Virat Kohli: భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ సోమవారం తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌కు కేవలం 53 నిమిషాల్లోనే 5.3 మిలియన్ లైక్స్ వచ్చాయంటే మామూలు విషయం కాదు. వేలల్లో కామెంట్లు, షేర్లు వెల్లువెత్తాయి. అసలు కింగ్ కోహ్లీ ఏం చేశాడు? ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ వార్త సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తోంది. ఆయన అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు అనౌన్స్ చేయగానే, ఆయన పోస్ట్‌కు 53 నిమిషాల్లో 5.3 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఆయన ఫ్యాన్స్ మధ్య ఆయనకున్న క్రేజ్, గౌరవం ఈ నెంబర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ నిర్ణయంపై అభిమానులే కాదు, క్రికెట్ ఎక్స్‌పర్ట్‌లు, ఆయనతో ఆడిన ప్లేయర్లు కూడా తమ అభిప్రాయాలు చెప్తున్నారు.
కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. కానీ ఆయన అభిమానులు మాత్రం ఆయన్ని ఒక గొప్ప క్రికెటర్‌గా, భారత క్రికెట్‌లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఇప్పటికీ భావిస్తున్నారు. ఆయన పోస్ట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందరి కళ్లూ ఇప్పుడు ఆయన మీదే ఉన్నాయి.
సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీనే ఇండియాలో అత్యధిక మంది ఫాలో అవుతున్న క్రికెటర్. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 271 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. కానీ ఆయన మాత్రం కేవలం 277 మందిని మాత్రమే ఫాలో బ్యాక్ చేస్తాడు. కోహ్లీ ఇప్పటివరకు 1,030 పోస్టులు పెట్టాడు. కింగ్ కోహ్లీ సోషల్ మీడియాలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
విరాట్ క్రికెట్ కెరీర్ ఒకసారి చూస్తే..
విరాట్ కోహ్లీ 2011లో తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌ను మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్‌లో అద్భుతంగా ఆడాడు. కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌లలో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సహాయంతో మొత్తం 9230 పరుగులు చేశాడు. ఆయన టెస్ట్ క్రికెట్ కెరీర్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.