Viral Video: మైదానంలో పిడుగుపాటు.. చూస్తుండగానే ఫుట్ బాలర్ మృతి .. వైరల్ వీడియో

ఫుట్ బాల్ మ్యాచ్ లలో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదాలు సర్వ సాధారణమైనప్పటికీ.. అవి కూడా ఆటను మరో స్థాయికి తీసుకెళ్తాయి. ఆ ప్రమాదాలు కూడా ఆటలో ఉద్వేగాన్ని పెంచుతాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : February 12, 2024 2:48 pm
Follow us on

Viral Video: ఆట అనేది క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఆడుతున్నంత సేపు ఆనందాన్నిస్తుంది. గెలవాలి అనే కసిని పెంచుతుంది.. ఈ భూమి మీద ఆడే ఆటల్లో పై అనుభూతులను పంచే ఆటల్లో ఫుట్ బాల్ అత్యంత ప్రముఖమైనది. కేవలం ఈ ఆట ఆధారంగా వేలకోట్ల వ్యాపారం సాగుతోంది. ఇటీవల ఖతార్ దేశంలో ఫిపా వరల్డ్ కప్ జరిగింది. ఈ టోర్నీ నిర్వహించేందుకు ఏకంగా ఆ దేశం ప్రత్యేకంగా మైదానాలు నిర్మించింది. వందల కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా ఆ దేశానికి వేలకోట్ల ఆదాయం వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులతో హోటల్స్ మొత్తం కిటకిటలాడాయి. విమానాశ్రయాలు రద్దీగా మారాయి. మైదానాలు కిక్కిరిసిపోయాయి. కేవలం ఫిపా వరల్డ్ కప్ మాత్రమే కాదు మామూలుగా ఆడే మ్యాచ్ లకు కూడా అభిమానులు భారీగా హాజరవుతుంటారు. ఈ మ్యాచ్ లు నిర్వహించే వారు కూడా హక్కుల రూపంలో, టికెట్ల రూపంలో భారీగా ఆర్జిస్తుంటారు.

ఇలాంటి ఫుట్ బాల్ మ్యాచ్ లలో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదాలు సర్వ సాధారణమైనప్పటికీ.. అవి కూడా ఆటను మరో స్థాయికి తీసుకెళ్తాయి. ఆ ప్రమాదాలు కూడా ఆటలో ఉద్వేగాన్ని పెంచుతాయి. కానీ ఇది మాత్రం మాటలకందని విషాదం. మైదానంలో పిడుగు పడి ఫుట్ బాలర్ దుర్మరణం చెందాడు. మైదానంలో ప్రేక్షకులు చూస్తుండగానే అతడు కన్నుమూయడం అందరిని షాక్ కు గురి చేసింది. ఈ దారుణమైన సంఘటన ఇండోనేషియాలో జరిగింది. ఇండోనేషియాలో ఓ మైదానంలో ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశం స్వల్పంగానే మేఘావృతమైంది. వర్షం తాలూకూ ఛాయలు ఏమీ లేకుండానే ఒకసారి గా ఆకాశంలో పెద్ద శబ్దంతో పిడుగు పడింది. ఆ పిడుగు పడిన ధాటికి ఓ ఆటగాడు మృతి చెందాడు. ఇప్పటిదాకా మైదానంలో చురుకుగా కదిలిన ఆ ఆటగాడు చూస్తుండగానే కన్ను మూయడం అందర్నీ కలిచివేసింది. తోటి ఆటగాడు కన్నుమూయడంతో అతడి సహచర ఆటగాళ్లు మొత్తం కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇండోనేషియాలో ఆదివారం ఎఫ్బీఐ సబంగ్, బాడుంగ్ ఫుట్ బాల్ క్లబ్ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. గోల్ కొట్టేందుకు ఇరుజట్ల ఆటగాళ్లు పోటాపోటీగా తలపడ్డారు. ఈ క్రమంలో మైదానంలో ఉన్న సబంగ్ ఆటగాడి పై ఒక్కసారిగా పిడుగు పడింది. వాస్తవానికి అప్పటివరకు ఆ ప్రాంతంలో ఆకాశం స్వల్పంగానే మేఘావృతమై ఉంది. వర్షం కూడా కురవలేదు. ఆ శబ్దం విని అందరూ ఒక్కసారిగా మైదానంలో పడుకుండిపోయారు. కాసేపటికి లేచి చూడగా ఆటగాడు మాత్రం అలాగే పడి ఉన్నాడు. దీంతో స్టేడియంలో సిబ్బంది అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు విడిచినట్టు వైద్యులు తెలిపారు. పిడుగుపాటు వల్ల విడుదలైన వేడికి అతడు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు పేర్కొన్నారు.