేకుండా చేసింది. అయితే ముందు ముందు ఇంకా మేల్కోకపోతే మరింత డేంజర్లో పడే అవకాశం ఉందని అంటున్నారు. గ్రూప్ 2లో ఉన్న భారత్ ఇప్పటికే ఓ మ్యాచ్ కోల్పోయింది. ఇక అప్ఘనిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్, న్యూజిలాండ్ దేశాలతో భారత్ ఆడనుంది. అయితే తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సెమిస్ చేరుతాయి.
మొత్తం 5 మ్యాచుల్లో కనసీం నాలుగు మ్యాచులు గెలవాలి. అంటే ఇక ఆడబోయే ప్రతీ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. అయితే అప్ఘనిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్ జట్లు పెద్ద పోటీ ఇవ్వకపోయినా వారి విషయంలోనూ జాగ్రత్తలు పాటించకపోతే మొదటికే మోసం ఏర్పడే అవకాశాలున్నాయి. ఇక న్యూజిలాండ్ పై భారత్ గెలిచి, ఆ తరువాత మూడు జట్లపై గెలిస్తే 8 పాయింట్లు వస్తాయి. ఒకవేళ న్యూజిలాండ్ పై ఓడి మిగతా జట్లపై గెలిచినా 6 పాయింట్లు వస్తాయి. కానీ అప్పుడు సెమిస్ చేరే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ఇక జట్టులో అనేక లోపాలున్నట్లు కొందరు క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. బౌలింగ్ సరిగా లేనప్పడు హార్థిక్ పాండ్యకు అవకాశం ఎందుకు ఇస్తున్నారని అంటున్నారు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో ఆరో బౌలర్ లేడు. దీంతో శార్దూల్ ను తీసుకుంటే బాగుండునని అంటున్నారు. లేదా భువనేశ్వర్ స్థానంలో శార్దూల్ ను తీసుకొని, హార్థిక్ బదులుగా ఇషాన్ ను ఆడించాల్సి ఉండేది అని అంటున్నారు. అయితే జరగబోయే మ్యాచ్ లో విరాట్ కోహ్లి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంటున్నారు.