Vinesh Phogat : పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచి.. భారత్ పరువు కాపాడుతుందనుకున్న మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ అనూహ్యంగా అనర్హత వేటు ఎదుర్కొంది. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. రెజ్లింగ్ విభాగంలో సంచలన ప్రదర్శనతో వినేశ్ ఫొగట్ అద్భుతమైన విజయాలు సాధించింది. సెమీ ఫైనల్ లో హోరాహోరీగా తలపడి విజేతగా ఆవిర్భవించింది. కీలక పోరులో సత్తా చాటి స్వర్ణం సాధిస్తుందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా వేటు ఎదుర్కొంది.. అధిక బరువు వల్ల పోటీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. రెజ్లింగ్లో 50 కిలోల ప్రీ స్టైల్ విభాగంలో వినేశ్ ఫొగట్ పోటీ పడింది. అయితే ఆమె 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండటం వల్ల.. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం ఆమెపై అనర్హత వేటు విధించారు..
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం..
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం బరువు ప్రమాణాలను అందుకోని అథ్లెట్ల పై అనర్హత వేటు విధిస్తారు. అంతేకాకుండా ఆ పోటీలలో చివరి ర్యాంక్ కేటాయిస్తారు. రెజ్లింగ్ నిబంధనల ప్రకారం ప్రతి విభాగంలో పోటీలు జరిగే రోజు ఉదయం ఆ రెజ్లర్ ఆయా విభాగాలలో ఉండాలని గుర్తు చేసేందుకు.. వారి వెయిట్ చెక్ చేస్తారు.. భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ తన బరువును కూడా ఇవే నిబంధనల ప్రకారం తూచుకుంది. మంగళవారం ఆమె 50 కిలోల బరువు మాత్రమే ఉంది. ఫైనల్ చేరిన తర్వాత ఆమె అనూహ్యంగా రెండు కిలోల బరువు పెరిగినట్టు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సెమీఫైనల్ కు ముందు ఆమె శక్తి కోసం ఫ్లూయిడ్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ఆమె అనూహ్యంగా బరువు పెరిగినట్టు సమాచారం. బరువు తూచుకున్న తర్వాత ఆమె ఒక్కసారిగా దానిని తగ్గించేందుకు సాధన మొదలుపెట్టింది.
బరువును తగ్గించుకునేందుకు..
అనూహ్యంగా పెరిగిన తన శరీర బరువును తగ్గించుకునేందుకు వినేశ్ ఫొగట్ తీవ్రమైన సాధన మొదలుపెట్టింది. జాగింగ్ చేసింది. స్కిప్పింగ్ ఆడింది. మైదానంలో కఠినమైన రన్నింగ్ చేసింది. ఈ క్రమంలో ఆమె 1.9 కిలోలు మాత్రమే తగ్గింది. చివరికి ఆమె 100 గ్రాముల బరువుతో డిస్ క్వాలీ ఫై అయింది. వాస్తవానికి తన బరువును తగ్గించుకునేందుకు కొంచెం టైం కావాలని భారత ఒలింపిక్ కమిటీ విజ్ఞప్తి చేసింది. అయితే ఈ విజ్ఞప్తిని పారిస్ ఒలంపిక్ కమిటీ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో వినేశ్ ఫొగట్ డిస్ క్వాలి ఫై కావలసి వచ్చింది. ఇదే సమయంలో ఒలింపిక్ కమిటీ లేనిపోని రూల్స్ తీసుకొచ్చి భారత్ కు మెడల్ ను దూరం చేశాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా కష్టపడిన అథ్లెట్లకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా నష్టం చేకూర్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినేశ్ ఫొగట్ అద్భుతమైన ప్రదర్శన చూపించిందని.. ఫైనల్స్ లో ఆడించకపోయినప్పటికీ.. గతంలో సాధించిన విజయాల ఆధారంగా రజత పతకం ఇవ్వాల్సి ఉండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ నిషేధం ఎదుర్కొన్న ఇమానే ఖలీఫ్ ను అనుమతించిన ఒలింపిక్ కమిటీ..వినేశ్ ఫొగట్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు.. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉన్నదనే సాకుతో వినేశ్ ఫొగట్ ఆడించకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఒలింపిక్ కమిటీ ద్వంద్వ వైఖరి పై మండిపడుతున్నారు.. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాల్సిన ఒలంపిక్ కమిటీ.. ఇలా వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నారు.